logo

అందరూ నన్ను తిట్టుకుంటే.. మీరు ఓట్లు దండుకుంటారా..

ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు.

Published : 30 Apr 2024 04:40 IST

న్యూస్‌టుడే, వీరఘట్టం: ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు. వీరఘట్టం అంత చెత్త రోడ్డును ఎక్కడా చూడలేదని, ఇంత దరిద్రంగా ఉందని తిడుతుంటే నాలో నేను కుమిలి పోయా. నన్ను బాగు చేయకపోతారా అని ఎదురు చూసినా ఎవరూ శ్రద్ధ చూపకపోవడంతో కుంగిపోయా.    

2022లో ఫిబ్రవరిలో హడావుడిగా భూమి పనులు చేస్తే మంచి రోజులు వచ్చాయని సంతోషపడ్డాను. నా మీదుగా ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లా, మన్యంలో 65 గ్రామాల ప్రజలు సంతోషంగా వెళ్తారని భావించి ఆనందపడ్డాను. కానీ అది కొన్ని రోజులకే పరిమితమైంది. ఎప్పుడు పని ఆగుతుందో.. ఎప్పుడు జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యా. నన్ను విస్తరించేందుకు ఎందరో ఇళ్లను కూలగొట్టడంతో వారంతా బతుకులు కోల్పోతే కన్నీళ్లు పెట్టా. అయినా వారు వలస బాట పడుతూ ఎన్నో తిట్టుకున్నారు. నాపై దుమ్ము, ధూళి రేగి దుకాణాలు, వాహనదారుల కళ్లలో పడి అనారోగ్యానికి గురై శాపనార్థాలు పెట్టారు. పనులు ప్రారంభించింది మొదలు ఇప్పటివరకు ఎన్నో తిట్లు, అవమానాలను భరిస్తూ వచ్చా. ఇన్ని నెలలు నన్ను పట్టించుకోకుండా వదిలేసిన మీరు.. ఓట్ల కోసం ఇటీవల నా అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇలా నన్ను వాడుకొని ఓట్లు దండుకోవాలని చూస్తారని ఏనాడు ఊహించలేదు. ఓ వైపు బాగు పడుతున్నా.. మీ దుర్భుద్ధిని చూసి బాధ పడుతున్నా.

ఇట్లు, మీ వీరఘట్టం రోడ్డు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని