logo

ఐఐటీఎంలో కొత్త కోర్సు ప్రారంభం

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల రంగాన్ని బాగా అభివృద్ధి చేసేందుకు ఐఐటీఎం ‘ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌’లో బీఎస్‌ డిగ్రీ కోర్సును లాంఛనంగా ప్రారంభించింది. అభివృద్ధి చెందుతూ,  ఎలక్ట్రానిక్స్‌ రంగంలో  కొత్తగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా నూతన కోర్సును డిజైన్‌ చేశారు.

Published : 08 Jun 2023 00:09 IST

వడపళని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల రంగాన్ని బాగా అభివృద్ధి చేసేందుకు ఐఐటీఎం ‘ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌’లో బీఎస్‌ డిగ్రీ కోర్సును లాంఛనంగా ప్రారంభించింది. అభివృద్ధి చెందుతూ,  ఎలక్ట్రానిక్స్‌ రంగంలో  కొత్తగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా నూతన కోర్సును డిజైన్‌ చేశారు. పారిశ్రామిక రంగ నిపుణులను సంప్రదించి,  వారి సలహాలు, సూచనల మేరకు సిలబస్‌ రూపొందించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో  ఐఐటీ  సెంటర్‌ ఫర్‌ ఔట్ రీచ్‌, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ (సీˆఓడీఈ)  ఆచార్యులు, అసోసియేట్ ఛైర్‌  ఆండ్రూ తంగరాజ్‌  మాట్లాడుతూ  ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా  సంభావ్యత (పొటెన్షియల్‌) ఎక్కువగా ఉందన్నారు. అందుకు ఐఐటీలో ప్రారంభించిన  బీఎస్‌ ‘ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌’ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉండగలదని చెప్పారు. కోర్సుతో ఆటోమోటివ్‌, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌, మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌,  రక్షణ రంగాలకు దోహద పడుతుందన్నారు. కోర్సులో భాగంగా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలుంటాయని చెప్పారు.  ఆయా సంస్థల్లో పని చేస్తున్న సమయంలో పరిశ్రమల గురించి తెలుసుకోగలరన్నారు. ఇంటర్న్‌షిప్‌లో ఉన్న వారికి సముచిత స్టయిఫండు అందుతుందని తెలిపారు. ఇది ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ప్లస్‌టూ ఉత్తీర్ణులై గణితం, భౌతిక శాస్త్రంతో చదివిన వారు వయో పరిమితితో సంబంధం లేకుండా చేరవచ్చు. తరగతులు ఆన్‌లైన్‌లో ఉంటాయి. అన్ని రకాలైన సందేహాలు ఆన్‌లైన్‌లో నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. క్విజ్‌లు, పరీక్షలు, ల్యాబ్‌ పరీక్షలకు నేరుగా హాజరు కావాలి. ల్యాబ్‌ కోర్సులు ఐఐటీ మద్రాస్‌ ప్రాంగణంలో జరుగుతాయి.  2025 నాటికి 100 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు చేరుకోవాలనేది ‘తమిళనాడు ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ మానుఫ్యాక్చరింగ్‌ పాలసీ’ ఆలోచనగా ఉంది.  ఆ నాటికి మొత్తం ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో 25శాతం ఎగుమతి చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంటోంది. ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగు విభాగ ఆచార్యులు బాబి జార్జి,  ఆచార్యులు ఎస్‌.అనిరుద్ధన్‌ బీఎస్‌ కోర్సు గురించి వివరించారు. కోర్సులో చేరాలనుకునే ఔత్సాహికులు ఈ నెల 25వ తేదీలోగా https://study.iitm.ac.in/es/  లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని