logo

దారికి రాని విస్తరణ

నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.

Published : 26 Apr 2024 03:27 IST

ట్రాఫిక్‌తో నగర వాసులకు తప్పని ఇక్కట్లు  
శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే

నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది. నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేలా చర్యలు తీసుకోవాల్సిన మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రహదారి విస్తరణపై మూడేళ్లుగా తమకేమి పట్టనట్లు వ్యవహారించడంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పడం లేదు.

మదాలవలస- శ్రీకాకుళం ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో శ్రీకాకుళం నగరంలోని ‘డే అండ్‌ నైట్‌’ సెంటర్‌ నుంచి కొత్తరోడ్డు కూడలి వరకు విస్తరణ పనులు చేయాల్సి ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పనులకు హామీ ఇచ్చినా నిధులు మంజూరవ్వలేదు. అయితే ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయాల్సిన విషయాన్ని ర.భ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు విస్మరించారు. దీంతో రోజురోజుకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీవ్రంగా మారుతున్నాయి. మొదటి విడతగా ఆమదాలవలస నుంచి కొత్తరోడ్డు వరకు ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.


పూర్తికాని భూసేకరణ

మదాలవలస ప్లై ఓవర్‌ నుంచి కొత్తరోడ్డు కూడలి వరకు 80 అడుగుల మేర.. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 70 అడుగుల మేర విస్తరణ పనులు చేయాల్సి ఉంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని ఆదివారంపేట నుంచి ‘డే అండ్‌ నైట్‌ కూడలి’ వరకు సుమారు 2 కి.మీ మేర రహదారి విస్తరణకు అవసరమైన స్థలాన్ని సేకరించే బాధ్యత ప్రభుత్వం నగరపాలక సంస్థకు అప్పగించింది. ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం మొదలవ్వలేదు. నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం, ర.భ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మొత్తం 428 ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అధికంగా ఆదివారంపేట, బలగ ప్రాంతంలో ఉన్నాయి. ఈ మేరకు నివేదికలను సిద్ధం చేశారు.


చొరవచూపని అధికారులు

స్థలాన్ని ఇచ్చేందుకు నగరవాసులు ముందుకొచ్చినా.. ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోల్పోయిన స్థలాలకు, ఇళ్లకు  పరిహారం నగదు రూపంలో చెల్లించాలని నగరపాలక సంస్థ అధికారులను డిమాండ్‌ చేశారు. అప్పటికి నిధులు కొరత కారణంగా భూసేకరణ మధ్యలో నిలిచిపోయింది. ఇళ్లు నష్టపోయే వారికి టీడీఆర్‌ బాండ్లు జారీ చేస్తామని హామి ఇచ్చారు. పూర్తిగా ఇళ్లు నష్టపోయిన వారికి జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు తొమ్మిది మంది మాత్రమే తగిన అంగీకార పత్రాలు, స్థలాలకు సంబంధించి పత్రాలను నగరపాలక సంస్థ అధికారులు సేకరించారు. నగరంలోని ఆర్టీసీ కాంపెక్ల్స్‌, తహసీల్దారు కార్యాలయం, పోలీసు అతిధి గృహం, ప్రభుత్వ ఐటీఐ, జిల్లా కోరు, ఇండ్రస్టీరియల్‌ కార్యాలయాలకు సంబంధించిన ప్రహరీలను తొలగించాల్సి రావడంతో వాటిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ. 1.10 కోట్లతో పునరుద్ధరించేందుకు టెండర్లు పిలిచారు. పలు కార్యాలయాల ప్రహరీలను తొలగించి వాటిని ఆలానే వదిలేశారు. మిగిలిన కార్యాలయాలకు సంబంధించి పనులు అసలు ప్రారంభమే కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని