logo

అదీ.. నాయకత్వం!!

విశాఖకు ‘హుద్‌హుద్‌’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది.

Updated : 06 May 2024 05:19 IST

హుద్‌హుద్‌కు చిగురుటాకులా వణికిన విశాఖ
2014లో కకావికలమైన నగరం, భారీగా ఆస్తి నష్టం
నేనున్నానంటూ వేగంగా చేరుకున్న చంద్రబాబు
ఇక్కడే బస చేసి పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ
కొద్ది రోజుల్లోనే కోలుకున్న విశాఖ

నాడు.. ప్రజలతో మాట్లాడుతున్న చంద్రబాబు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే కంచరపాలెం, గోపాలపట్నం: విశాఖకు ‘హుద్‌హుద్‌’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది. తుపాను పేరెత్తితో వెంటనే గుర్తుకు వచ్చే హుద్‌హుద్‌ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రచండ గాలులు..కుండపోత వర్షంతో విద్యుత్తు, సమాచార వ్యవస్థలు నిమిషాల్లో కుప్పకూలాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోయాయి. బీచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది. బాహ్యప్రపంచంతో విశాఖకు సంబంధాలు తెగిపోయాయి. వేల నివాసాలు నేలమట్టం అయ్యాయి. ఆ ప్రళయ ఉద్ధృతికి ప్రతి ఒక్కరూ వణికిపోయారు.
భరోసా కల్పిస్తూ: విశాఖ తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు చంద్రబాబు కంటిమీద కునుకులేకుండా పనిచేశారు. అధికారులు, యంత్రాంగం సైతం ఆయనతో పరుగులు తీసి పనులు చేశారు. నెల రోజులకైనా విద్యుత్తు సరఫరా మెరుగుపడుతుందో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అయిదు రోజుల్లోనే నగరంలోని 70 శాతం ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించారు. నిత్యావసరాలు ప్రతి కుటుంబానికి అందేలా చూశారు. విమానాశ్రయాన్ని వాయువేగంతో పునరుద్ధరించారు. దెబ్బతిన్న కైలాసగిరిపై పచ్చదనం నింపే చర్యలు తీసుకున్నారు.

పునరుద్ధరణ చర్యలు పూర్తైన తరువాత ప్రజలతో కలిసి కాగడాల ర్యాలీలో..

 

తుపాను తీవ్రతను ప్రధాని మోదీకి వివరిస్తున్న చంద్రబాబు


నజీవనం అల్లకల్లోలమైన ఆ పరిస్థితుల్లో నేనున్నానంటూ కొన్ని గంటల వ్యవధిలోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. ప్రతిక్షణం పర్యవేక్షించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే తిరిగి వెళ్లారు.
దీ నాయకత్వం అంటే.. అదీ సమర్థతంటే.. అదీ పరిపాలన దక్షతంటే అని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. అలా నడిపించే నేతలకు, విశాఖను అభివృద్ధి శిఖరానికి తీసుకువెళ్లే వారికే మళ్లీ ఎన్నికల్లో పట్టం కట్టాలంటూ పలువురు పేర్కొంటున్నారు.

విద్యుత్తు వ్యవస్థ పునరుద్ధరణపై చర్చిస్తూ..


  • హుద్‌హుద్‌ విలయానికి నగరం నామరూపాల్లేకుండా పోయింది. అంతటా అంధకారం అలముకుంది. నాడు.. 2014 అక్టోబర్‌ 12వ తేదీ రాత్రికే హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఆకాశమార్గాన రావడానికి అవకాశం లేక రాజమహేంద్రవరం వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రావాలని చూశారు.
  • ఆ రోజు రాత్రి పరిస్థితులు అనుకూలించక 13వ తేదీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు. ప్రతి ప్రాంతంలో పర్యటించారు. కలెక్టరేటు వద్ద బస్సులోనే బస చేసి రాత్రింబవళ్లు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంటింటికీ తిరిగి బాధితులను పరామర్శించారు. సహాయక, పునరావాస చర్యలను దగ్గరుండి వేగవంతం చేశారు. రోజుకు 18 గంటల పాటు ప్రజలతోనే ఉన్నారు. ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సత్వర సాయం అందేలా చేశారు. ప్రధాని మోదీ సైతం ఇక్కడి పునరుద్ధరణచర్యలు, చంద్రబాబు చొరవను ప్రశంసించారు.
  • వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం కావడంతో నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఓ వైపు పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు నిత్యావసరాలను అందించే బాధ్యత అంతే వేగంగా చేపట్టారు. తక్కువ ధరకు పాలు, కూరగాయలు, ఉల్లిపాయలు వంటివి అందజేశారు. ఇంటింటికీ నిత్యావసరాలు అందేలాచంద్రబాబు ప్రణాళిక చేశారు.
  • విశాఖ నగరం అంటే హుద్‌హుద్‌కు ముందు..హుద్‌హుద్‌కు తర్వాత అన్న చందంగా మారిపోయింది. దీంతో విశాఖ నగర ప్రణాళిక కొత్త తరహాను సంతరించుకుంది. ప్రపంచ బ్యాంకు నిధులు అందిపుచ్చుకొని కొన్ని పనులకు శ్రీకారం చుట్టారు. భూగర్భ విద్యుత్తు కేబుల్‌ వ్యవస్థకు నాంది పలికారు. పచ్చదనం,  అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలోని అన్ని రహదారులను భారీగా విస్తరించి అభివృద్ధి చేశారు.

వైకాపా హయాంలో..

రెండేళ్ల కిందట భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆ సమయంలో ఆదుకునేందుకు యంత్రాంగం చేసిన జాప్యంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వైకాపా నేతలు సైతం చొరవ చూపలేదు. పునరావాస కేంద్రాల పేరిట సొమ్ములు నొక్కేసి అక్రమాలకు పాల్పడిన ఘటనలూ బయట పడ్డాయి. ఇదీ..వైకాపా పాలకుల తీరని జనం మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని