logo

బడిబాట పట్టాల్సిందే!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా చూడటానికి విద్యాశాఖ కొత్త ప్రయత్నం ప్రారంభిస్తోంది. 70వేల మంది వరకు బడి మానేశారని, ఇంకా 3 లక్షల మేరకు అదే జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తేలింది.

Updated : 05 May 2024 07:16 IST

డ్రాప్‌ ఔట్లు పూర్తిగా తగ్గించేందుకు విద్యాశాఖ చర్యలు

వడపళని, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా చూడటానికి విద్యాశాఖ కొత్త ప్రయత్నం ప్రారంభిస్తోంది. 70వేల మంది వరకు బడి మానేశారని, ఇంకా 3 లక్షల మేరకు అదే జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండటం, వలస, పరీక్షలంటే భయం, చిన్న వయసులో ఉద్యోగం, బాల్య వివాహాలు వంటివి అందుకు కారణాలుగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అందరూ తప్పనిసరిగా బడికెళ్లేలా చూసేందుకు రెండు వారాలపాటు అలాంటి విద్యార్థులను గుర్తించాలనుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఈఎంఐఎస్‌)లో ఎప్పటికప్పుడు ఉంచుతామని కడలూరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని సి.హేమలత అన్నారు.

విద్యార్థులతో సమావేశం..

ఈ ఏడాది పూర్వ విద్యార్థులు, పాఠశాల నిర్వాహక కమిటీ తరచూ విద్యార్థులతో సమావేశం కానుంది. నైపుణ్యం పెంచుకుంటూ భయపడకుండా ఎలా చదవాలో విద్యార్థులకు నేర్పుతారని విద్యాశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకం ‘ఇంటర్వెన్షన్‌ ప్రోగ్రాం’ లాంఛనంగా ప్రారంభించాలనుకుంటున్నకట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు ముగిసి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. టీచర్లు ఇంటింటికీ వెళ్లడమో లేదా వారిని పిలిపించి ఎందుకు మానేస్తున్నారో అడిగి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బడి మానేసినవారు ఎక్కువగా ఉన్నారని, కృష్ణగిరిలాంటి జిల్లాల్లో ఈ సమస్య మరీ అధికమని, అక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. డ్రాప్‌ ఔట్లు బాగా తగ్గించేందుకు శిబిరాలు కూడా నిర్వహించనున్నట్టు అధికారి ఒకరన్నారు.

అనుత్తీర్ణులు 62 వేల మంది..

2023లో పది, ప్లస్‌టూ బోర్డు పరీక్షల్లో 62వేల మంది ఫెయిలయ్యారు. టీచర్లు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మళ్లీ పరీక్ష రాయించేందుకు ధైర్యాన్ని కల్పించారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా చేయాలనుకుంటున్నారు. నైపుణ్యాభివృద్ధి మెరుగు పరచుకునేందుకు ‘ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్్స(ఐటీఐ), పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వారి పేర్లు నమోదు చేసేందుకు ప్రోత్సహించనున్నామని విద్యాశాఖ కార్యదర్శి జె.కుమారగురుబారన్‌ అన్నారు. పాఠశాలల్లో ఉన్న మాదిరిగా ఉన్నత విద్యాసంస్థల్లోనూ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఐడీ(యూఎంఐఎస్‌ ఐడీ)ని విద్యాశాఖ ఏర్పాటు చేయాలనుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని