logo

మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి

‘యువత సైకిల్‌ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్‌ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Published : 07 May 2024 04:35 IST

టికెట్ల్లు దక్కని వారికి అండగా ఉంటా
ప్రజాగళంలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అనకాపల్లి, విశాఖపట్నం, న్యూస్‌టుడే అనకాపల్లి/పట్టణం, కశింకోట: ‘యువత సైకిల్‌ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్‌ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘మూడు పార్టీలు కలిశాక అన్ని స్థానాలను స్వీప్‌ చేస్తున్నాం. అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు.. భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని ప్రజలను అభ్యర్థించారు. ఉత్తరాంధ్రలో కూటమి వైపు ఊపు కనిపిస్తుందన్నారు. సోమవారం రాజుపాలెం వద్ద జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కూటమి అభ్యర్థులను ఎందుకు గెలిపించాలో వివరించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిచయం చేసి వారి బలాబలాలను తెలియజేస్తూ, వారు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతారో చెప్పారు. జగన్‌ మాత్రం సిద్ధం సభల్లో అభ్యర్థుల గురించి సౌమ్యుడు, మంచోడు అని చెప్పాడే గాని వారు ఏంచేస్తారో చెప్పలేకపోయారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు మాత్రం కూటమి అభ్యర్థులు ఏం చేస్తారో చెప్పి ప్రజల్లో నమ్మకం పెంచారు. 

చంద్రబాబు వారిని పరిచయం చేశారిలా...

  • అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు ఒక చరిత్ర ఉంది. 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. వైకాపా ఎంపీ అభ్యర్థికి అనుభవం లేదు. భాష రాదు. దిల్లీకి పోయి వీధులు వెతుక్కునేసరికి అయిదేళ్లు గడిచిపోతాయి. దిల్లీలోని గల్లీగల్లీ తెలిసిన వ్యక్తి రమేష్‌. అతన్ని గెలిపించండి. అతని వల్ల పెట్టుబడులు వస్తాయి. విజ్ఞానం ఉన్న వ్యక్తి, పరిచయాలు ఉన్నాయి. చొరవ తీసుకొని పనిచేస్తారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేరుగా మోదీ వద్దకు వెళ్లి పరిష్కరించే స్థాయి ఉంది. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలి.
  • పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు. గాజు గ్లాసు గుర్తు. ఏం తమ్ముళ్లూ ఎవరికైనా అనుమానం ఉందా? పెద్ద మెజార్టీ రావాలి.
  • విశాఖ ఉత్తరం భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు. అసెంబ్లీలో చూశా. అయిదేళ్లు మిత్రపక్షంలో ఉన్నా. ప్రజా సమస్యల మీద స్పష్టంగా మాట్లాడే వ్యక్తి. ఎవరినైనా అభిమానిస్తున్నానంటే అందులో విష్ణు ఉంటారు. అతన్ని మంచి మెజార్టీతో గెలిపించాలి. కూటమి పూర్తిగా అండగా ఉంటుంది.
  • విశాఖ పశ్చిమ తెదేపా అభ్యర్థి గణబాబు. తండ్రి నుంచి పార్టీకి సేవలందించిన కుటుంబం. సింపుల్‌గా ఉంటారు. ఆలోచన మాత్రం బలంగా ఉంటుంది. నేను ఒకటే కోరుతున్నా.. పశ్చిమలో మంచి మెజార్టీతో గెలిపించాలి.
  • తూర్పు తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ప్రజాసేవకుడు, ప్రజల మనిషి. ఎక్కడ అవసరం వచ్చినా పరిగెత్తుకు వెళ్లిపోతాడు. మూడుసార్లు గెలిచి నాలుగోసారి గెలవబోతున్నాడు. ఆయన్ని గెలిపించకపోతే ప్రజాసేవకు అర్థం లేదు. మీరిచ్చే బహుమానం పెద్ద మెజార్టీ.

అందరినీ గుర్తుంచుకుంటా: కూటమిలో అభ్యర్థుల ఎంపికలో కొందరికి టిక్కెట్లు దక్కలేదని, వారిని గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు.  సీనియర్‌ నాయకులు దాడి వీరభద్రరావు, ప్రగడ నాగేశ్వరరావు, చలపతిరావు, తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, పి.వి.జి.కుమార్‌, పైలా ప్రసాద్‌, రామానాయుడు, అప్పలనాయుడు వీరందరినీ గుర్తు పెట్టుకుంటా అని హామీ ఇచ్చారు.

  • విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ కూడా వైకాపా బాధితుడే. గీతం విశ్వవిద్యాలయం గోడలు పగలగొట్టారు. ఏమైనా పగలగొట్టండి.. ఎందులోనూ రాజీపడనంటూ ముందుకు దూసుకువెళ్లారు. ఇతడిని అభినందిస్తున్నా. మీ ఆశీస్సుల కోసం సైకిల్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.  
  • భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. తప్పకుండా గెలిపించి మీరంతా ఆశీర్వదించాలి. భీమిలి తెదేపాకు కంచుకోట. అఖండ మెజార్టీతో గెలిపించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని