logo

తెర పైకి మద్దిశెట్టి పేరు

దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Published : 29 Mar 2024 01:50 IST

ఐవీఆర్‌ సర్వేతో ప్రజాభిప్రాయ సేకరణ
ఉత్కంఠ రేపుతున్న తెదేపా దర్శి సీటు

ఈనాడు, ఒంగోలు, తాళ్లూరు, న్యూస్‌టుడే: దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. తాజాగా దర్శి వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేరుతో ఐవీఆర్‌ సర్వే నిర్వహించడంతో నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వ్యూహ రచనలో కూటమి...: దర్శి అభ్యర్థిగా వైకాపా బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డిని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో కూటమి తరఫున బలమైన అభ్యర్థిని నిలిపేందుకు తెదేపా వ్యూహ రచన చేస్తోంది. అందుకుగాను కసరత్తు సాగిస్తోంది. ఇటీవల నియోజకవర్గం బాధ్యతలు పొందిన శ్రీహర్షిణీ విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే దివంగత నరసయ్య కుమార్తె కె.లక్ష్మి, జనసేన నాయకుడు గరికపాటి వెంకట్‌ టికెట్‌ కోసం బరిలో ఉన్నారు. వీరితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవ్‌రెడ్డి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్లను కూడా తెదేపా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేరుతోనూ ఐవీఆర్‌ సర్వే చేపట్టడం గమనార్హం. గత ఎన్నికల్లో వైకాపా తరఫున మద్దిశెట్టి ఇక్కడ గెలుపొందారు. అనంతరం ఆ ప్రభుత్వంపై కొన్నిసార్లు ధిక్కార స్వరం వినిపించారు. చేసిన పనులకుగాను నియోజకవర్గంలోనే రూ.100 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉందని.. చెల్లించకపోవడంతో గుత్తేదారులు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. తదనంతర కాలంలో బూచేపల్లికి ఇక్కడి నుంచి మొదటి జాబితాలోనే టికెట్‌ కేటాయించిన తాడేపల్లి ప్యాలెస్‌.. మద్దిశెట్టికి మొండిచేయి చూపింది. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గానికి దూరంగానే ఉండిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయన పేరు ఐవీఆర్‌ సర్వేలో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని