logo

విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి వారి నుంచి సొమ్ము వసూలు చేసి మధ్యలోనే వదిలేయడంతో బాధితులు ఏజెంటు సంస్థ వద్ద సోమవారం ఆందోళన బాట పట్టారు.

Published : 28 Mar 2023 04:16 IST

యువకుల ఆందోళన

పరిశ్రమ ఎదుట నిరసన తెలుపుతున్న యువకులు

ఆటోనగర్‌, గాజువాక, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి వారి నుంచి సొమ్ము వసూలు చేసి మధ్యలోనే వదిలేయడంతో బాధితులు ఏజెంటు సంస్థ వద్ద సోమవారం ఆందోళన బాట పట్టారు. విశాఖ నగర పరిధిలోని గాజువాకకు చెందిన రాజాబాబు అనే లైసెన్స్‌డ్‌ ఏజెంట్‌ 6 నెలల క్రితం శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన సుమారు 72 మంది నిరుద్యోగ యువకులకు ముఖాముఖి నిర్వహించి ఆటోనగర్‌లోని ఓ వెల్డింగ్‌ పరిశ్రమలో శిక్షణ ఇప్పించారు. సౌదీలో రెండేళ్ల పాటు ఉద్యోగం కల్పిస్తామని దీనికోసం ముందుగా రూ.60 వేలు చెల్లించాలని చెప్పడంతో వారంతా నగదు చెల్లించి సౌదీ వెళ్లారు. 6 నెలల తర్వాత అక్కడ వీరి వీసా పునరుద్ధరించకపోవడంతో స్వదేశానికి వచ్చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసాను పునరుద్ధరించి రెండేళ్ల పాటు పని కల్పిస్తామని చెప్పి వీసా పునరుద్ధరించకుండా మోసం చేశారంటూ ఏజెంట్‌ను వారంతా ఇటీవల నిలదీయడంతో ఈనెల 20 తేదీ నాటికి రూ.30 వేలు చొప్పున నగదు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. గడువు ముగిసి 7 రోజులవుతున్నా ఏజెంట్‌ స్పందించక పోవడంతో సోమవారం బాధితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని గాజువాక శాంతి, భద్రతల ఎస్సై సతీష్‌ హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు. విదేశాలకు వెళ్లే ముందు పని, జీతం, వసతి తదితర ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో మాట్లాడుకుని వెళ్లాలని నిరుద్యోగ యువతకు ఎస్సై సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని