logo

ఎన్నికల వేళ.. చిల్లర పనులు

గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు.

Published : 29 Mar 2024 02:09 IST

అయిదేళ్లుగా గుత్తేదారులకు బకాయిలు
‘కోడ్‌’ కూశాక అనుయాయులకు చెల్లింపులు

ఈనాడు, ఒంగోలు: గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ పరిణామాలతో గుత్తేదారులు బెంబేలెత్తిపోయారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త పనులు చేపడతామని పలుసార్లు స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోయింది. దీంతో కొందరు గుత్తేదారులు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ తిర‘కాసు’ వ్యవహారానికి తెర లేపింది. తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపట్టింది.
అందరికీ కాదు.. కొందరికే...: జిల్లాలో 2020-23లో పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి ప్రాంతాలతో పాటు ఒంగోలు, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇందుకుగాను గుత్తేదారులకు రూ.139 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఎన్నికలు సమీపించడంతో గతేడాది చివరిలో రూ.100 కోట్లు వరకు చెల్లించారు. మిగిలిన బకాయిలకు సంబంధించిన బిల్లులను జిల్లా అధికారులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో బకాయిలు వస్తాయని అంతా ఆశపడ్డారు. ఇక్కడే వైకాపా ప్రభుత్వం తన దుర్బుద్ధిని చాటుకుంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఈ నెల 23, 24 తేదీల్లో కొన్ని జీవోలు తెచ్చింది. తమ అనుయాయులకు కొంతవరకు బకాయిలు చెల్లించింది. కోడ్‌ అమల్లోకి వచ్చాక స్క్రీనింగ్‌ కమిటీ ఆమోదం లేకుండా బిల్లుల చెల్లింపు విమర్శలకు దారి తీసింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ఎత్తుగడ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అరకొరగా ఇవ్వడంపై ఆగ్రహం...: జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు, మార్కాపురం మున్సిపాలిటీ, కనిగిరి, గిద్దలూరు, పొదిలి, చీమకుర్తి, దర్శి నగర పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలిన గుత్తేదారులకు కూడా బిల్లుల బకాయిలున్నాయి. వీటి చెల్లింపునకు ఇంతకాలం వైకాపా పాలకులకు మనసు రాలేదు. ఎన్నికల సమయంలో మాత్రం మేల్కొన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెచ్చిన జీవోల ప్రకారం అరకొర చెల్లింపులు చేపట్టారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి కనిగిరి నగర పంచాయతీకి రూ.8.75 కోట్ల బిల్లులు బకాయిలున్నాయి. ఇందులో ఇప్పుడు రూ.4.75 కోట్లు చెల్లించింది. మార్కాపురం మునిసిపాలిటీలో రూ.3 కోట్లు, పొదిలి నగర పంచాయతీలోనూ పాత బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులిచ్చినా.. నిధులు ఇంకా విడుదల కాలేదు. అయిదేళ్ల తర్వాత కూడా అరకొరగా చెల్లించడంపై పలువురు గుత్తేదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని