logo

ఆహ్లాదం ఆవిరి

త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్‌ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది.

Published : 26 Apr 2024 04:25 IST

వైకాపా పాలనలో నిర్వహణకు నోచుకోని పార్కులు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్‌ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు, కుటుంబసమేతంగా సేద తీరేందుకు గత ప్రభుత్వం రూ.పది లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో పలు వసతులతో కూడిన ఉద్యానవనం నిర్మించింది. ఆట వస్తువులు, దేవతా మూర్తుల విగ్రహాలతో పాటు పూల మొక్కలు, లాన్‌ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దింది. నడక ట్రాక్‌, నిర్వహణకు ఒకర్ని నియమించారు. పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు దీనిని ఉపయోగించుకున్నారు. సాయంత్రం విద్యార్థులు, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వచ్చి సేద తీరేవారు. ఆటలు ఆడేవారు. ప్రభుత్వం మారగానే నిర్వహణన గాలికి వదిలేశారు. దీంతో ఉద్యానం విధ్వంసమైంది. అధికారులు పట్టించుకోనందున పూల మొక్కలు, లాన్‌ పాడయ్యాయి.  అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఉద్యానం పనికి రాకుండా పోయిందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఆహ్లాదం పంచే ఉద్యానం నేడు బీడుగా మారింది. ఎక్కడ చూసినా ఎండిపోయిన చెట్లు దర్శనమిస్తున్నాయి. మొక్కలకు నీరు పెట్టేందుకు ఏర్పాటు చేసిన డ్రిప్‌లు పాడైపోయాయి. వైకాపా పాలనలో నిర్మించకపోయినా ఉన్నదాన్ని పాడు చేశారని ప్రజలు అంటున్నారు.


అప్పట్లో అందరికీ  ఉపయోగపడింది

-గిలకా పెద్దన్న, గొల్లవాండ్లపల్లి, త్రిపురాంతకం మండలం

విలేజ్‌ పార్కు మా గ్రామానికి ఎంతో కళ తెచ్చిపెట్టింది. మా పరిసర గ్రామాల పిల్లలు తల్లిదండ్రులతో వచ్చి సేద తీరేవారు. పిల్లలు ఆడుకునేందుకు అన్ని రకాల ఆట వస్తువులు ఉండేవి. పలు రకాల చెట్లతో ఎంతో సుందరంగా ఉండేది. కాలి నడకకు ట్రాక్‌లు కూడా నిర్మించారు.ఐదేళ్ల క్రితం వరకు ఎంతో ఆహ్లాదంగా ఉండే పార్కు ఆ తర్వాత పట్టించుకున్న నాధుడే కరవయ్యారు. దీంతో పచ్చగా ఉండే చెట్లు ఎండిపోవడంతో పాటు పార్కు ఆనవాళ్లు లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు