logo

ప్రతిపక్షం కంట్లో అధి‘కారం’!!

వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. మరి.. అయిదేళ్లు ఏం చేసిందనేది పరిశీలిస్తే.. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం, విపక్ష నేతల ఆస్తులను ధ్వంసం చేయడం.

Updated : 09 May 2024 05:03 IST

నగరంలో ఐదేళ్లూ రాజకీయ కక్షలే
విపక్ష నేతల ఆస్తులు ధ్వంసం
వైకాపా పాలన తీరుతో జనం బెంబేలు
ఈనాడు-విశాఖపట్నం

వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. మరి.. అయిదేళ్లు ఏం చేసిందనేది పరిశీలిస్తే.. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం, విపక్ష నేతల ఆస్తులను ధ్వంసం చేయడం. అవసరమైతే వేధింపులకు పాల్పడటం. ఓ ఎన్‌ఆర్‌ఐ ఆస్తిని లాక్కొనేందుకు ఏకంగా తుపాకీతో బెదిరింపులకు దిగారు. శాంతియుత నిరసనలపైనా ఉక్కుపాదం మోపారు. తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను అడుగడుగునా అడ్డుకుని వైకాపా పెద్దలు పైశాచిక ఆనందం పొందారు.

అర్ధరాత్రుళ్లు పోలీసు బలగాల నడుమ...

  • వైకాపాలోకి రావాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై గతంలో ఒత్తిళ్లు తెచ్చారు. సున్నితంగా తిరస్కరించడంతో కక్షగట్టారు. గాజువాకలో అన్ని అనుమతులతో షాపింగ్‌ కాంప్లెక్సును నిర్మించుకుంటుండగా.. నిబంధనల ఉల్లంఘన అంటూ 2021 ఏప్రిల్‌లో కొంత భాగం కూలగొట్టారు. భవనానికి మూడు స్లాబులు వేసిన తర్వాత ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒక రోజు తెల్లవారుజామున 200 మంది పోలీసులతో జీవీఎంసీ సిబ్బంది జేసీబీలతో నిర్మాణాలు కూల్చేశారు.
  • తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌ గీతం వర్సిటీపైనా పదేపదే దాడులకు దిగారు. ఆ సంస్థ తెదేపా నేతలది కావడం, చంద్రబాబు కుటుంబంతో బంధుత్వం ఉండటమే ఇందుకు కారణం. విస్తరణలో భాగంగా ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కావాలంటూ తెదేపా హయాంలో గీతం వర్సిటీ దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ ధర చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. అయినా వైకాపా అధికారంలోకి వచ్చాక స్థలం ఇవ్వకుండా, అందులో నిర్మించిన ప్రహరీని ఐదేళ్లలో మూడు సార్లు అర్ధరాత్రి వేళ పోలీసులతో వెళ్లి కూలగొట్టి నానా రభస చేశారు.


మాజీ ఎంపీ,  విశాఖ మాజీ మేయర్‌ సబ్బం హరి గత ఎన్నికల్లో తెదేపా తరఫున భీమిలి నుంచి పోటీ చేశారు. నిత్యం టీవీ చర్చల్లో వైకాపా పాలన తీరును, జగన్‌ను విమర్శించారు. దీంతో సీతమ్మధారలోని ఆయన ఇంటి పక్కన నాలుగు అడుగులు పార్కు స్థలంలో ప్రహరీ నిర్మించారంటూ 2020 అక్టోబర్‌లో తెల్లవారుజామున 3 గంటలకు ప్రహరీని కూల్చేశారు.


సామాజిక మాధ్యమాల్లోనూ స్వేచ్ఛ లేకుండా...: మాజీ మంత్రి గంటా స్నేహితుడు నలంద కిశోర్‌.. జగన్‌ పరిపాలనకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు షేర్‌ చేశారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. అరెస్టు చేసి విజయవాడ, అక్కడి నుంచి కర్నూలుకు విచారణ పేరుతో తీసుకెళ్లారు. కొవిడ్‌ సమయంలో ఇలా తిప్పడంతో వైరస్‌ బారిన పడి ఆయన మృతి చెందారు. కేవలం ప్రభుత్వ వేధింపులతోనే నిండు ప్రాణం బలిగొన్నారన్న విమర్శలున్నాయి.

జగన్‌ ఉత్తరాంధ్ర పర్యటనంటే అరెస్టులే!: శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు చేసినా మహిళలని చూడకుండా ఈడ్చి పడేయడమే జగన్‌ పాలనలో ఆనవాయితీగా మారింది. ఓసారి విమానాశ్రయానికి పవన్‌ కల్యాణ్‌ రాగా, అదే సమయంలో వైకాపా మంత్రులు ఎదురుపడగా వారి వాహనాలపై దాడి జరిగిందన్న నెపంతో  86 మందిపై అక్రమ కేసులుపెట్టారు. 9 మంది జనసేన నాయకులను జైలుకు పంపారు. రుషికొండపై నిర్మాణాలను సందర్శించారని మూర్తియాదవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు వేశారు. జగన్‌ విశాఖ పర్యటనలంటే ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు సర్వసాధారణంగా మారిపోయాయి. విజయనగరం, శ్రీకాకుళం పర్యటనల సమయంలో జగన్‌ ట్రాన్సిట్‌ హాల్ట్‌ నేపథ్యంలోనూ ముందస్తు అరెస్టు చేశారు.


విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి నిందితుడు శ్రీను పని చేసిన రెస్టారెంట్‌ తెదేపా సానుభూతిపరుడైన వ్యక్తిదని కక్షగట్టారు. వైకాపా అధికారంలోకి రాగానే.. వీఎంఆర్డీఏ నుంచి సిరిపురంలో లీజుకు తీసుకున్న స్థలంలో నిర్వహిస్తున్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ను రాత్రికిరాత్రి ఖాళీ చేయించారు. 50 మంది సిబ్బంది, పోలీసుల సమక్షంలో సామగ్రిని లారీల్లోకి ఎక్కించి గేటుకు నోటీసులంటించారు. అయితే సదరు వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దాన్ని వెనక్కి ఇవ్వాలన్న తీర్పు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని