logo

వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు.

Published : 26 Apr 2024 03:50 IST

టెక్కలి నియోజకవర్గంలో రసవత్తరంగా రాజకీయం
ముఖ్యమంత్రి వెళ్లిన మరుసటి రోజే గట్టి దెబ్బ
న్యూస్‌టుడే, టెక్కలి, కోటబొమ్మా
ళి

న్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. 40 ఏళ్లుగా కింజరాపు కుటుంబానికి ప్రత్యర్థులుగా ఉంటున్న సంపతిరావు రాఘవరావు కుటుంబం నుంచి లింగాలవలస మాజీ సర్పంచి సంపతిరావు రవీంద్రనాథ్‌ తన అనుచరులతో తెదేపాలో చేరారు. గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళిలోని పార్టీ కార్యాలయంలో తీర్థం పుచ్చుకున్నారు. కింజరాపు కుటుంబానికి నిమ్మాడ ఏ విధంగా కంచుకోటగా ఉందో.. ప్రత్యర్థులకు లింగాలవలస అంతటి బలమైన ప్రాంతం. అలాంటి చోట పట్టు పెంచుకునేందుకు తెదేపా గట్టి వ్యూహాన్ని అమలు చేసింది. టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి పెదనాన్న కుమారుడు, దువ్వాడ శ్రీనివాస్‌కు బావ అయిన రవీంద్రనాథ్‌కు నాలుగు పంచాయతీల్లో పట్టు ఉంది.

మరికొన్ని చోట్ల ఇదే తీరు..

గత ఎన్నికల్లో కనీస స్థాయిలో ఓట్లు వచ్చినా పెద్దబాణాపురం నుంచి సీనియర్‌ న్యాయవాది కర్రి శేషు తెదేపాలో చేరారు. ఇప్పటికే ఆ గ్రామ సర్పంచి రమేష్‌ నాయుడు తెదేపాలో చేరారు. నౌపడ నుంచి మరో నేత కోట రామురెడ్డి, టెక్కలి పట్టణం నుంచి కోనారి కృష్ణ, కోనారి రమేష్‌ వైకాపాను వీడారు. సంతబొమ్మాళి మండలం బోరుభద్ర పంచాయతీకు చెందిన ముద్దపు రమణ అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి పసుపు కండువా కప్పుకొన్నారు. నౌపడ ఎంపీటీసీ మాజీ సభ్యుడు బచ్చల హరిశ్చంద్రరావు, భావనపాడు వార్డు సభ్యులు గొరకల సింహాచలం, శారద చేరారు. సామాజిక అంశాన్నే తన బలంగా చూపించుకునే వైకాపా వర్గాలకు అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన గ్రామాల నుంచి కీలక నేతలు తమ అనుచరులతో పార్టీను వీడుతుండటంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. నష్టనివారణ చర్యలు చేపట్టుకునేందుకు చొరవ ఇవ్వకుండా తెదేపా వరుసగా చేరికల పరంపరను కొనసాగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని