logo

Vijay: దళపతి దారెటు!.. ‘బీ టీమ్‌’గా ఎవరికివారే ముద్ర ‌

ప్రముఖ నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. తాను సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని అభిమానులను ఊరించి చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి అభిమానుల ఆశలు నీరుగార్చారు.

Updated : 13 Feb 2024 13:13 IST

విమర్శలు తీవ్రతరం చేసిన పలు పార్టీలు 

విజయ్‌తో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్‌

 న్యూస్‌టుడే, వేలచ్చేరి : ప్రముఖ నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. తాను సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని అభిమానులను ఊరించి చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి అభిమానుల ఆశలు నీరుగార్చారు. కానీ నటుడు దళపతి విజయ్‌ అలాకాకుండా తాను చెప్పిన సమయానికి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేయడంతో పలు పార్టీల నేతలు సంప్రదాయానికి స్వాగతిస్తున్నా లోలోపల మదనపడుతున్నారు.

ప్రజాసేవతో మార్గం సిద్ధం

విజయ్‌కు వ్యక్తిగతంగా రాజకీయ అనుభవం లేకున్నా తన అభిమాన సంఘాల ద్వారా గత కొంతకాలంగా ప్రజా సేవలో ఉన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆర్థికసాయం, పేదలకు అన్నదానం, విపత్తుల సమయంలో సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువై అభిమాన సంఘాల ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ద్వారా తన రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సిద్ధం చేసుకున్నారు. విజయ్‌ తాను నటించిన ప్రతి సినిమాలో రాజకీయ అంశాలను వ్యక్తపరచడంతో ఆ చిత్రాల విడుదలకు అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. 2011లో ‘కావలన్‌’ చిత్రానికి డీఎంకే ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడంతో తరువాత ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే గెలుపొందిన తరువాత తాను ఉడుతగా పార్టీ విజయానికి కృషి చేశానని చెప్పడంతో జయలలిత ఆగ్రహానికి గురయ్యాడు.

పార్టీ ప్రకటనకు ముందే పోటీ

తరువాత డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా ఇలా ఏదో ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని సినిమాల్లో డైలాగులు ఉండేలా చూసుకున్నారు. అదేవిధంగా సినీ పాటల విడుదల కార్యక్రమాల్లో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయసాగారు. రాజకీయ ప్రకటనకు ముందే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ తరఫున అనేక మంది పోటీ చేసి గెలుపొందారు. వీటన్నింటిని బేరీజు వేసుకుని కొన్నిరోజుల క్రితం ‘తమిళగ వెట్రి’ పార్టీని ప్రారంభించారు. అదే సమయంలో విజయ్‌ పార్టీని ప్రారంభించిన సమయంలో విడుదల చేసిన ప్రకటనలో.. తన పార్టీ పరిపాలనలో దుర్వినియోగాలు, అవినీతి, కులమతాల తేడాలు ఉండవని పేర్కొన్నారు.

విమర్శలూ ఎక్కువే..

డీఎంకే వైపున ఉన్న మైనార్టీలు, యువత ఓట్లను రాబట్టేందుకు భాజపా పంపిన వ్యక్తిగా విజయ్‌ని ఓ వైపు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నామలై ఎదుగుదలను నిరోధించేందుకు డీఎంకే తరఫున వచ్చిన వ్యక్తిగా భాజపా అదేస్థాయిలో విమర్శిస్తోంది. రజనీకాంత్‌ను రాజకీయాల్లో తీసుకు రాలేకపోవడంతో నిరాశతో ఉన్న భాజపా విజయ్‌ను రంగంలోకి దింపిందని మరో వైపు అన్నాడీఎంకే వ్యంగ్యాస్త్రాలు సందిస్తోంది. యువతలో మంచి పేరున్న సీమాన్‌ ప్రాభవాన్ని తగ్గించడం కోసమే రంగంలోకి దింపారని నామ్‌ తమిళర్‌ కట్చి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా విజయ్‌ తన రాజకీయ పార్టీని ప్రకటించినప్పటి నుంచి ఆయనపై ‘బీ టీమ్‌’ అనే ముద్ర పడింది. తన రాజకీయ నినాదాలను తెరపైకి తెచ్చిన విజయ్‌ ఇంకా స్పష్టమైన విధానాల ప్రకటనతో బయటకు రాలేదు. అయితే డీఎంకే, అన్నాడీఎంకే, భాజపాకు వ్యతిరేకంగా ఆయన రాజకీయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని