logo

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత విద్య

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య అందించడానికి జీవో జారీ చేయనున్నట్టు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు.

Updated : 30 Mar 2023 06:16 IST

పుదువై సీఎం 

చెన్నై, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య అందించడానికి జీవో జారీ చేయనున్నట్టు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు. పుదుచ్చేరి శాసనసభ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ... ఆరోగ్యశాఖలో పనిచేసే ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలుగా పెంచుతున్నట్టు ప్రకటించారు. కారైకాల్‌లో 50 పడకలు కలిసిగిన ఆయుష్‌ ఆస్పత్రిని రూ.15 కోట్ల వ్యయంతో ప్రారంభించినున్నట్టు తెలిపారు. దానికి రూ.2 కోట్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూశాఖలో రోజువారీ వేతనం పెంచనున్నట్టు తెలిపారు. సహకార చక్కెర కర్మాగారాన్ని గాడిన పెట్టనున్నామని, ప్రైవేటు భాగస్వామ్యంతో పునరుద్ధరించనున్నామని పేర్కొన్నారు. నిధులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థలు నిలదొక్కోవాలని సూచించారు. సభలో పౌరసరఫరాల శాఖ మంత్రి సాయి శవరణన్‌కుమార్‌ కొన్ని ప్రకనటలు చేశారు. రేషన్‌కార్డు సేవలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా సేవల కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. దీని ద్వారా తమ శాఖ సేవలను ఆయా ప్రాంతాల్లో పొందవచ్చని, కంప్యూటరీకరణ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు. రేషన్‌ దుకాణాలను తెరిచి కొత్త పథకం మేరకు ఉచిత బియ్యం, సబ్సిడీపై పంచదార, చిరుధాన్యాలు అందించనున్నట్టు తెలిపారు. చిరుధాన్యాల సంవత్సరం కావడంతో సజ్జలు, జొన్నలు, రాగులు అందించనున్నట్టు పేర్కొన్నారు. రేషన్‌ కార్డుదారుల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రస్తుత ఏడాది కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పాప్కో పరిధిలోని 33 బార్ల వసతితో కూడిన రీటైల్‌ మద్యం దుకాణాలను 20ఏళ్లకు ఒక్కరికే రూ.150 కోట్ల డిపాజిట్‌తో లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని