logo

మలుపులు.. మృత్యులోగిళ్లు

పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు.

Published : 26 Apr 2024 03:31 IST

ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి అన్న వాహనదారులు
ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం
చాలా ప్రమాదాలు జరిగాయని వెల్లడి
కవిటి గ్రామీణం, కంచిలి గ్రామీణం  

పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. ప్రమాద నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆ రోడ్లపై రాకపోకలు చేసే వాహనదారుల్లో ఆందోళన తప్పడం లేదు.



విటి మండలంలోని రాజపురం నుంచి బైరిపురం మీదుగా జల్లుపుట్టుగ వచ్చే రహదారిలో మలుపులు ప్రమాదాలకు చిరునామాగా మారాయి.  ‘యూ’, ‘ఎస్‌’ ఆకారాల్లో ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఆ రోడ్లపై పరీక్షే

సీమూరు నుంచి నెలవంక, బైరెడ్లపుట్టుగ, కొమ్ముపుట్టుగ, కపాసుకుద్ది, ముత్యాలపేట వయా మండల కేంద్రం కవిటి చేరుకునే రహదారిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కవిటి నుంచి రాజపురం, బొరివంక నుంచి డి.గొనపపుట్టుగ, నర్తుపుట్టుగ నుంచి జాతీయ రహదారికి చేరుకునే క్రమంలో పలు గ్రామాల్లో మలుపులు వాహనదారులను భయపెడుతున్నాయి. హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు సంబంధిత శాఖాధికారులు ఏర్పాటు చేయలేదు. చీకటి పడితే మలుపుల వద్ద హడలిపోతున్నారు. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.

మొక్కలు తొలగించక ఇక్కట్లు

ఆదివారం సంత నుంచి కవిటి రోడ్డును కలిపే రహదారిలో ఏళ్లపాటు జంగిల్‌ క్లియరెన్స్‌ లేకపోవడంతో ఇరువైపులా పొదలు పెరిగి వాహనాలు కనిపించడం లేదు. కంచిలి, కవిటి మండలాలను కలిపే ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటోంది.


భయంగా ఉంటుంది

- పి.రామారావు, డీజి.పుట్టుగ

జల్లుపుట్టుగ నుంచి రాజపురం వెళ్లే రహదారిలో పలు చోట్ల మలుపులు ఉన్నాయి. అక్కడకు వచ్చేసరికి జాగ్రత్త పడకపోతే ప్రమాదమే. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.


వేగ నియంత్రికలు లేవు

- ఎస్‌.గణేష్‌, యువకుడు, నెలవంక

కవిటి నుంచి నెలవంక దారిలో మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు లేవు. చీకట్లో వాహనాలపై వెళ్లినప్పుడు ఆందోళనగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని