logo

‘అవన్నీ కట్టుకథలే

సెంగోల్‌ గురించి అన్నీ కట్టుకథలే చెబుతున్నారని ది హిందూ పబ్లిషింగ్‌ గ్రూపు డైరెక్టరు ఎన్‌.రాం తెలిపారు.

Published : 01 Jun 2023 00:20 IST

  సమావేశంలో  మాట్లాడుతున్న ఎన్‌.రాం

చెన్నై, న్యూస్‌టుడే: సెంగోల్‌ గురించి అన్నీ కట్టుకథలే చెబుతున్నారని ది హిందూ పబ్లిషింగ్‌ గ్రూపు డైరెక్టరు ఎన్‌.రాం తెలిపారు. నగరంలోని కామరాజర్‌ ఆడిటోరియంలో ‘దేశియ సిందనైయాళర్గళ్‌ పేరవై’ తరఫున నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సెంగోల్‌ గురించి పలు కట్టుకథలు ప్రాచుర్యంలోకి వచ్చాయన్నారు. నటీనటులతో చిత్రీకరించిన కథనూ ఆన్‌లైన్‌లో ఉంచారని తెలిపారు. నెహ్రూ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలా? అని మౌంట్‌ బాటెన్‌ ప్రభువు అడిగినట్టు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. దాని గురించి ప్రస్తుతం చెబుతున్నవి అవాస్తవాలని కొట్టిపారేశారు. అధికార మార్పిడి కోసం సెంగోల్‌ను ఇచ్చినట్టు చెప్పడం కట్టుకథని, జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పడానికి హిందుత్వమే కారణమని ఆరోపించారు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత కీలక కార్యక్రమమని, ఆ రోజు నెహ్రూ చేతికి అందించిన బహుమతుల్లో సెంగోల్‌ కూడా ఒకటని తెలిపారు. దీంతో దానిని మ్యూజియంలో ఉంచారన్నారు. వివరాల్లో గోల్డెన్‌ స్టిక్‌ అనే రాసి ఉంచారని, వాకింగ్‌ స్టిక్‌ అని రాయలేదని తెలిపారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి మాట్లాడుతూ... సెంగోల్‌ అనేది గర్వకారణమైన విషయం కాదన్నారు. మోదీ మళ్లీ రాచరిక పాలనను తీసుకురావడానికి ఈ సెంగోల్‌ను తెచ్చారని విమర్శించారు. ఈ చర్యల్లో రాజకీయ ఉద్దేశం ఉందన్నారు. కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన ఆధీనాన్ని మాత్రమే ఎందుకు ఆహ్వానించారని, క్రైస్తవ, ముస్లిం తదితర మత పెద్దలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని