logo

ఆకాశమంత ప్రోత్సాహం!

గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు, మురికి వాడల్లోని వారికి విమానాన్ని దగ్గరగా చూసే అవకాశమే ఉండదు. దూరంగా కనిపిస్తే సంబరపడటమే వారికి తెలుసు. అలాంటి ఇళ్ల నుంచి వచ్చిన పిల్లలు..  ఆ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.

Updated : 05 Feb 2023 03:11 IST

పేద విద్యార్థుల కోసం విహారయాత్రలు
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న విధానం

ఈనాడు, చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు, మురికి వాడల్లోని వారికి విమానాన్ని దగ్గరగా చూసే అవకాశమే ఉండదు. దూరంగా కనిపిస్తే సంబరపడటమే వారికి తెలుసు. అలాంటి ఇళ్ల నుంచి వచ్చిన పిల్లలు..  ఆ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అదీ ఆషామాషీగా కాదు! ‘మీరు బాగా చదవండి.. మేం విమానంలో తీసుకెళ్తాం’ అని అధికారులు చెప్పినమాట చెవికెక్కించుకుని.. కష్టపడి  ప్రతిభ చూపి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. అలాంటి పేదవిద్యార్థులు ఇప్పుడు పెరుగుతున్నారు. ఈ తరహా ప్రోత్సాహం రాష్ట్రంలో బాగా పెరుగుతోంది.

దుబాయ్‌ ప్రయాణానికి ఎంపికైన విద్యార్థులతో చెన్నై మేయర్‌ ప్రియ, కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ తదితరులు

తాజాగా చెన్నై కార్పొరేషన్‌లో ఓ వినూత్న కార్యక్రమం జరిగింది. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు దుబాయ్‌, యూఏఈ వెళ్లే అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. ఇందులో 478 పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.  32 మంది ఫైనల్స్‌కు చేరగా.. 8 మంది విజేతలుగా ఎంపికయ్యారు. ఇందులో 9, 11 తరగతుల వారున్నారు. వీరికిప్పుడు దుబాయ్‌, యూఏఈ వెళ్లే అవకాశం వచ్చింది. తాజాగా ఈ పిల్లల్ని కార్పొరేషన్‌ కార్యాలయానికి పిలిచి సత్కరించారు. వీరిని పర్యటనకు సిద్ధం చేస్తున్నామని కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌ బేడీ తెలిపారు. పిల్లల మోముల్లో ఎంత సంబరం కనిపించిందో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తీపి గుర్తుగా మారిపోయింది.

రెక్కలొచ్చినట్లుగా..

ఏటా రోటరీక్లబ్‌ వారు ‘వింగ్స్‌ టు ఫ్లై’ కార్యక్రమం చేపడుతున్నారు. విద్యార్థుల్లో వివిధరకాలుగా అవగాహన వచ్చేలా పలు ప్రదర్శనలు కూడా పెడుతున్నారు. గెలిచినవారిని విమానాల్లో విహారయాత్రకు తీసుకెళ్తుంటారు. గతేడాది కూడా వీరు చెన్నై నగరంలో కార్పొరేషన్‌ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ఓ వినూత్న పోటీపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులకు అవకాశమొస్తే ఏమేం చేస్తారనే కోణంలో ఈ పోటీ సాగింది. 5 విడతలుగా జరిగిన ఈ ప్రదర్శనల్లో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఇందులో విజేతులుగా నిలిచిన 8మంది విద్యార్థుల్ని విమానంలో లండన్‌ తీసుకెళ్లారు. అక్కడి సైన్స్‌ మ్యూజియం, క్యూ గార్డెన్స్‌ లాంటి ప్రముఖ ప్రాంతాల్లో తిప్పారు. పిల్లలకిది మరుపురాని పర్యటనగా మారింది.

మంచు కొండల్లో..

* విమాన పర్యటనలు విద్యార్థుల్లో పెనుమార్పులు తెస్తున్నాయని విద్యాశాఖ గమనించింది. ఈ నేపథ్యంలో  ఈ తరహా  ప్రోత్సాహం కోసం వివిధరకాల పోటీలు నిర్వహించడం మంచిదేననే అభిప్రాయానికి వచ్చింది. మహాబలిపురం కేంద్రంగా జరిగిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌ నేపథ్యంలోనూ పలువురు చిన్నారులకు ప్రత్యేక అవకాశాల్ని ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలకు చెస్‌ పోటీలు నిర్వహించి, విజేతల్ని విమానంలో ఈ పోటీలు చూసేలా చేశారు.

* తిరునెల్వేలి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గతేడాది ఐఐటీ జేఈఈ శిక్షణ కూడా ఇచ్చారు. ఇందులో అద్భుత ప్రతిభ కనబరిచిన 21మంది విద్యార్థులకు తూత్తుకుడి నుంచి చెన్నై మధ్య విమానంలో వచ్చే అవకాశం ఇచ్చారు. ఇక్కడి ఐఐటీ మద్రాస్‌ సందర్శన, నిపుణులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు.

* విమాన విహార యాత్రల్లో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ముందుంది. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నవారిలో గతేడాది నవంబరులో 50మంది విద్యార్థుల్ని ఎంపికచేశారు. వీరికి జాతీయస్థాయి విహారానికి తీసుకెళ్లారు. దిల్లీ, కశ్మీరుకు కూడా పంపారు. అక్కడి మంచులోయల్లో వారి ప్రయాణం ఆనందంలో ముంచెత్తింది.

* పేదలకోసం విమానయాన సంస్థలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 149 మంది పేద విద్యార్థులకు చెన్నై-బెంగళూరు మధ్య విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇందుకోసం స్పైస్‌జెట్‌ సంస్థ ఓ ప్రత్యేక విమానాన్నే వీరికోసం కేటాయించింది.

ఆకాశమే హద్దు

రెయిన్‌డ్రాప్‌ ఫౌండేషన్‌ సంస్థ కూడా పిల్లల్ని ప్రోత్సహించడానికి విమానయాన విహారయాత్రలను సిద్ధం చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి దివ్యాంగ పిల్లలపై వీరు దృష్టిపెడుతుంటారు. ఇందుకోసం ‘ఆకాశమే హద్దు (వానమే ఎల్లై)’ పేరుతో ఈ సంస్థ ముందుకొచ్చి కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ తరహా పిల్లల జీవితాల్లో వారికి కనీసం ఒక్కసారైనా ఇలాంటి విమాన విహారయాత్రలకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయాణానికి అనువుగా ఉన్నవారినే  ఎంపిక చేసుకుంటున్నారు. కోయంబత్తూరు-చెన్నై మధ్య విమానాల్లో తీసుకెళ్లడంతో పాటు అక్కడి పర్యాటక ప్రాంతాల్నీ చూపించారు. ఆ సంస్థ ఇలాంటి ప్రణాళికల్ని కొనసాగిస్తోంది.

లండన్‌ సైన్స్‌ మ్యూజియంలో..

కశ్మీర్‌లో గుర్రాలపై విద్యార్థుల సందడి


వారి నవ్వు మర్చిపోలేను

పేద విద్యార్థుల్ని ప్రోత్సహించడం మా బాధ్యత, కార్పొరేషన్‌ తరఫున వివిధ సంస్థల్ని కలుపుకొని విద్యార్థుల కలలు సాకారమయ్యేలా విమాన విహారయాత్రలకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది వారి చదువుకు ఎంతో ఉపయోగపడుతోంది.  మార్కులు సాధించుకోవడంలో వారెంతో వృద్ధి చెందారనేది మాకు అర్థమైంది. పైగా వారి చిరునవ్వు ఎంతో ముచ్చటేస్తోంది. మా కార్యక్రమాలతో అటు పిల్లల్లోనూ పోటీతత్వం ఏర్పడుతోంది. ఇప్పుడు వారు ప్రపంచాన్ని చుట్టొస్తున్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్ని చేపడతాం.

ప్రియ, చెన్నై మేయర్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని