logo

డుగాంగ్‌ ప్రాణాలకు రక్ష

అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఒకటిగా ‘డుగాంగ్‌’ ఉంది. భారీ కాయంతో నీటిలో తిరుగుతూ పరిశోధకుల్ని సైతం ఈ జీవి ఆకట్టుకుంటూనే ఉంది. వీటి సంతతి బాగా తగ్గిపోతుండటం, అందులోనూ తమిళనాడు తీర ప్రాంతంలో వీటి సంతతి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంది.

Updated : 07 Oct 2022 02:28 IST

దేశపు తొలి కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌
మూడేళ్లపాటు ప్రత్యేక చర్యలు

అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఒకటిగా ‘డుగాంగ్‌’ ఉంది. భారీ కాయంతో నీటిలో తిరుగుతూ పరిశోధకుల్ని సైతం ఈ జీవి ఆకట్టుకుంటూనే ఉంది. వీటి సంతతి బాగా తగ్గిపోతుండటం, అందులోనూ తమిళనాడు తీర ప్రాంతంలో వీటి సంతతి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంది.

- ఈనాడు-చెన్నై

గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లో పాక్‌ జలసంధి ప్రాంతాన్ని దేశపు తొలి డుగాంగ్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సముద్ర క్షీరదాల్లో ‘డుగాంగ్‌’ కూడా ఒకటి. వీటిని సముద్ర ఆవులుగా కూడా పిలుస్తున్నారు. పాక్‌ జలసంధి ప్రాంతం విస్తరణ సుమారుగా 450 చ.కి.మీ దాకా ఉండొచ్చు. ఈ ప్రాంతంలో వీటి సంతతి అరుదుగా ఉందని రాష్ట్ర అటవీశాఖ చెబుతూ వస్తోంది. ఇప్పుడు వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం చేపట్టింది.

200 మాత్రమే..
ఈ జీవులు ఇండో-పసిఫిక్‌లో చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో మాత్రం డుగాంగ్‌ సంతతి బాగా తగ్గిపోతోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం కేవలం 200 మాత్రమే దేశ సముద్ర తీరాల్లో ఉన్నట్లుగా వెల్లడిస్తున్నారు. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌తో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోనూ ఇలాంటివి కనిపిస్తుంటాయని అంటున్నారు. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లోని పాక్‌ జలసంధి ప్రాంతం వీటి మనుగడకు చాలా అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని సంరక్షించాలని ఎప్పటినుంచో డిమాండ్‌ ఉందని, ఇప్పుడు రాజకీయ నిర్ణయం తీసుకోవడంతో మంచి ఫలితం వచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.

జీవనశైలి ప్రత్యేకం
డుగాంగ్‌ జీవి 3 నుంచి 3.5 మీటర్ల పొడవు దాకా పెరుగుతుంటుంది. బరువు సుమారు 300 కిలోల వరకు ఉండొచ్చు. సముద్రంలో తేలియాడుతూ, లోపలికెళ్తూ సందడి చేస్తుంటాయి. ప్రతీ 3, 4 నిమిషాలకోసారి సముద్రజలాల ఉపరితలానికి వచ్చి శ్వాస తీసుకుంటూ ఉంటాయని అంటున్నారు. ఉపరితలం నుంచి సముద్రంలో 10 మీ లోతుదాకా తిరుగుతూ ఉంటాయని, ఒంటరిగా కాకుండా బృందంగా తిరుగుతూ కనిపిస్తుంటాయని అంటున్నారు. తక్కువలోతు ఉన్న సముద్రగర్భంలో పచ్చికలపై తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెబుతున్నారు.

సరిహద్దుల నిర్ణయం పూర్తి
కన్జర్వేషన్‌ రిజర్వ్‌పై తమిళనాడు ప్రభుత్వం వేగంగా స్పందించింది. తాజాగా ఈ ప్రాంతాన్ని డుగాంగ్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా గుర్తిస్తూ గెజిట్‌ను కూడా ముద్రించింది. పైగా ఈ ప్రాంతానికి హద్దుల్ని కూడా నిర్ణయించింది. ఈ సరిహద్దులు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా అదిరంపట్టిణం నుంచి, పుదుక్కొట్టై జిల్లా అమ్మపట్టిణం తీర సముద్రం వరకు నిర్ణయించారు. భూభాగం నుంచి సముద్రలోపలికి సుమారు 10 కి.మీ మేర ప్రాంతాన్ని సరిహద్దు పరిధిలోకి తెచ్చారు. ఇక్కడి సముద్రతీర గర్భంలో సుమారు 12,250 హెక్టార్ల మేర డుగాంగ్‌లు నివసించేందుకు అనువైన పచ్చికలున్నట్లు అంచనా వేశారు. వాటితో పాటు సముద్ర తీరంలోని సమగ్ర పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచేందుకు 3ఏళ్ల పాటూ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.

మత్స్యకారుల సాయంతో..
స్థానిక మత్సకారులతో కలిసి వీటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ జీవుల కోసం సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లుగా చెబుతున్నారు. ఒక్కోసారి మత్స్యకారులు వేసే వలల కారణంగానూ ఇవి మృతిచెందే ప్రమాదముందని, ఇదివరకు ఇలాంటి తప్పిదాలు జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ప్రాంతం బాగా చేపలుపట్టేందుకు ఉపయోగపడేదిగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వేటకు వెళ్లే కుటుంబాల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. వారు చేపలు పట్టుకోవడంతో పాటు డుగాంగ్‌ల సంరక్షణలో వారినీ భాగస్తుల్ని చేయాలని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని