logo

హక్కులు ఉల్లంఘిస్తే చర్యలు

మానవహక్కుల ఉల్లంఘన విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు.

Updated : 30 Mar 2023 13:48 IST

అంబాసముద్రం ఏఎస్పీ సస్పెన్షన్‌
శాసనసభలో ముఖ్యమంత్రి

మాట్లాడుతున్న స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: మానవహక్కుల ఉల్లంఘన విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. విచారణకు తీసుకెళ్లిన వారి దంతాలు పీకినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబాసముద్రం ఏఎస్పీని సస్పెండ్‌ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం జలవనరులు, కార్మికసంక్షేమశాఖ సంబంధిత అంశాలపై చర్చ జరిగింది. శాంతిభద్రతలకు సంబంధించి ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి, సభ్యులు ఇసక్కి సుబ్బయ్య, జవాహిరుల్లా, ప్రిన్స్‌, అరుళ్‌, ముహమ్మదు షానవాజ్‌, నాగై మాలి, వేల్‌మురుగన్‌ తదితరులు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి స్పందించారు. రెండేళ్ల క్రితం సంజయ్‌ అనే వ్యక్తిని బహిరంగంగా కొట్టడానికి కక్షసాధింపుగా అన్నాడీఎంకే పెరంబూరు దక్షిణ కార్యదర్శి ఇళంగోవన్‌ అలియాస్‌ వ్యాసై ఇళంగోవన్‌ హత్య జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసిందన్నారు. హత్య జరిగిన రెండు గంటల్లోనే సంజయ్‌ సహా ఐదుగురిని అరెస్టు చేశారని, వారిలో ఒకరు మైనర్‌ బాలుడని తెలిపారు. హతుడు మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు చెప్పడం గురించి ఇప్పటివరకు దర్యాప్తులో తెలియరాలేదని పేర్కొన్నారు. దర్యాప్తునకు తీసుకొచ్చినవారి దంతాలు పీకినట్టు అంబాసముద్రం ఏఎస్పీపై ఆరోపణలు వచ్చిన వెంటనే సబ్‌ కలెక్టరు విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఏఎస్పీని వెయిటింగ్‌ లిస్ట్‌కు మార్చినట్టు పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్లలోని మానవహక్కుల ఉల్లంఘన ఘటనల్లో ప్రభుత్వం రాజీ పడదని వెల్లడించారు. ఏఎస్పీని సస్పెండ్‌ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. సమగ్ర దర్యాప్తు నివేదిక అందిన వెంటనే ఈ ఘటనలో పాల్గొన్నవారిపై తగిన తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2019లో అన్నాడీఎంకే హయాంలో 1,670 హత్యలు జరగ్గా.. తామొచ్చిన తర్వాత గత ఏడాదిలో 1,599 జరిగాయని తెలిపారు. సంవత్సరంలో 74 హత్యలను తమ ప్రభుత్వం తగ్గించిందని పేర్కొన్నారు.

కాలువల పునరుద్ధరణ

చర్చ సందర్భంగా మంత్రి దురైమురుగన్‌ మాట్లాడారు. చెన్నై జిల్లాలో అడయారు నది ముఖద్వారం నుంచి తిరు.వి.క వంతెన కింది వరకు పూడికతీత తదితర పనులను రూ.21.63 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు కోస్టల్‌ రెగ్యులేషన్‌ అథారిటీ అనుమతి పొందినట్టు తెలిపారు. ప్రాథమికదశ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. గ్రేటర్‌ చెన్నై జలమార్గాలు, బకింగ్‌హాం, అడయారు, కూవం నదీ కాలువలను రూ.1,281.88 కోట్ల వ్యయంతో పునరుద్ధరించడానికి అనుమతి పొందినట్టు తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో ఎక్కువగా వరద ప్రభావానికి గురయ్యే వరదరాజపురం, పాత పెరుంకళత్తూరు, ముడిచ్చూరు, పళ్లికరణై, రాయప్ప నగర్‌, నందివరం, గూడువాంజేరి, మణలి, వెళ్లి వాయిల్‌, కొళత్తూరు, మాధవరం తదితర ప్రాంతాలను పరిరక్షించే దృష్ట్యా అడయారు, కుళస్థలి నదులను వెడల్పు, జలమార్గాలను అభివృద్ధి, పారుదల కాలువలు ఏర్పాటు వంటి పనులను రూ.250 కోట్ల వ్యయంతో చేపట్టడానికి అనుమతిచ్చినట్టు తెలిపారు.

పరిశీలనలో బిల్లులు

ప్రశ్నోత్తరాల సమయంలో ఓ.పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ... కరోనా కాలంలో వైద్యసిబ్బంది బస చేసిన వసతి గృహాలు, వారికి అందించిన ఆహారానికి ఇంకా బిల్లులు చెల్లించలేదని తెలిపారు. దీనికి మంత్రి సుబ్రమణియన్‌ సమాధానమిస్తూ... సరైన బిల్లులకు నగదు చెల్లించినట్టు తెలిపారు. క్యాంటీన్లు లేకుండా ఆహారం సరఫరా చేసినట్టు సమర్పించిన బిల్లులకు మాత్రమే ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు.

జలవనరులశాఖ ప్రకటనలు

ఈశాన్య రుతుపవనాల్లో కలిగే వరద ప్రభావాన్ని తగ్గించడానికి గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కడలూరు జిల్లాల్లోని జలమార్గాల పనుకు రూ.20 కోట్ల కేటాయింపు
* చెన్నై, కాంచీపురం జిల్లాల్లో అడయారు, పోరూరు, కెరుగంపాక్కం, కొళపాక్కం, మణపాక్కం ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని శాశ్వతంగా అడ్డుకునేందుకు రూ.88 కోట్లతో పనులు
* కార్పొరేషన్‌ తాగునీటి అవసరాల కోసం మాధవరం రెట్టేరిని తాగునీటి వనరుగా మార్చేందుకు రూ.44 కోట్ల కేటాయింపు
* వరద ప్రభావాన్ని నివారించడానికి, ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లో రూ.106 కోట్లు, కడలూరు, తిరుచ్చి, మయిలాడుతురై, విరుదునగర్‌, తిరునెల్వేలి జిల్లాల్లో రూ.58.45 కోట్లతో పనులు
* ఆనకట్టలు, జలాశయాల భద్రతను నిర్ధారించడానికి 50 ఏళ్లకుపైగా వాడకంలో ఉన్న ఇనుప షట్టర్లకు దశలవారీగా పునరుద్ధరణ, మరమ్మతుల నిర్వహణలో భాగంగా తొలి విడతగా ప్రస్తుత ఏడాదిలో 17 జలాశయాలకు రూ.34.72 కోట్ల నిధులు
* కోయంబత్తూరు తదితర 8 జిల్లాల్లో 15చోట్ల రూ.70.75 కోట్ల వ్యయంతో కొత్త చెక్‌డ్యామ్‌ నిర్మాణాల పీఎంకేఎస్‌వై కింద 22 జిల్లాల్లో రూ.100.07 కోట్ల వ్యయంతో జలవనరుల పనులు
* నాగపట్నం, తంజావూరు జిల్లాల్లో సముద్రపు నీటి చొరబాటును అడ్డుకునేలా రెండు చోట్ల రూ.13.50 కోట్ల వ్యయంతో నిర్మాణాలు
* కోయంబత్తూరు, వేలూరు జిల్లాల్లో 4 చోట్ల చిన్న నదులు, కాలువలపై రూ.40.10 కోట్ల వ్యయంతో వంతెనలు, కాజ్‌వేలు తదితర పనులు
* తెన్కాశి, విరుదునగర్‌ జిల్లాల్లో రూ.12.79 కోట్ల వ్యయంతో 3 సాగు కాలువల నిర్మాణం
* వరదనీటి నిర్వహణ అభివృద్ధికి చెన్నైలోని చెంబరంపాక్కం, పూండి, రెడ్‌హిల్స్‌, జలవనరుల్లోని షట్టర్ల నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నిమిత్తం రూ.32 కోట్ల కేటాయింపు

కార్మిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో...

18 అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డుల్లో నమోదు పొందిన వారికి కళ్లద్దాల సాయం రూ.500 నుంచి రూ.750కు పెంపు
కార్మికులు, వారి పిల్లలు జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రూ.25వేలు, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు రూ.50వేల సాయం
రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికుల పిల్లలు అర్హత ప్రాతిపదికన ఐఐటీ, ఐఐఎం, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో (ఎంబీబీఎస్‌) చేరేటప్పుడు విద్య, బస రుసుములు, ఇతర ఖర్చులకు ప్రతి ఏడాది రూ.50వేలు, విద్యా ఉపకార వేతనం అందజేత.
రాష్ట్ర బాణసంచా, అగ్గిపెట్టెల కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రస్తుతం అందిస్తున్న రూ.1.25 లక్షల సాయం రూ.2లక్షలకు పెంపు
భవన నిర్మాణ కూలీలు పనిచేసే చోట ప్రమాదవశాత్తు మరణిస్తే వారి భౌతికకాయాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు సాయం అందజేత
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులు నమోదు పొంది గుండె శస్త్రచికిత్స, డయాలసిస్‌, కేన్సర్‌, ఆస్తమా, సిలికోసిస్‌, పక్షవాతం వంటి రోగాలతో పనిచేయలేని స్థితిలో ఉన్న 60ఏళ్లలోపు కార్మికుల జీవనాధారం, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఏడాదికి రూ.12వేలు అందించే పథకాన్ని తొలి విడతగా మూడేళ్లకు ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.
రాష్ట్ర అసంఘటిత చోదకులు, ఆటోమెటిక్‌ మోటారు వాహనాలు రిపేరు చేసే కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదు పొందిన కార్మికులు పనిచేసేటప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు సాయం అందించనుంది.
27 ప్రభుత్వ ఐటీఐల్లోని మౌలిక వసతులకు రూ.18.70 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ
ప్రభుత్వ ఐటీఐల్లోని శిక్షకులకు రూ.25లక్షల వ్యయంతో నైపుణ్యాభివృద్ధిని పెంపు
భవన నిర్మాణ పనుల్లో సురక్షితంగా పనిచేయడానికి సంబంధించి వీడియో దృశ్యాలను రూ.30 లక్షల వ్యయంతో రూపకల్పన
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భద్రతా అవగాహన కల్పించడానికి రూ.10లక్షల వ్యయంతో డాక్యుమెంటరీ విడుదల.
అయనావరంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌ నిర్వహించే ఎంబీబీఎస్‌ కోర్సుకు తర్వాత రెండేళ్ల డిప్లొమో కోర్సులైన అనస్తీషియా, ఈఎన్‌టీ, పీడియాటిక్ర్‌ తదితర విభాగాలు రూ.1.23 కోట్ల వ్యయంతో ప్రారంభం

సభాపతితో ఎస్పీ వేలుమణి భేటీ

సభాపతి అప్పావును ఆయన ఛాంబర్‌లో అన్నాడీఎంకే చీఫ్‌ విప్‌ ఎస్పీ వేలుమణి కలిశారు. శాసనసభ ప్రతిపక్ష ఉపనేతగా మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ను నియమించడం, ప్రతిపక్ష ఉపనేత సీటు వ్యవహారమై కలిసినట్టు సమాచారం. ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి సమీపాన ఉన్న సీట్లోనే ఓ.పన్నీర్‌సెల్వం కూర్చోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని