logo

క్యాషియర్‌ జగన్‌.. నొక్కవేం బటన్‌

రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 24 Apr 2024 04:09 IST

ఆరు నెలల్లో నగదంటూ ఆర్భాటం
అయిదేళ్లుగా అదే నమ్మక ద్రోహం
అగ్రిగోల్డ్‌ బాధితులకూ మోసం

‘మీ జగన్‌ మోహన్‌ రెడ్డి మాటిస్తున్నాడు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆరు నెలల్లో పూర్తి చెల్లింపులు చేస్తా. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెడతాం. బాధితులు అధైర్య పడకండి. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తాను...’

 విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్షా శిబిరం వద్ద ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాటలివి.

  • కనిగిరి పట్టణానికి చెందిన గాదంశెట్టి ప్రవీణ్‌ రూ. 2.50 లక్షల అగ్రిగోల్డ్‌ పాలసీ చేశారు. ఆయనకు ఇంతవరకు పైసా ప్రభుత్వం నుంచి రాలేదు.
  • కనిగిరి పట్టణానికి చెందిన బాలచంద్ర రూ. 23 లక్షల వరకు అగ్రిగోల్డ్‌కు చెల్లించారు. ఇతరులతో మరో రూ.27 లక్షలు కట్టించారు. ఏళ్లు గడుస్తున్నా చిల్లిగవ్వ చేతికి అందలేదు.  
  • పీసీపల్లికి చెందిన మధు అనే చిరు వ్యాపారి అగ్రిగోల్డ్‌ యజమాన్యం మాటలు నమ్మి సుమారు రూ. 10 లక్షలు చెల్లించారు. జగన్‌ మాటలు నమ్మినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పైసా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనిగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సంస్థ కారణంగా మోసపోయిన వారికి తానున్నానంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ తెగ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేస్తానంటూ నమ్మించారు. ఆరు నెలల్లో సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటానని.. కోర్టులో ఉన్న కేసుల సంగతి కూడా తాను చూసుకుంటానంటూ ప్రగల్భాలు పలికారు. జిల్లాలో అగ్రిగోల్ట్‌ ఏజెంట్లు లక్ష మంది వరకు ఉన్నారు. వీరి కింద లక్షల మంది పాలసీదార్లు ఉన్నారు. కష్టించిన డబ్బులు భవిష్యత్తు అవసరాలరీత్యా దాచుకున్నారు. ఆ సంస్థ మోసంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని జగన్‌ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నారు. మోసపోయారని.. న్యాయం చేస్తానంటూ మొసలి కన్నీరు కార్చారు. అనంతరం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి బాండ్లు సేకరించారు. ఒక్కో ఏజెంటుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అయిదేళ్లుగా బాధితులు నిరాహార దీక్షలు, పోరాటాలు, ధర్నాలు చేస్తున్నా పట్టించుకోలేదు. పైగా అనేక మందిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి ఇబ్బందులుకు గురిచేశారు.

మాట తప్పారు.. మడమ తిప్పారు...

అయిదేళ్ల కాలంలో మాకు న్యాయం చేయాలంటూ ధర్నాలు చేశాం. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఎన్నికల సమయంలో న్యాయం చేస్తానని నమ్మించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నాను అని హామీ ఇచ్చారు. అయిదేళ్లయినా ఎలాంటి న్యాయం చేయలేదు. జగన్‌ ఇచ్చిన మాట తప్పారు. హామీ నెరవేర్చకుండా మడమ తిప్పారు.

గాధంశెట్టి ప్రవీణ్‌, ఏజెంట్‌

కూడబెట్టి కట్టినవన్నీ పోయాయి...

ఏదో ఆదాయం వస్తుందని అగ్రిగోల్డ్‌ ఏజెంటÆ్ ద్వారా రూ. 3.50 లక్షలు కట్టాను. ఆ సంస్థ మోసంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డాను. వైకాపా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పినా ఇంతవరకు పైసా రాలేదు. ఎన్నిసార్లు అధికార్లు, ఏజెంట్లను కలసినా లాభం లేదు. నేను కూడబెట్టినదంతా పోగొట్టుకున్నాను. ఆదుకుంటానని చెప్పిన జగన్‌ కూడా చేసిందేమీ లేదు.

శ్రీనివాసరెడ్డి, బాధితుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని