logo

పండగ వేళ పట్నం వెలిగిపోతోంది

ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, త్రినేత్రధారిణి పాతపట్నం నీలమణిదుర్గమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

Updated : 30 May 2023 05:43 IST

వైభవంగా సాగుతున్న నీలమణిదుర్గమ్మ సంబరాలు
నేడు ఘటోత్సవంతో ముగింపు  

న్యూస్‌టుడే, పాతపట్నం : ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, త్రినేత్రధారిణి పాతపట్నం నీలమణిదుర్గమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలను కనులారా తిలకించేందుకు ఎక్కడెక్కడో స్థిరపడినవారంతా స్వగ్రామానికి తరలివచ్చారు. దీంతో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. ఇంటింటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది.. ఊరంతా విద్యుత్తుకాంతులతో వెలిగిపోతోంది. వీధివీధినా సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. అమ్మ తిరువీధితో శరణుఘోష మారుమోగుతోంది. ఈనెల 20న ప్రారంభమైన సంబరాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మంగళవారం ప్రధాన వేడుక జరగనుంది. ఇందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది  

ప్రతి ఇంటి నుంచి ఘటాలు: అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేకత ఘటాలు. కాపువీధి కూడలిలో ఉన్న ఆలయం నుంచి ప్రధాన ఆలయానికి అమ్మ పయనమైనప్పుడు వెంట వేలాది ఘటాలతో మహిళలు, భక్తులు తరలివెళ్తారు. గ్రామంలో సుమారు 8,500 ఇళ్లు ఉండగా ఒక్కో ఇంటి నుంచి రెండు లేదా మూడు ఘాటాలతో మొక్కులు చెల్లిస్తారు. చివరి రోజు జరిగే ఘటోత్సవంలో సుమారు 15 నుంచి 20 వేల ఘటాలు ఉంటాయని అంచనా.  

ప్రతిరోజూ సంబరాలే..: పండగ చివరి రోజున బంధువులు, స్నేహితులను పిలిచి భోజనాలు పెట్టడం ఆనవాయితీ. ఈసారి ఇందుకు భిన్నంగా సంబరాల ప్రారంభం నుంచే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరి రోజున ఉత్సవాలు, మొక్కులు, లక్షల్లో తరలివచ్చే భక్తుల కారణంగా ఇసుకేస్తే రాలనంతగా వీధులు తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గట్టి భద్రతా చర్యలు: చివరిరోజు మంగళవారం దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనం వస్తారని అంచనా. ఈనేపథ్యంలో  అవాంఛనీయ ఘటనలకు లేకుండా గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రాకుండా నిలిపివేశారు. శివార్లలోనే పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలతో పాటు 220 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని