logo

గంజాయి వనం.. మీ వల్లే జగన్‌

గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్‌ మోహన్‌ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు.

Updated : 26 Apr 2024 05:45 IST

వైకాపా పాలనలో ఊరూరా మత్తు
అయిదేళ్లలో దొరికిందే 4,539 కిలోలు 
త్తవుతున్న విద్యార్థులు, యువత భవిష్యత్తు
ఈనాడు, ఒంగోలు

గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్‌ మోహన్‌ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. జిల్లాలో మత్తు విష సంస్కృతిని ఊరూరా పాకించి అనేక కుటుంబాల్లో కన్నీటి మంటలు రగిల్చారు. యువత, విద్యార్థులు, ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులు ఈ దురలవాటుకు బానిసలవుతున్నారు. మత్తులో పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. పంట పొలాలు, ఇళ్లలోనూ సాగు చేస్తూ.. తులసివనం వంటి ప్రకాశాన్ని గంజాయి మత్తుకు అడ్డాగా మార్చారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువతను జీవచ్ఛవాలను చేశారు. కుటుంబాలకు ఆసరా కావాల్సిన యువతను ఉచ్ఛంనీచం తెలియని నేరగాళ్లుగా తయారు చేశారు.

తల్లిదండ్రులకు గుండె కోత...

గంజాయికి బానిసై అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గత అయిదేళ్లలో ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. ఈ పరిస్థితి సదరు యువత తల్లిదండ్రులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఒంగోలు జీజీహెచ్‌లోని డీఅడిక్షన్‌ కేంద్రంలో ప్రస్తుతం నెలకు పది మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఓపీలో చూపించుకుని మందులు తీసుకెళ్లే వారి సంఖ్య అంతకంటే రెట్టింపు ఉంది. గంజాయికి బానిసలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులు చెబుతుండటం భవిష్యత్తుపై అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది.

జిల్లా అంతటా అడ్డాలు...

  • కంభం, గిద్దలూరు, దోర్నాల, మార్కాపురం ప్రాంతాల్లో పలువురు గంజాయి సాగు చేశారు.
  • యర్రగొండపాలెంలో ఓ రైతు కంది పంటలో ఏకంగా 282 గంజాయి మొక్కలను సాగు చేసి అధికారులకు దొరికిపోయారు.
  • దోర్నాలకు చెందిన ఓ కర్షకుడు మిర్చి పంటలో గంజాయి మొక్కలు పెంచారు.

మార్కాపురంలోని బాపూజీ కాలనీలో ఒక వ్యక్తి ఏకంగా తన ఇంటి ఆవరణలోనే గంజాయి పండించారు. దీంతో పాటు ఒడిశా, విశాఖ, ఇతర ప్రాంతాల నుంచి భారీగా తెస్తున్నారు. ఆ తర్వాత పొట్లాల రూపంలో యువత, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒంగోలులో రైల్వేస్టేషన్‌, ఇతర ప్రాంతాలు, చీమకుర్తి, గ్రోత్‌సెంటర్‌, కనిగిరి, సింగరాయకొండ, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లోని కొన్ని దుకాణాల్లో వీటి విక్రయాలు సాగుతున్నాయి.


చీమకుర్తి మండలం బూదవాడలో సెబ్‌ అధికారులు ఇటీవల దాడులు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన గ్రానైట్‌ కార్మికులుండే ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు ఎక్కువ. గతంలో అధికారులకు తరచూ దొరికేది. ఇటీవల అందుకు భిన్నంగా చాక్లెట్ల రూపంలో భారీగా లభ్యమైంది. వీటిని చూసిన పోలీసులే అవాక్కయ్యారు. రూపం మార్చుకున్న మత్తు రక్కసిని చూసి బెంబేలెత్తారు. పాఠశాలల విద్యార్థులనూ గంజాయికి అలవాటు చేసేందుకే చాక్లెట్ల రూపంలో తయారు చేశారనే ఆందోళన సగటు పౌరుల్లో కనిపించింది.


ఒంగోలులోని అప్పాయికుంటలో ఇటీవల సీతారామాంజనేయుల తెప్పోత్సవం నిర్వహించారు. వేడుక అనంతరం స్వామివార్ల విగ్రహాలను తిరిగి ఆలయానికి పూజారులు తీసుకెళ్తున్నారు. వీరిపై పైశాచిక అల్లరి మూక దాడి చేసింది. అప్పటికే వారంతా గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఏకంగా స్వామివారి విగ్రహంపై మద్యం పోశారు.


ఒంగోలు శివారు, బైపాస్‌ రహదారుల్లో యువత గంజాయి మత్తులో ద్విచక్ర వాహనాలతో తరచూ ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. మంగమూరు రోడ్డు ఆశ్రమం నుంచి లాయర్‌పేట, కోర్టు సెంటర్‌ మీదుగా పెద్ద శబ్దాలు చేస్తూ వేగంగా వాహనాలు నడుపుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు.


ఒంగోలు రామ్‌నగర్‌కి చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థి స్నేహితుల ద్వారా గంజాయి మత్తుకు అలవాటు పడ్డాడు. విషయం తెలిసి మందలించిన తల్లి పైనే ఏకంగా దాడికి పాల్పడ్డాడు. ‌్ర ఒంగోలు నగరానికి చెందిన కొందరు మెడికోలు గంజాయి మత్తులో వసతి గృహంలో విధ్వంసం సృష్టించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని