logo

ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల

ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

Published : 07 May 2024 04:41 IST

పోస్టల్‌ బ్యాలట్లకు తాయిలాల ఎర
పోలింగ్‌ కేంద్రం బయటే బేరసారాలు

ఏయూ రోడ్డులోని బస్‌స్టాప్‌ వద్ద ప్రలోభాలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వరుసగా రెండో రోజు ఓట్ల కొనుగోలుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఉద్యోగుల ఇళ్లకే వెళ్లి కొంత మంది బేరసారాలు పెడితే.. పోలింగ్‌ కేంద్రం ఆవల మరి కొందరు బేరాలకు దిగారు. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాల ఆవరణలో ఆదివారం నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ఆరంభమైంది. రెండో రోజు సోమవారం భారీ సంఖ్యలో ఓటు వేసేందుకు ఉద్యోగులు తరలివచ్చారు. సాయంత్రం 6గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5గంటల సమయానికి మిగిలి ఉన్న వారికి టోకెన్లు అందజేసి ఓటింగ్‌ కొనసాగించారు. మంగళ, బుధవారాల్లో కూడా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ కొనసాగనున్నది.

ఒక్కో ఓటుకు రూ.2500 వరకు..

వైకాపా ప్రభుత్వానికి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉండడం ఆ పార్టీ నాయకులను కలవరపరుస్తోంది. ఎలాగైనా వారి ఓట్లను పొందడానికి పెద్దఎత్తున ప్రలోభాలకు తెర తీశారు. ఉత్తరం, తూర్పు, దక్షిణం, గాజువాక, పశ్చిమ, భీమిలి నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఏయూ అవుట్‌ గేట్‌ బయట మోహరించారు. ఉద్యోగులతో అక్కడికక్కడే బేరసారాలు సాగించారు. ఓటుకు రూ.1500 నుంచి రూ.2500 వరకు ముట్టజెప్పడానికి సిద్ధమయ్యారు. అయితే అధిక శాతం తాయిలాలు తీసుకోవడానికి నిరాకరించారు. డబ్బులు తీసుకున్న వారి పేర్లు, ఫోన్‌ నెంబరు, ఇతర వివరాలను నాయకులు నమోదు చేసుకున్నారు. అధికార పార్టీ ఎత్తుగడలను పసిగట్టిన తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని ప్రలోభాలకు లొంగవద్దని ఉద్యోగులకు మేలు చేసే వారికే ఓటేయాలని కోరారు. ఏయూ అవుట్‌గేట్‌ వద్ద ఆదివారం వైకాపా నాయకులు ప్రచార వాహనాలతో హడావుడి చేయగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో సోమవారం కనిపించలేదు.

ఓటు కోసం వెతుకులాట

పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్న పలువురు ఉద్యోగులకు ఓటు లేదని హెల్ప్‌డెస్క్‌ సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందారు. వెంటనే పోలింగ్‌ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పలుమార్లు దరఖాస్తు చేసినా ఓటరు జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళనకు దిగారు. వారికి అధికారులు సర్దిచెప్పి మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. ఎక్కువగా సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది  వీరికి ఈనెల 8న ఓటు హక్కు కల్పించనున్నారు. ఏయూ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ ఏడీసీ కేఎస్‌ విశ్వనాథన్‌, జేసీ మయూర్‌ అశోక్‌, తదితరులు సందర్శించారు.

ఓట్ల వివరాలను తెలుసుకుంటూ.

మందకొడిగా పోలింగ్‌ ప్రక్రియ

సోమవారం మండుటెండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలివచ్చారు. షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ ఉక్కబోతకు తాళలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో పోలింగ్‌ మందకొడిగా సాగింది. ఓటు వేయడానికి నాలుగైదు నిమిషాల సమయం పట్టింది. దీంతో ఉద్యోగులు బారులు తీరి నిలబడ్డారు. కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసినప్పటికీ సరిపోకపోవడంతో పలువురు అధిక సమయం నిరీక్షించి నీరసించిపోయారు.

ఓటేయడానికి నిరీక్షణ

ఓటు హక్కు వినియోగం ఇలా..

పీఓ, ఏపీఓ, ఓపీఓ, పోలీసు, ఇతర ఉద్యోగులు: 13,076
ఆది, సోమవారాల్లో ఓటేసిన వారు: 8,974 (68.62శాతం)
ఇతర జిల్లాల ఉద్యోగులు: 5,389
ఆది, సోమవారాల్లో ఓటేసిన వారు: 3,044 (56.48శాతం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని