logo

బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు

ఎన్నికల కోడ్‌ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.

Updated : 29 Mar 2024 04:49 IST

ఎరగా చీరలు.. నగదు.. తోపుడు బండ్లు
అడ్డగోలుగా ఉల్లంఘనలు
అనుకూలురతో ముందుగానే మద్యం నిల్వలు

ఒంగోలు, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. చీరలు, నగదు, డిన్నర్‌ సెట్లు, తోపుడు బండ్లను ఎరగా వేస్తూ బరితెగిస్తున్నారు. ఎన్నికల  నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మేం అధికారంలో ఉన్నాం మా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

పట్టుకున్న మద్యం సీసాలు చూపుతున్న బేస్తవారపేట పోలీసులు

వందనమంటూ వంచనతో మొదలై...: ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే అధికార పార్టీ పెద్ద ఎత్తున కుయుక్తులకు తెర లేపింది. వాలంటీర్లపై తొలి ప్రలోభాల వల విసిరింది. వాలంటీర్లకు వందనం పేరిట అధికారిక కార్యక్రమం అంటూనే వారికి తాయిలాల ఎరవేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికీ రూ.5 వేల నగదుతో పాటు బహుమతులు పంపిణీ చేశారు. వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫొటోతో పాటు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రాలను ముద్రించి మరీ బాహాటంగా అందజేశారు. ఆ తర్వాత అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, వీవోఏలకు కూడా తాయిలాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా కానుకలు అందిస్తున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం కిమ్మనలేదు.
సామాన్యులే చివరికి సమిధలు...: ఈ నెల 16న నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ప్రలోభాలకు పాల్పడుతూనే ఉన్నారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఈసీ స్పష్టంగా చెబుతున్నా.. కొన్నిచోట్ల పట్టించుకోవడం లేదు. కోడ్‌ వచ్చిన తర్వాత ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత తన నివాసంలో తాయిలా పంపిణీ చేపట్టారు. అందులో పాల్గొన్న దిగువస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న అధికారులు, నియమావళిని ఉల్లంఘించిన మేయర్‌పై మాత్రం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఒంగోలు శివారు గుత్తికొండవారిపాలెంలోని ఒక గోదాములో నిల్వ చేసిన చీరలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు జప్తు చేశారు. సదరు చీరల అట్టపెట్టెలపై సీఎం జగన్‌, ఎమ్మెల్యే బాలినేని ఫొటోలు ముద్రించి ఉన్నాయి. తాజాగా ఒంగోలు రామ్‌నగర్‌లో పంపిణీకి సిద్ధం చేసిన తోపుడుబండ్లను కూడా పట్టుకున్నారు.
దుకాణాల నుంచి మద్యం
తరలింపు...: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడంలో మద్యానిది ప్రధాన పాత్రగా నేతలు భావిస్తుంటారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మద్యం సేకరణపై దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది నియామకాలన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. వారి సిఫారసుల మేరకే సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్‌, వాచ్‌మెన్లను నియమించారు. ఇప్పుడు వారి ద్వారా రోజువారీ విక్రయాల్లో ఎక్కువ లెక్క చూపి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాలోని పలుచోట్ల అటు పోలీసులు, ఇటు సెబ్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో మద్యం దుకాణాల సిబ్బంది పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.
పేరుకేనా తనిఖీ బృందాలు..!: కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత జిల్లావ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో అధికారులు 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక, ఆకస్మిక తనిఖీల నిమిత్తం ఫ్లయింగ్‌ స్క్వాడ్ల బృందాలను నియమించారు. ఈ బృందాలు పక్కాగా తనిఖీలు నిర్వహిస్తే అక్రమాలను కొంతమేరకైనా నిరోధించే అవకాశం ఉంది. జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత ఉండంటంతో ఆయా చెక్‌పోస్టుల వద్ద తక్కువ సిబ్బందితో నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్‌పోస్టులను మరింత పటిష్ఠం చేసి ముమ్మర తనిఖీలు చేస్తే ఎన్నికల అక్రమాలకు కొంతమేరకైనా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.

ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలో నిల్వచేసిన చీరలను పరిశీలిస్తున్న అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని