logo

లారీ పరిశ్రమకు సర్కారీ దెబ్బ

రాష్ట్రంలో.. ఉమ్మడి జిల్లాలో కీలకమైన లారీ పరిశ్రమ సాలూరులో ఉంది. గతంలో వేలాది మందికి జీవనాధారం. లోడింగ్‌ అన్‌లోడింగ్‌లతో కార్మికులు, యాజమానులు ఎంతో బిజీగా గడిపేవారు.

Published : 18 Apr 2024 05:32 IST

పన్నులు, ధరల పెంపుతో కుదేలు
రోడ్డున పడ్డ యాజమాన్యం, కార్మికులు
న్యూస్‌టుడే, సాలూరు

లోడింగ్‌ లేక యూనియన్‌ ఆఫీసు వద్ద లారీలు

పన్నులు.. బీమా.. పెరిగిన స్పేర్‌ పార్టులు, ఇంధన ధరలు.. ఇవి చాలవన్నట్లు లోడు ఎత్తు పెరిగిందని, తలుపు తీసి ఉందని భారీగా రుసుముల విధింపు.. గతంలో రూ.200-రూ.300 ఉండే హరిత పన్ను అమాంతం రూ.20 వేలకు పెంపు..

ఇదీ వైకాపా ప్రభుత్వం లారీ పరిశ్రమను కుదేలు చేసిన తీరు..  వేలాది మంది కార్మికులను వీధిన పడేసింది.


రాష్ట్రంలో.. ఉమ్మడి జిల్లాలో కీలకమైన లారీ పరిశ్రమ సాలూరులో ఉంది. గతంలో వేలాది మందికి జీవనాధారం. లోడింగ్‌ అన్‌లోడింగ్‌లతో కార్మికులు, యాజమానులు ఎంతో బిజీగా గడిపేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వాహనాలు అక్కడే ఖాళీగా ఉంటున్నాయి. పన్ను పెంపు, ధరల భారం తట్టుకోలేక కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు యజమానులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా బాడీ బిల్డింగ్‌ పనులు లేక, కార్మికులకు పనులు లేక ఉపాధి కోల్పోతున్నారు.


ఇదీ లెక్క

  • 16 టైర్ల లారీ విశాఖ నుంచి రాయపూర్‌ లోడింగ్‌, అన్‌లోడింగ్‌కి వెళ్లి వస్తే రూ.96 వేలు వస్తోంది.
  • డీజిల్‌, ఇతర ఖర్చులు రూ.75 వేలు
  • ఏడాదికి రవాణా పన్ను రూ.62 వేలు, నేషనల్‌ పర్మిట్‌కి రూ.19 వేలు, లారీ ఇన్సూరెన్స్‌కి రూ.80 వేల వరకు చెల్లించాలి.
  • ఇవి కాకుండా డ్రైవర్‌, క్లీనర్ల జీతాలు అదనం.
  • టైర్లు, స్పేరు పార్టులపై 50 శాతం వరకు ధరలు పెరిగాయి. దీంతో నడపటం కష్టంగా మారింది.

బాడీ బిల్డింగ్‌ పనులు చేస్తున్న మోటారు కార్మికులు


మిగులు లేదు.. తగులే

విశాఖ- రాయపూర్‌ లోడింగ్‌ ప్రధాన ఆధారం. గతంలో ఒక్కో లారీకి నెలకు 4 లేదా 5 లోడ్లు ఉండేవి. రూ.15 నుంచి రూ.20 వేలు మిగిలేది. ఇప్పుడు నెలకు మూడు లోడులు కష్టమే. ఇప్పుడు అన్ని ఖర్చులు పోను రూ.5 వేలు కూడా మిగలడం లేదు. దీంతో, యార్డు నుంచి లారీలు తీయడానికే యజమానులు వెనుకంజ వేస్తున్నారు. ఫైనాన్స్‌ కంపెనీలకు వాయిదాలు సకాలంలో చెల్లించలేక లారీలను అప్పగిస్తున్నారు. ఫైనాన్స్‌ కంపెనీలు కూడా తీసుకెళ్లలేక యజమానులు తీసుకున్న అప్పులపై ఓడీల పేరుతో అదనపు భారం వేస్తున్నారు.


లారీలు: సుమారు   రెండు వేలు
ఉపాధి: ప్రత్యక్షంగా చోదకులు, క్లీనర్లు నాలుగు వేల మంది, పరోక్షంగా మరో ఆరు వేల మంది.
18 విభాగాల్లో: బాడీబిల్డింగ్‌, పెయింటింగ్‌, స్టిక్కరింగ్‌, టైర్లు, అద్దాలు, వెల్డింగ్‌ తదితర 18 విభాగాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు.


బాదుడే.. బాదుడు

లోడింగ్‌ చేసినప్పుడు ఉండాల్సిన ఎత్తు కంటే ఎక్కువ ఉందని రూ.20 వేలు అపరాధ రుసుము విధిస్తున్నారు. గతంలో ఇది రూ.1000 ఉండేది. తలుపు తెరిచి ఉంటే అదనంగా మరో రూ.5 వేలు, రూ.10 వేల వరకు కట్టాల్సిందే. లోడింగ్‌ ఎత్తుగా ఉందని 2019లో ఓ వాహనదారుడికి రూ.1000 ఫైన్‌ వేశారు. ఆ మొత్తం చెల్లించినప్పటికీ మిగిలిన రూ.19 వేలు కట్టాలని ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు జారీ చేసిందని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది చెల్లించకపోతే క్వార్టర్‌ ట్యాక్స్‌, బ్రేక్‌ నిలుపుదల చేస్తామంటున్నారని చోదకులు వాపోతున్నారు.


గడ్డు పరిస్థితి
- ఐ.నారాయణరావు, కార్యదర్శి, లారీ యజమానుల సంఘం, సాలూరు

అయిదేళ్లు లారీ మోటారు పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. ఇంధన ధరలతో పాటు, ఇతర ట్యాక్సులు విపరీతంగా పెంచేశారు. గతంలో ఒక ట్రిప్పు వెళ్లి వస్తే రూ.10 వేలు పైబడి మిగిలేది. ఇప్పుడు నష్టమే తప్ప లాభం లేదు.


సక్రమంగా తిరగడం లేదు
- ఎన్‌.మహేష్‌, లారీ ఓనరు, సాలూరు

వాహనాలు పూర్తిస్థాయిలో తిప్పడం లేదు. దీంతో, కార్మికులకు పనిలేని పరిస్థితి. నెలకు మూడు నాలుగు ట్రిప్పులు వెళ్లేవాళ్లం. కానీ, ఇప్పుడు రెండు ట్రిప్పులు కూడా తిరగడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని