logo

శెభాష్‌.. సతీష్‌..

జేఈఈ మెయిన్‌-2024 (సెషన్‌-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్‌కుమార్‌ అదరగొట్టాడు.

Published : 26 Apr 2024 03:57 IST

జేఈఈ మెయిన్‌లో మెరిసిన సిక్కోలు  విద్యార్థి
ఆలిండియా 8వ ర్యాంకు కైవసం
న్యూస్‌టుడే, జలుమూరు

జేఈఈ మెయిన్‌-2024 (సెషన్‌-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్‌కుమార్‌ అదరగొట్టాడు. ఆలిండియా 8వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. తండ్రి చింతు బుచ్చన్న పాలకొండ మండలం లుంబూరు ప్రాథమిక పాఠశాలలో, తల్లి నక్క రమాదేవి విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం ఆమదాలవలస కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం కలిగిన సతీష్‌ చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి కనబరిచేవాడు. ప్రాథమిక విద్యాభ్యాసం పాలకొండ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అనంతరం నవోదయ ప్రవేశ పరీక్షలో సీటు దక్కించుకున్నప్పటికీ బాగా చదవగలడనే నమ్మకంతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. అక్కడే పదో తరగతి వరకు చదివాడు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. పదో తరగతిలో (సీబీఎస్‌ఈ సిలబస్‌) 500 మార్కులకు 472 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్‌ (సీబీఎస్‌ఈ) ఫలితాలు ఇంకా వెలువడలేదు.


అదనంగా రెండు గంటలు శ్రమించేవాడిని..

- సతీష్‌కుమార్‌

తల్లిదండ్రుల ప్రోత్సాహం, కళాశాలలో అధ్యాపకుల మార్గనిర్దేశంతో ఈ ర్యాంకు సాధించగలిగాను. కళాశాల నుంచి వచ్చిన తరువాత ప్రతిరోజూ రెండు గంటలు అదనంగా వెనుకబడిన సబ్జెక్టులపై దృష్టి పెట్టేవాడిని. అర్థం కాని అంశాలను మా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి నేర్చుకునేవాణ్ని. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని