logo

జగన్‌ రాసిన మరణ శాసనం

అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్‌ మహమ్మారిని తరిమికొడతానన్నారు.

Updated : 05 May 2024 05:05 IST

ఇంటింటికీ కుళాయి హుళక్కి
జీవచ్ఛవాల్లా బాధితులు
కబళిస్తున్న ఫ్లోరైడ్‌ మహమ్మారి

అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్‌ మహమ్మారిని తరిమికొడతానన్నారు. ఆయన ఆవేశాన్ని చూసి అక్కడివారు పొంగిపోయారు. ఆ తర్వాత ఆయన మళ్లీ కన్పించలేదు. అయిదేళ్ల తర్వాత ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇలా వచ్చి అలా పలాయనం చిత్తగించారు. వారికి నేటికీ విష జలమే గతి అయ్యింది. ఆ పాద యాత్రికుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ కావడం అక్కడి వారు చేసుకున్న పాపం.  

కనిగిరి, న్యూస్‌టుడే : ప్రతిపక్ష నేతగా జగన్‌.. అయిదేళ్ల క్రితం కనిగిరి ప్రాంతానికి వచ్చి ఇచ్చిన హామీలు నీటిపై రాతల్లా మిగిలాయి. కనిగిరిలో ఇంటింటికీ సాగర్‌ జలాలు అందిస్తానని చెప్పడంతో వారంతా మురిసిపోయారు. అయితే ఇప్పటికీ చుక్క శుద్ధజలం అందించలేదు. శుక్రవారం కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో ఆ ఊసే ఎత్తకుండా చల్లగా జారుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి స్థాయిలో తాగునీరు అందించలేని రామతీర్థం మంచినీటి పథకం

రూ.100 కోట్ల కబుర్లు

మంత్రి సురేష్‌, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, కనిగిరిలో మూడేళ్ల క్రితం రూ.100 కోట్ల వ్యయంతో ఇంటింటికీ కుళాయి నీరు అందించే పథకానికి  శంకుస్థాపన చేశారు. పూర్తయి తాగునీరు ఇంటికి వస్తేనే ఓటెయ్యండని అందరి ముందు చెప్పారు. ఇప్పటికీ పథకం పునాదుల్లోనే మిగిలిపోయింది.
పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి నియోజకవర్గం ఫ్లోరైడ్‌తో కుంగిపోతోంది. అక్కడి  ఆరు మండలాల్లో 135 పంచాయతీలున్నాయి. అన్ని గ్రామాల్లో మహమ్మారి  ఉందని నిపుణులు తెలిపారు. కనిగిరి, పామూరు, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో 2 పీపీఎం నుంచి 11 పీపీఎం వరకూ ఉందని తేల్చారు. ఈ ప్రాంతాల్లో బోర్‌ నీళ్లు, భూమిలో దొరికే ఏ నీళ్లూ తాగవద్దని సూచించారు. అయితే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎలాంటి శుద్ధజలం సరఫరా చేయలేదు. సాక్షాత్తూ  ముఖ్యమంత్రి హోదాలో హామీని నెరవేర్చకపోడంతో అక్కడి వారు కుంగిపోయారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఫ్లోరైడ్‌ నీటినే తాగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. . ప్రధానంగా పేద వర్గాలు దీని బారిన పడి జీవచ్ఛవాల్లా మారుతున్నారు.

అక్కడంతా గరళం

కనిగిరి చుట్టుపక్కలున్న పేదలు శుద్ధజలం కొనుగోలు చేయలేక ఆ నీటినే సేవిస్తున్నారు. ప్రధానంగా కమ్మవారిపల్లి, దిరశవంచ, పునుగోడు గ్రామాలతో పాటు కనిగిరి మున్సిపాలిటీలోని బొగ్గులగొంది కాలనీ, శివనగర్‌ కాలనీ, బీసీˆ కాలనీల్లో అత్యధింగా ప్లోరైడ్‌ ఉంది. ఈ ప్రాంతంలో ఎముకలు, కిడ్నీ సమస్య, దంత సమస్యలతో బాధపడే వారు వెయ్యిమంది వరకు ఉన్నారు. కానీ నిత్యం ఈ నీటినే తాగుతూ చేజేతులా వ్యాధి బారిన పడుతున్నారు. పెద్దలైతే కాళ్లూ, చేతులు వంకర్లు పోవడం, మూత్రపిండాలు చెడిపోవడం సర్వ సాధారణంగా మారింది. చిన్నారులకైతే దంతాలు గార పట్టడం, ఫ్లోరోసిస్‌ బారిన పడడం జరుగుతోంది.

పామూరూ విలవిల

పామూరు మండలం అయ్యవారిపల్లి, బోడవాడ, రేణిమడుగు, అక్కంపేట, హనుమంతునిపాడు మండలం హాజీస్‌పురం, హనుమంతునిపాడు, పీసీపల్లి మండలం  దివాకరపల్లి, పిసిపల్లి తదితర ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ బాధితులు వందలాదిమంది ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే తదితరులంతా శుద్ధజలాలు అందిస్తామన్న హామీలన్నీ బుట్టదాఖలయ్యాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరితే తమ కష్టాలు దూరమవుతాయని వారు ఎదురు చూస్తున్నారు.


పొదిలి: డబ్బా నీటిని రిక్షాలో తీసుకెళ్తున్న శ్రీపతినగర్‌ కాలనీ మహిళ

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి మండలం రాజుపాలెంలోని బోరు నీటిలో రాష్ట్రంలోనే అత్యధిక ఫ్లోరైడ్‌ ఉంది. అక్కడి చేతిపంపు నీటిలో 7 పీపీఎం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక చేతిపంపులు, బోర్లలో నీరు తాగకూడదని సూచించారు. అయినా నేటికీ అక్కడివారికి స్వచ్ఛ జలం అందని పరిస్థితి నెలకొంది. గ్రామంలో సాగర్‌నీటి కోసం నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకు అలంకారప్రాయంగా మిగిలింది.

కాళ్లతో నడవలేక..చేతుల సాయంతో..: ఫ్లోరైడ్‌ బారిన పడి రాజుపాలెంలో పలు కుటుంబాలు కుదేలయ్యాయి. నడుము, కాళ్లు వంకరపోయి..పళ్లు గారపట్టి, కీళ్లనొప్పులతో మంచానికే పరిమితమయ్యారు. కాళ్లు వంగిపోవడంతో నిలబడలేకపోతున్నారు. దీంతో కాళ్లు, చేతుల సాయంతో పాకుతూ వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్నారు. గ్రామంలో సుమారు 30 మంది వరకు ఫ్లోరైడ్‌ బాధితులున్నారు. పొదిలి మండలం ఓబులక్కపల్లి, ఈగలపాడు, కొండాయపాలెం, సలకనూతల తదితర గ్రామాలకు సాగర్‌నీరు లేవు. పొదిలి పట్టణంలోనే వారానికి ఒకటి, రెండు రోజులు తాగునీరు సరఫరా చేసే పరిస్థితి. మర్రిపూడి మండలం ధర్మవరంలో ఫ్లోరైడ్‌ కారణంగా మూత్రపిండ వ్యాధుల బారిన పడ్డారు. 

కొనకనమిట్లలోనూ..:  మండలంలోని పలు గ్రామాల్లో చేతిపంపు నీరే ఆధారం. అన్ని మండలాల్లోను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోరునీరే దిక్కు. ప్రమాదకరమైన ఫ్లోరైడ్‌ నీటిని సేవించడంతో చిన్న వయస్సులోనే దంతాలు దెబ్బతిని విలవిల్లాడుతున్నారు. పాఠశాలల్లో చిన్నపాటి ఆర్వో ప్లాంట్లు అక్కడక్కడా ఉన్నా అవి సక్రమంగా పని చేయకపోవడంతో భావి పౌరులు చేతిపంపు నీటినే తాగుతున్నారు. పలు గ్రామాల్లోని చేతిపంపుల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువే ఫ్లోరైడ్‌ ఉంది. వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో ఆయా గ్రామాలకు సాగర్‌నీరు సరఫరా చేయకపోవడంతోనే విష జలంతోనే వారు జీవనం సాగిస్తున్నారు.


పాదయాత్రలో  మురిపించి.. అయిదేళ్లలో విషం మిగిల్చి..

ముప్ఫై ఏళ్లలో.. డెబ్భై ఏళ్లులా..

ఈ చిత్రంలో కన్పిస్తున్న వారు తల్లీ కూతుర్లు నాగమ్మ, మేరీ. ఉండేది కనిగిరి మున్సిపాలిటీ బొగ్గులగొంది కాలనీ. ఫ్లోరైడ్‌ జలంతో ముప్ఫై ఏళ్ల మేరీ జీవచ్ఛవంలా మిగిలారు. నేడు ఆమె డెబ్భై ఏళ్ల వృద్ధురాలిగా మారి, అడుగేయాలంటే అమ్మ సాయం ఉండాల్సిందే. ఇది పాలకుడు విధించిన శిక్ష అని వారు వాపోతున్నారు.

అడుగేయడం కష్టం

ఈయన పేరు శోభనాద్రి. మున్సిపాలిటీలోని బీసీˆ కాలనీ వయస్సు. నలభై ఏళ్లు రాకుండానే కాళ్లు, చేతులు  దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యారు. మహమ్మారి దెబ్బతో కుదేలైన ఈయన కొద్దిపాటి పింఛన్‌తో జీవనం వెళ్లదీస్తున్నారు.

మూత్రగండం

ఫ్లోరైడ్‌ మహమ్మారి దెబ్బకు స్థానికంగా ఉండే సుబ్బారావు మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ముప్ఫై ఎనిమిదేళ్ల వయస్సులోనే ఇలా దిన దిన గండంగా బతుకీడిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని