logo

శివారు ప్ర‘జల ఆశలెన్నో’..!

ప్రతి ఇంటికీ, ప్రభుత్వ విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో 2019లో జల్‌జీవన్‌ మిషన్‌ను (జె.జె.ఎం.)ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

Published : 29 Jun 2022 03:42 IST

-ఈనాడు, విశాఖపట్నం

ప్రతి ఇంటికీ, ప్రభుత్వ విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో 2019లో జల్‌జీవన్‌ మిషన్‌ను (జె.జె.ఎం.)ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

థకం ప్రారంభమై మూడేళ్లు కావస్తున్నా నగర శివారుల్లోని గ్రామాల్లో మాత్రం కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి రాలేదు. జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో వేల సంఖ్యలో గృహాలకు సొంత కుళాయిలు లేకపోవడం గమనార్హం. 

సగం.. సగం

ఈ పథకంలో సగం మొత్తాన్ని కేంద్రం.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కనెక్షన్లు ఇవ్వాలంటే ప్రతి గ్రామంలో పైపులైను వ్యవస్థలను, జనాభాకు తగ్గ మంచినీటి ట్యాంకులను నిర్మించుకోవడం కీలకం. ఏ గ్రామంలో ఎలాంటివి  సమకూర్చాలన్న అంశాలపై ఇప్పటికే అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. గ్రామాల వారీగా ఏ పనులు చేయాలన్న అంశాలను ఖరారు చేసి ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి పంపారు. రూ.7.30 కోట్ల విలువైన 77 పనులను ఇప్పటికే ప్రారంభించి కొన్నింటిని పూర్తిచేశారు. రూ.30.75కోట్ల విలువైన 135 పనులకు టెండర్లు పిలిచారు.  మిగిలిన ఆయా పనులు కూడా వేగంగా ప్రారంభమైతే జిల్లాలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కనెక్షన్‌ ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది.

కొన్నిచోట్ల నత్తనడకన

పథకం పూర్తికావడానికి 2024 సంవత్సరం వరకు గడువున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికే అన్ని రకాల పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళిక రూపొందించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరిగితే వచ్చే సంవత్సరానికే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ వచ్చే అవకాశం ఉన్నా పనులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో  నత్తనడకన నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామస్థాయిలో సర్పంచి అధ్యక్షతన ‘గ్రామ తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ’ సూచనల మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. ఆయా వ్యవస్థల పర్యవేక్షణ బాధ్యత వారిదే కావడంతో వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు.

అవకాశం ఇస్తే..

జీవీఎంసీ పరిధిలో  సుమారు మూడు లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చారు. శివారు వార్డుల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా అంతటా పైపులైను వ్యవస్థ ఉండడంతో దరఖాస్తు చేసి, రుసుము చెల్లించిన వెంటనేకుళాయి మంజూరుచేస్తున్నారు. నగరం కావడంతో జీవీఎంసీ జె.జె.ఎం. పరిధిలో లేదు. శివారు ప్రాంతాలను పథకం పరిధిలోకి తెస్తే కనెక్షన్లను  వేగంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* విశాఖ జిల్లాలోని గ్రామీణ మండలాలు: 4

* మొత్తం గ్రామాలు: 265

* మొత్తం ఇళ్లు: 59,338

* కుళాయి కనెక్షన్‌ ఉన్న ఇళ్లు: 22,887 (2022, మార్చి 31వ తేదీ నాటికి; 38.57 శాతం)

* లేని ఇళ్లు: 36,451 (61.43శాతం)

* కుళాయిలు ఉన్న గ్రామాలు:160

* పాక్షికంగా ఉన్నవి: 105

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని