logo

మీరే చెప్పండి ఎలా బతకాలో!

‘అయ్యా.. మేమంతా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌ (సఖి)లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులం.

Published : 29 Nov 2022 03:32 IST

కలెక్టరేట్‌ వద్ద ఎంపీని కలిసిన ఒప్పంద ఉద్యోగులు

ఎంపీకి వినతిపత్రం అందిస్తున్న సఖి సిబ్బంది

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘అయ్యా.. మేమంతా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌ (సఖి)లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులం. మహిళల సమస్యలపై 24 గంటలూ సేవలందిస్తున్నాం. మాకు జీతాలొచ్చి 14 నెలలైంది. చాలీచాలని వేతనాలైనా ప్రభుత్వ ఉద్యోగమన్న ఆశతో పనిచేస్తున్నాం. మీరైనా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సక్రమంగా జీతాలొచ్చేలా చూడాలని’ ఉద్యోగులు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు. 


న్యాయం చేయరూ...!

చెరువును రక్షించాలని కోరుతున్న జొన్నాడ ప్రాంత రైతులు

‘డెంకాడ మండలం జొన్నాడ వద్ద రహదారిని ఆనుకుని లింగడబంద ఉంది. ఈ చెరువు నీటిని ఆధారం చేసుకుని తాత, తండ్రుల నుంచి దిగువన వ్యవసాయ భూములను సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వ రికార్డుల్లోనూ గతంలో చెరువుగానే నమోదై ఉంది. కానీ.. ఇప్పుడు కొందరు ఈ నీటిని మళ్లించి, ఆ ప్రాంతాన్ని వ్యవసాయ భూమిగా మార్చి వాళ్లదని చెబుతూ రెవెన్యూ రికార్డుల్లోనూ మార్చేశారు. మండలాధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదు. మీరైనా న్యాయం చేయండ’ని జొన్నాడకు చెందిన పలువురు రైతులు, మహిళలు ‘స్పందన’లో విజ్ఞప్తి చేశారు.


‘స్పందన’కు 157 వినతులు

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘స్పందన’కు 157 వినతులు అందాయి. అర్జీదారుల నుంచి కలెక్టర్‌ ఎ.సూర్యకుమారితో పాటు, సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డీఆర్వో గణపతిరావు, ఉప కలెక్టర్లు సుదర్శనదొర, సూర్యనారాయణ తదితరులు వినతులు స్వీకరించారు.


తాళిబొట్టు అమ్మి పునాదులేశా 

‘2009లో సోనియానగర్‌ వద్ద ఇంటి పట్టా ఇచ్చారు. అప్పట్లో ఇల్లు కట్టాలని చెబితే తాళిబొట్టు అమ్మి, కొంత నిర్మించాం. ఇప్పుడు అదే ప్రాంతంలో టిడ్కో ఇళ్లు ఉన్నాయంటున్నారు. నా  గురించి అడిగితే.. సమాధానం ఇవ్వడం లేదు.’ అని నగరానికి చెందిన కటారి రూపాదేవి వాపోయారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని వేడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని