logo

అలక వీడని చినుకు

ఈసారి 5 మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైంది. రాచర్లలో 51, బేస్తవారపేట 40, గిద్దలూరులో 35 శాతం ఎక్కువగా కురిసింది. సెప్టెంబర్‌ ఆదుకుంటుందని రైతులు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి

Published : 28 Sep 2022 02:25 IST

14 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే

త్రిపురాంతకం మండలం అన్నసముద్రంలో దెబ్బతిన్న జొన్న

ఈసారి 5 మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైంది. రాచర్లలో 51, బేస్తవారపేట 40, గిద్దలూరులో 35 శాతం ఎక్కువగా కురిసింది. సెప్టెంబర్‌ ఆదుకుంటుందని రైతులు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. అరకొర వర్షపు జల్లులు తప్ప చెరువులు, దొరువులు నిండటంలేదు.

ఖరీఫ్‌ కాలం ఈనెలాఖరుతో ముగిసిపోతుంది. పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మండు వేసవిని తలపిస్తున్న వాతావరణం వారిని కలవరపరుస్తోంది. పెట్టుబడి ఖర్చులకైనా దిగుబడులు వస్తాయా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కంది, మొక్కజొన్న, మిరప, మినుము, జొన్న, సజ్జ పంటలు గిడసబారిపోతున్నాయి. జిల్లాలో 38 మండలాలకు గాను 14 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. సాగర్‌ నీరు ఆగస్టులో విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు అందడంలేదు. తాళ్లూరు మండలంలో కాలువ చివరి భూముల్లో మొక్కజొన్న, కంది పంటలు అధికంగా వేశారు. వీరికి ఈ నీరు రాకపోగా వరుణుడు ముఖం చాటేశాడు. కంకి దశలోకి వచ్చిన మొక్కజొన్న దెబ్బతింది.

తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంలో ఎండిపోతున్న మొక్కజొన్న

ఈ నెలలో 105.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదుకావల్సి ఉండగా ఇప్పటివరకు 77.8 మి.మీ. కురిసింది.

తాళ్లూరులో అత్యల్పం.. జిల్లాలో తాళ్లూరు మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌లో 376.8 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 159.3 మిల్లీమీటర్లు (57శాతం) తక్కువ నమోదైంది. తరువాత యర్రగొండపాలెంలో 358 మి.మీ.కు గాను 185.7, అర్థవీడు మండలంలో 346.6 మి.మీ లకు 220.6 (36 శాతం తక్కువ) కురిసింది.

కంది 62 శాతానికే: ఖరీఫ్‌ కాలం ముగిసి అక్టోబర్‌ 1 నుంచి రబీ పంటల లెక్కలు ప్రారంభమవుతాయి. వరి సాగును మాత్రం అక్టోబర్‌ 15 వరకు ఖరీఫ్‌ కింద లెక్కిస్తారు. వరి, పొగాకు బదులు పప్పుధాన్య పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈసారి పంటల సరళిలో కొంత మార్పు జరిగింది. మినుము పంట గత ఏడాది దెబ్బతినడంతో ఇపుడు బాగా తగ్గిపోయింది. దీని సాధారణ విస్తీర్ణం 3,300 హెక్టార్లకు గాను 807 హెక్టార్లలోనే సాగయింది. దానికి బదులు మొక్కజొన్న సాధారణం కన్నా 208 శాతం అధికంగా సాగులోకి వచ్చింది. అత్యధికంగా సాగయ్యే కంది ఈసారి 62 శాతానికి పరిమితమైంది. 85 వేల హెక్లార్లు సాధారణం కాగా, 52,500 హెక్టార్లతో ఆగిపోయింది. వరికి మినహా ఇతర సాధారణ పంటలకు అదను దాటిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసిన పంటలు కోలుకోవాలంటే ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని