logo

పద్య రచనలో ప్రావీణ్యులు ఆచార్య రామచంద్ర

ఆచార్య రామచంద్ర తెలుగు శాఖ అధ్యక్షులుగా ఓ వైపు అద్వితీయ సేవలు అందిస్తూ మరోవైపు పద్య రచనలు చేసిన ప్రావీణ్యులని ద్వారకదాస్‌ గోవర్దనదాస్‌ వైష్ణవ కళాశాల తెలుగు శాఖ విశ్రాంత అధ్యక్షులు డాక్టర్‌ కాసల నాగభూషణం అభివర్ణించారు.

Updated : 03 Jun 2023 06:29 IST

ఆచార్య రామచంద్ర చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అతిథులు, నిర్వాహకులు

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: ఆచార్య రామచంద్ర తెలుగు శాఖ అధ్యక్షులుగా ఓ వైపు అద్వితీయ సేవలు అందిస్తూ మరోవైపు పద్య రచనలు చేసిన ప్రావీణ్యులని ద్వారకదాస్‌ గోవర్దనదాస్‌ వైష్ణవ కళాశాల తెలుగు శాఖ విశ్రాంత అధ్యక్షులు డాక్టర్‌ కాసల నాగభూషణం అభివర్ణించారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో సాహితీవేత్తల జయంతి ఉత్సవాల సందర్భంగా సాహిత్యకారుల జీవన చిత్రాలు శీర్షికలో భాగంగా ‘రమ్య కవితా సుధాచంద్ర ఆచార్య వి.రామచంద్ర’ అంశం గురించి శుక్రవారం సాహితీ ఉపన్యాసం ఏర్పాటైంది. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షత వహిస్తూ త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోనున్న తమ తెలుగు శాఖ వికాసానికి రామచంద్ర కృషి కీలకమైనదని అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీ మహిళా కళాశాల తెలుగు శాఖ విశ్రాంత అధ్యక్షులు డాక్టర్‌ నిర్మల పళనివేలు మాట్లాడుతూ రామచంద్రకు తాము తొలి శిష్యులమని, విద్యార్థి కాలంనాటి విశేషాలను, రామచంద్ర అందించిన సహాయ సహకారాలను వివరించారు. కాసల నాగభూణం ఉపన్యసిస్తూ రామచంద్ర విరామం లేని వ్యక్తి అని, పైగా కవిగా, విమర్శకులుగా పేరు పొందారని తెలిపారు. రాశి కంటే వాసి గొప్పదని రామచంద్ర రచనలు నిరూపిస్తాయన్నారు. శ్రీవేంకటేశ్వర శతకం, వాసంతిక, సుధాలహరి వంటి రామచంద్ర రచనల విశిష్టతను, కవితల రచనలలోని వైవిధ్యాన్ని వివరిస్తూ ఆయన రచించిన పలు కవితలను రాగభావయుక్తంగా వినిపించి ఆహ్లాదపరిచారు. కార్యక్రమంలో భాగంగా రాజధాని కళాశాల తెలుగు శాఖ నూతన అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ ఎలిజబెత్‌ జయకుమారిని విస్తాలి శంకరరావు, జనని కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తదితరులు శాలువాతో అభినందించారు. అతిథి ఉపన్యాసకులు డాక్టర్‌ పాండురంగం కాళియప్ప స్వాగతం పలుకగా డాక్టర్‌ మాదా శంకర్‌బాబు వందన సమర్పణ చేశారు. ముందుగా అతిథులు, నిర్వాహకులు ఆచార్య రామచంద్ర చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజధాని కళాశాల తెలుగు శాఖ విశ్రాంత అధ్యక్షులు డాక్టర్‌ ఎ.అంబ్రూణి, విశ్రాంత ఆచార్యులు ఎల్బీ శంకరరావు, ప్రస్తుత ఉపన్యాసకులు మామిడి మురళి, ఆచార్య రామచంద్ర సతీమణి సుగుణ, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ సభ్యురాలు డాక్టర్‌ ఎ.శివకుమారి తదితరులతోపాటు ఎంఏ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని