logo

ఓపీఎస్‌, శశికళ భేటీకి సన్నాహాలు

అన్నాడీఎంకేలో ఏకనాయకత్వం సమస్య నెలకొన్న నేపథ్యంలో శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం చేతులు కలపనున్నారు. చాలాకాలం నుంచి వీరు కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 27 Nov 2022 01:21 IST

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేలో ఏకనాయకత్వం సమస్య నెలకొన్న నేపథ్యంలో శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం చేతులు కలపనున్నారు. చాలాకాలం నుంచి వీరు కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి త్వరలోనే నిజం కాబోతున్నట్లు సమాచారం. దీనికి మూహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది ఓపీఎస్‌, శశికళ మద్దతుదారులైన అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలను సంతోషం కలిగిస్తోంది. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ సమస్య తారస్థాయికి చేరింది. ఎలాగైనా ఇది లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కూటమిలో ఉన్న భాజపా ప్రత్యక్షంగా కలుగజేసుకోనప్పటికీ పరోక్షంగా ఈ విషయంలో ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. ఓపీఎస్‌ను, శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకుని ముందుకుసాగాలని ఈపీఎస్‌ని భాజపా కోరినట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పళనిస్వామి మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. ఓపీఎస్‌, శశికళ, టీటీవీ దినకరన్‌లను పార్టీలో చేర్చుకోవాలని బలవంతం చేయకూడదని, తనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించేట్లు చేయాలని భాజపాకు ఈపీఎస్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. తప్పు చేసిన వారు మళ్లీ వస్తే పార్టీలో చేర్చుకోవటమే నాయకత్వ లక్షణమని ఓ వేదికపై పళనిస్వామి సమక్షంలో ఓపీఎస్‌ గతంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌, శశికళ, టీటీవీలు ఏ క్షణంలోనైనా ఏకం కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. వీరి భేటీ ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొంది. దినకరన్‌ను త్వరలో కలుస్తానని కొన్ని రోజులుగా ఓపీఎస్‌ కూడా పలు సందర్భాల్లో తెలిపారు. టీటీవీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం. వీరిద్దరు ప్రత్యక్షంగా కలిసి కొన్ని సంవత్సరాలు అవుతోంది.


పట్టు నిరూపణకు ఎడప్పాడి ప్రణాళిక

తిరుచ్చిలో అన్నాడీఎంకే సమావేశానికి ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు శతవిధాలా ఆయన యత్నిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం కూడా ప్రస్తుతం ఆయన ఆధీనంలోనే ఉంది. గోల్డెన్‌ జూబ్లీ ముగింపు వేడుకల సందర్భంగా తిరుచ్చిలో భారీ సమావేశం నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళిక రచిస్తున్నారు. జనవరి 17న ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తిరుచ్చిలో కాకుంటే కోయంబత్తూరులో కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తన మద్దతుదారులను కూడగట్టి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ముందస్తు చర్యగా ఈ సమావేశం జరిపేందుకు సీనియర్‌ నిర్వాహకులతో కలిసి ఈపీఎస్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికలకు అన్నాడీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సమావేశంలో పలు ప్రకటనలు చేయనున్నారని సమాచారం.


ఎన్నోసార్లు అనుకున్నా...

శశికళతోనూ ఓపీఎస్‌ సమావేశం కానున్నట్లు ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దేవర్‌ జయంతి సమయంలో పశుంపొన్‌లో కలిసే అవకాశం ఉందని సమాచారం వచ్చినా అది జరగలేదు. శశికళ పర్యటన సమయంలో ఏదో ఒక ప్రాంతంలో ఓపీఎస్‌ను కలుస్తారనేది ప్రచారానికే పరిమితమైంది. శశికళను రెండు నెలల క్రితం ఓ వివాహ కార్యక్రమంలో ఓపీఎస్‌ మద్దతుదారుడైన వైద్యలింగం కలిశారు. ఆ రోజు వైద్యలింగం పుట్టినరోజు కావటంతో శశికళ శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడూ ఓపీఎస్‌ భేటీ కానున్నట్లు వార్తలు వచ్చాయి. తంజావూరులో కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా నాలుగు రోజుల క్రితం వార్తలు హల్‌చల్‌ చేశాయి. జయలలిత స్మారక దినాన చెన్నైలో శాంతియుత ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో పన్నీర్‌తో కలిసి పాల్గొనటం గురించి తన మద్దతుదారులతో శశికళ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 5న చెన్నై మెరీనాలోని జయలలిత సమాధి వద్ద వీరిద్దరి భేటీ ఉంటే మేలని మద్దతుదారులు శశికళకు సలహా ఇచ్చినట్లు సమాచారం.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని