logo

ఠారెత్తిస్తున్న ఎండలు!

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది.

Published : 07 May 2024 00:16 IST

బెంబేలెత్తుతున్న జనాలు
ఇప్పటికే పలువురు ఆసుపత్రిపాలు
రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన యంత్రాంగం

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది. ప్రత్యేకించి ఉత్తర తమిళనాడు జిల్లాలకు వడగాలులుంటాయని హెచ్చరించింది. ఈ ప్రభావాన్ని ప్రజలు నేరుగా చూస్తున్నారు. పలువురు సొమ్మసిల్లిన ఘటనలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లలో లేనివిధంగా ఈ వేసవి ప్రతాపం చూపుతోంది. రాష్ట్ర యంత్రాంగం సైతం అప్రమత్తమై అన్ని జిల్లాల్లోనూ వడదెబ్బ బాధితుల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.

ఈనాడు -చెన్నై

ప్రాణం పోయింది

కాంచీపురంలో నిర్మాణపనుల్లో నిమగ్నమైన ఓ కూలీ ఉన్నట్లుండి సొమ్మసిల్లిపడిపోయాడు. స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితంలేకపోయింది. స్పృహలోలేని అతడ్ని కాపాడుకునేందుకు అక్కడినుంచి నగరంలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి పనులకోసం వలస వచ్చాడని గుర్తించారు.

సకాలంలో తీసుకెళ్లడంతో..

మీంజూరు బైపాస్‌ సమీపాన నిర్మాణపనుల్లో ఉన్న మరో కార్మికుడు వడదెబ్బకు గురయ్యారు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే.. వడదెబ్బ సంకేతాలున్నట్లు గుర్తించారు. అతనికి మూత్రపిండ సమస్యలూ ఉండటంతో వెంటనే చెన్నైలోని ఆర్‌జీజీజీహెచ్‌కు తరలించారు. సకాలంలో రావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చక్కటి చికిత్స అందిస్తున్నారు.

నగరంతో పాటు పలు జిల్లాల్లో గత 10, 15 రోజులుగా వడదెబ్బ లక్షణాలతో పలువురు ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రధానంగా ఎండ తాకిడికి తలనొప్పి విపరీతంగా ఉంటోందని, ఇలా ఎందుకు అవుతోందో తెలియడంలేదని బాధితులు వైద్యులకు చెబుతున్నారు. ఈ సమస్య పిల్లల్లో, పెద్దవారిలో వస్తున్నట్లు గుర్తించారు. ఎండబారిన పడినప్పుడు అలసటగా కూడా భావిస్తున్నారని వివరిస్తున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ, కార్పొరేషన్‌ ఆసుపత్రుల్లోనూ ఓపీకి వచ్చేవారిపై ఎండ ప్రభావం ఎలా ఉందనే కోణంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం 100 మందికి వడదెబ్బకు అనుబంధంగా ఉండే చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

సాధారణం కన్నా ఎక్కువ..

రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఎండ ప్రభావం బాగా ఉంది. ప్రత్యేకించి చెన్నై నగరంలో సాధారణం కన్నా 1 నుంచి 3.1డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోడ్‌, కన్నియాకుమరి, కరూర్‌, మదురై, సేలం, తిరుపత్తూరు, తిరుచ్చి, ధర్మపురి, నాగపట్టిణం, వేలూరు తదితర జిల్లాల్లో 3 నుంచి 5డిగ్రీల అధికంగా రికార్డవుతున్నాయి. చల్లగా ఉండే ఊటీలో సైతం సాధరణం కన్నా 3, 4 డిగ్రీల అధికంగా ఉంటున్నాయి.

ఆసుపత్రుల్లో ఏర్పాట్లు

రాజీవ్‌గాంధీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (ఆర్‌జీజీజీహెచ్‌)లో వడదెబ్బ రోగుల కోసం ప్రత్యేకంగా ఓ వార్డు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక ఏసీ గది కేటాయించారు. అత్యవసర కేసుల కోసం 5 పడకలుంచారు. నగరంలోని స్టాన్లీ వైద్యకళాశాల ఆసుపత్రిలో 10 పడకలు సిద్ధం చేశారు. కలైజ్ఞర్‌ సెంటినరీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యవసర సేవల కోసం 24 పడకలు కేటాయించారు. రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనూ 10 పడకలు సిద్ధం చేశారు. ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఆర్‌ఎస్‌, ఐస్‌ప్యాక్‌లు సిద్ధం చేసుకోవడంతో పాటు చికిత్సకు అవసరమైన మందులు సమకూర్చుకుని ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. ఆయా ఆసుపత్రుల్లో వడదెబ్బకు గురైన రోగులకు చికిత్స అందించేందుకు వివిధ రకాల పద్ధతులు అనుసరిస్తున్నారు.

అనవసరంగా తిరగొద్దు..

ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల దాకా బయటికి రాకపోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. చెమటలు పట్టడం, కండరాలు తిమ్మిరెక్కడం, అలసట, మగతగా ఉండటం, వికారం, తలనొప్పిలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వైద్యుల్ని సంప్రదించాలని అంటున్నారు.

తాగునీరే రక్ష..

నగరంలో జీసీసీ తరపుణ చాలా ప్రాంతాల్లో బాటసారుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 జోన్లలో 188 చోట్ల ఈ వసతుల్ని అందుబాటులోకి తెచ్చారు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కింగ్‌ చేసిన కార్లలో ఎవరూ ఉండొద్దని, పిల్లల్ని సైతం ఉంచొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. ఇలా ఉంటే వేడిని తట్టుకోలేక మరణించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తలపై తప్పకుండా టోపీ, ఇతర ఏదైనా వస్త్రం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తీసుకుంటుండటం, కొబ్బరినీరు, మజ్జిగ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

జబ్బులుంటే జాగ్రత్త

వడదెబ్బకు తోడు జబ్బులుంటే చికిత్స కష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, ఇతర రోగాలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగకపోవడమే మంచిదని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని