logo

లక్ష్యాన్ని సాధించి.. మృత్యువుకు తలవంచి

ఉద్యోగ సాధనలో సఫలమైన ఆ యువకుడు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. శిక్షణ పూర్తి చేసుకుని సంతోషంగా స్వగ్రామానికి చేరుకున్న అతడు మృత్యువు విసిరిన పాశం నుంచి తప్పించుకోలేకపోయాడు.

Published : 27 Mar 2024 03:27 IST

లారీ ఢీకొని సీఆర్పీఎఫ్‌ జవాను దుర్మరణం

ఉద్యోగ సాధనలో సఫలమైన ఆ యువకుడు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. శిక్షణ పూర్తి చేసుకుని సంతోషంగా స్వగ్రామానికి చేరుకున్న అతడు మృత్యువు విసిరిన పాశం నుంచి తప్పించుకోలేకపోయాడు. లారీ రూపంలో వచ్చిన చావు నుంచి బయట పడాలని, ఎలాగైనా బతకాలన్న ఆశతో కొన ఊపిరిలోనూ.. రక్షించాలంటూ ప్రాధేయపడ్డాడు. చివరికి మృత్యువు ఎదుట తలవంచి, కన్నవారికి శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు.

కాశీబుగ్గ, సోంపేట, న్యూస్‌టుడే: కాశీబుగ్గ సమీపంలోని కోసంగిపురం కూడలిలో ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో సీఆర్పీఎఫ్‌ జవాను మంగళవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేట మండలం జీడిపుట్టుగకు చెందిన సీహెచ్‌ చిరంజీవి అలియాస్‌ చైతన్య(28) 7 నెలల కిందట సీఆర్పీఎఫ్‌ జవానుగా ఎంపికయ్యాడు. బిహార్‌లో శిక్షణ పూర్తి చేసుకొని సెలవుపై ఈ నెల 17న స్వగ్రామం వచ్చాడు. వజ్రపుకొత్తూరు మండలం అమలపాడులోని బంధువుల ఇంటికి మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో చిరంజీవి లారీ వెనుక చక్రాల మధ్య చిక్కుకుపోయాడు. నడుమ భాగం నుంచి కాళ్ల వరకు తీవ్రగాయాలయ్యాయి. తనను రక్షించాలని ప్రాధేయపడుతూ స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న హైవే పోలీసుసిబ్బంది పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిరంజీవి తండ్రి కోటేశ్వరరావు ఏడాది కిందట గుండెపోటుతో మృతి చెందారు. తల్లి అన్నపూర్ణ, సోదరుడు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని