logo

నిధుల కోత.. అభివృద్ధికి వాత!

జిల్లాపరిషత్తు ప్రాదేశిక సభ్యులకు తమ పరిధిలో అభివృద్ధి పనుల కోసం కేటాయించే నిధుల్లో ఈ ఏడాది కొంత కోతపెట్టారు.

Published : 20 Mar 2023 03:54 IST

జడ్పీటీసీ సభ్యులకు తగ్గిన కేటాయింపులు

ప్రహరీకి నోచుకోని రాజయ్యపేట అంగన్‌వాడీ కేంద్రం

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: జిల్లాపరిషత్తు ప్రాదేశిక సభ్యులకు తమ పరిధిలో అభివృద్ధి పనుల కోసం కేటాయించే నిధుల్లో ఈ ఏడాది కొంత కోతపెట్టారు. ఓవైపు మండలస్థాయి సమావేశాల్లో తమకు గుర్తింపు ఉండడం లేదని, ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఇప్పటికే జడ్పీటీసీ సభ్యులు గగ్గోలుపెడుతున్నారు. ఇప్పుడు తమకిచ్చే అరకొర నిధులను తగ్గిస్తే ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఇటీవలే జడ్పీటీసీ సభ్యులతో పనుల పంపకంపై ప్రత్యేకంగా జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర సమావేశమై చర్చించారు. ఆ సమయంలో కొంతమంది సభ్యులు నిధుల కోత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపైనా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

జడ్పీటీసీ సభ్యులకు ఏటా జిల్లా పరిషత్తు సాధారణ, ఆర్థిక సంఘం నిధుల నుంచి కొంతమేర నిధులు కేటాయిస్తుంటారు. వాటిని ఒకే పనిపై మొత్తం ఖర్చుచేయకుండా ఉపాధిహామీ పథకం నిధులకు అనుసంధానించి ఎక్కువ పనులు జరిగేలా చూస్తుంటారు. తాగునీరు, సామాజిక భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, కాలువలు, సీసీ రహదారుల నిర్మాణాల లాంటి వాటికే వీటిని ఉపయోగిస్తుంటారు. 2021-22 ఏడాదికి సంబంధించి 39 మంది జడ్పీటీసీ సభ్యులకు రూ.15 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. వాటితో ప్రతిపాదించిన పనుల్లో 50 శాతం కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదికి వచ్చేసరికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఒక్కో జడ్పీటీసీ సభ్యునికి రూ.13 లక్షలే కేటాయించారు. అంటే ఒక్కో జడ్పీటీసీ సభ్యునికి రూ.2 లక్షలు చొప్పున జిల్లా మొత్తంగా రూ.78 లక్షల నిధులకు కోతపెట్టారు. ఎమ్మెల్యేలకు మొదటి ఏడాది రూ.50 లక్షలు చొప్పున కేటాయిస్తే ఈ ఏడాదికి వచ్చేనాటికి రూ.13 లక్షలకే పరిమితం చేసినట్లు తెలిసింది. ఈ నిధులు కూడా ఇంకా జడ్పీ ఖాతాకు చేరలేదు. వీటితో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ముందే అడుగుతున్నారు. నిధులున్నా బిల్లులందని పరిస్థితి ఉంటే ఇంకా నిధులు రానివాటికి ప్రతిపాదనలు అడగడంపై సభ్యుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.

భీమవరంలో జడ్పీ నిధులతో ప్రతిపాదించిన కాలువ


పనులు సాగవు.. బిల్లులందవు..

* ఎస్‌.రాయవరానికి మొదటి విడతగా రూ.16 లక్షల జడ్పీ నిధులు మంజూరయ్యాయి. వీటిని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. భీమవరంలో రూ.3 లక్షలతో కాలువ నిర్మించాలని ప్రతిపాదించి నిధులు సరిపోవని వదిలేశారు..ఈ ఏడాది చేద్దామనుకుంటే నిధులు తగ్గించి ఇవ్వడంతో ఆ పని ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.  

* నక్కపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 15 లక్షలు కేటాయించారు. వాటితో పలు గ్రామాల్లో తాగునీటి పైపులు, ఎస్సీ కాలనీల్లో సామాజిక భవనాలు, తరగతి గదుల మరమ్మతులతో పాటు, సీసీ రోడ్ల నిర్మాణానికి  రూ.60 వేల నుంచి రూ.3 లక్షలకు పైబడి మొత్తం పది పనులకు కేటాయించారు. తీరా ఏడాది పూర్తయినా ఈ పనుల్లో ఒక్కటీ ముందుకు వెళ్లలేదు.. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు ఎవరూ ఆసక్తి చూపలేదు..

* అనంతగిరి మండలంలో జడ్పీ నిధుల నుంచి ఆరు పనులు చేశారు. వాటిలో ఒక్క పనికి కూడా బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు జడ్పీటీసీ సభ్యుని చుట్టూ తిరుగుతున్నారు.. ఈనెల 10 లోగా పనుల వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయకుంటే బిల్లులు అందడం కష్టమేనని తెలియడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.


సభ్యులతో చర్చించే కేటాయింపు..
- శ్రీరామమూర్తి, జడ్పీ సీఈవో, ఉమ్మడి జిల్లా

గతేడాది పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఛైర్‌పర్సన్‌ చూస్తున్నారు. సభ్యులందరితో చర్చించాకే ఈ ఏడాది నిధులు కేటాయింపులు జరిగాయి. జడ్పీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.9.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో చేపట్టే పనుల విషయంలో ఆందోళన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని