logo

నాకేమీ చెప్పకపోతే ఎలా?

గత రెండు నెలలుగా అధికారులు తనకు ఏ సమాచారం ఇవ్వడం లేదని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాలో మాకు సవాలక్ష సమస్యలు ఉంటాయి.

Published : 30 Mar 2023 04:33 IST

అధికారులపై ఛైర్‌పర్సన్‌ మండిపాటు

పరిహారంపై ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మికి లేఖ అందజేస్తున్న తెదేపా కౌన్సిలర్లు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: గత రెండు నెలలుగా అధికారులు తనకు ఏ సమాచారం ఇవ్వడం లేదని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాలో మాకు సవాలక్ష సమస్యలు ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్పాలి కదా! ఇళ్ల పన్నుల జీవోపై ఇప్పటివరకు చెప్పలేదు. అత్యవసర మున్సిపల్‌ సమావేశం అజెండా మంగళవారం సాయంత్రం ఇవ్వడం ఏమిటి ముందుగా ఇవ్వాలి కదా?’ అని మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించారు. రహదారి విస్తరణపై బుధవారం ఆమె అధ్యక్షతన సమావేశం జరిగింది. వంద అడుగుల మేర విస్తరించనున్న ప్రధాన రహదారిపై తయారు చేసిన అజెండాను చదివి వినిపించారు. దీనిపై జనం నుంచి వచ్చిన సలహా సూచనలు వాటికి సమాధానాలను వివరించారు. తెదేపా కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులకు తెదేపా కౌన్సిలర్లంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

తెదేపా, వైకాపా కౌన్సిలర్ల వాగ్వాదం

నష్ట పరిహారంగా టీడీఆర్‌ బాండ్లకు బదులు నగదు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చట్ట పరిధిలో దీనికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిపై కమిషనర్‌ కనకారావు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌కు లోబడి వంద అడుగుల విస్తరణ కొనసాగుతుందన్నారు. నగదు చెల్లింపునకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదన్నారు. దీంతో భవనాల యజమానులు నష్టపోతారని, బాండ్లు ఎందుకూ పనికిరావని తెదేపా కౌన్సిలర్లు మధు, శ్రీకాంత్‌ తదితరులు వాదించారు. దీనిపై వైకాపా సభ్యులు రామకృష్ణ, అప్పలనాయుడు, చినబాబు, నాని, బుల్లిదొరలు టీడీఆర్‌ విధానమే అమల్లో ఉందంటూ సమాధానం చెప్పడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఛైర్‌పర్సన్‌ ఇరువర్గాలనూ సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెదేపా సభ్యులంతా దీనిపై కమిషనర్‌, ఛైర్‌పర్సన్లకు లేఖలు అందజేశారు. జనసేన కౌన్సిలర్‌ అద్దెపల్లి సౌజన్య సైతం నగదు రూపంలోనే పరిహారం చెల్లించాలని కోరారు. మున్సిపాలిటీలో మహా శివరాత్రికి రూ.10 లక్షల సొమ్ము ఖర్చు చూపడం ఎంత వరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. 20వ వార్డు తెదేపా కౌన్సిలర్‌ రామరాజు పలు సమస్యలతో ఉన్న బ్యానర్‌ను తెచ్చి నిరసన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా గగ్గోలు పెడుతున్నా ఒక సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో సమావేశం కొనసాగుతుండగా బయట రోడ్డు విస్తరణ బాధితుల పేరిట వర్తకులు కొందరు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లతో ఉన్న ప్లకార్డులను సంప్రదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని