logo

అన్యాయం జరిగింది.. ఆపండి!

స్టాఫ్‌నర్స్‌ పోస్టుల కౌన్సెలింగ్‌లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కొవిడ్‌ కాలంలో పనిచేసిన ఎస్సీ అభ్యర్థులకు మార్కులు వేయడంలో, జాబితా పొందుపర్చడంలో తప్పిదాలు జరిగాయని, కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.

Updated : 21 Jan 2023 07:12 IST

స్టాఫ్‌నర్స్‌ల కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన

కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద నిరసన తెలియజేస్తున్న అభ్యర్థులు

సీతంపేట, న్యూస్‌టుడే: స్టాఫ్‌నర్స్‌ పోస్టుల కౌన్సెలింగ్‌లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కొవిడ్‌ కాలంలో పనిచేసిన ఎస్సీ అభ్యర్థులకు మార్కులు వేయడంలో, జాబితా పొందుపర్చడంలో తప్పిదాలు జరిగాయని, కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ జోన్‌- 1 పరిధిలో విశాఖ రామాటాకీస్‌ రోడ్డులోని ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్‌ ప్రారంభించగా.. ఉదయం 11 గంటల నుంచే ఈ నిరసన మొదలయింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ద్వారకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సి.ఐ. సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

సమస్య ఇదీ: ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 179 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ గతంలో విడుదల చేశారు. 172 పోస్టులకు సుమారు 9వేల దరఖాస్తులు అందాయి. వీటిలో మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రక్రియ కింద ఎంపిక చేసిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 18వ తేదీ వరకు చేశారు. అనంతరం అదే రోజు రాత్రి మెరిట్‌ జాబితా, తద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. దీని ఆధారంగా శుక్రవారం ఉదయం 11గంటల నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించి, వచ్చిన అభ్యర్థులకు ఖాళీల ఆధారంగా పోస్టులు కేటాయించి ఉత్తర్వులు అందించి పంపించారు. అయితే మెరిట్‌, ఎంపిక జాబితాలు రెండూ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. మెరిట్‌ జాబితాను రెండు సార్లు పెట్టడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ కౌన్సెలింగ్‌పై కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిలిపుదల చేయిస్తామని ఎ.ఐ.టి.యు.సి ప్రతినిధి అమర్‌ తెలిపారు.

*     వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఉమా సుందరి పోలీసుల రక్షణలో నిరసన తెలియజేస్తున్న అభ్యర్థుల నుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే నడుచుకున్నామన్నారు. సిబ్బంది కొరత కారణంగా తొలి జాబితాలో తప్పు దొర్లిన విషయం వెలుగు చూసిందని, దీంతో క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా విడుదల చేశామన్నారు.
*    పసి పిల్లలతో వచ్చి: కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన అభ్యర్థులు పలు తిప్పలు పడ్డారు.  నిల్చోవడానికి టెంట్‌లు వేసినప్పటికీ తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని పలువురు ఆరోపించారు. అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వక పోవడంతో మెరిట్‌ జాబితాలో ఉన్న చాలామంది ఉత్తరాంధ్రలోని మారూమూల ప్రాంతాల నుంచి సహాయకుల సహాయంతో వచ్చారు. కొంతమంది తల్లులు పసిపిల్లలతో సైతం కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.
*    కౌన్సెలింగ్‌కి 136మంది హాజరు: కౌన్సెలింగ్‌కు 172 మందిని పిలవగా  136 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఉమా సుందరి తెలిపారు. మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 108 పోస్టులకు 81, విమ్స్‌లోని 24 పోస్టులకు 18, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ)లో 47 పోస్టులకు 29 మాత్రమే భర్తీ అయ్యాయని, 8మంది అభ్యర్థులు సుముఖత చూపలేదన్నారు. ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని