logo

పనికో రేటు.. అదే రూటు

విజయనగరం నగరపాలక సంస్థగా ఎదిగిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన సేవల మాటెలా ఉన్నా.. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారని, సంస్థను కీలక ప్రజాప్రతినిధి తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. అధికారులను కీలుబొమ్మలుగా మార్చారని..

Published : 28 Mar 2024 04:47 IST

ఇదీ పట్టణ ప్రణాళికా విభాగం తీరు
ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే-విజయనగరం పట్టణం

విజయనగరం నగర పాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగం

విజయనగరం నగరపాలక సంస్థగా ఎదిగిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన సేవల మాటెలా ఉన్నా.. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారని, సంస్థను కీలక ప్రజాప్రతినిధి తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. అధికారులను కీలుబొమ్మలుగా మార్చారని.. ఏ చిన్న పనికైనా అక్కడ నుంచి అనుమతి తప్పనిసరి అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో ఏ నిర్మాణాకైనా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ఇక్కడి నుంచి బదిలీలు, పదోన్నతులపై వెళ్లిన వారి స్థానాలను భర్తీ చేయలేదు. ప్రస్తుతం వార్డు సచివాలయాలు, ఇతర విభాగాల్లోని ఉద్యోగులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన టీపీవో సహా నాలుగు టీపీబీఓ పోస్టులు ఖాళీ. ఇద్దరు టీపీఎస్‌లకు ఒకరే ఉన్నారు. గతంలో నలుగురు ఛైన్‌మెన్లు డివిజన్లను పర్యవేక్షించేవారు. ఇప్పుడు వారిని కార్యాలయానికే పరిమితం చేశారు. వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు నిర్మాణాల్లో ఉల్లంఘనలు పరిశీలిస్తున్నారు. ప్లాన్ల మంజూరు సచివాలయాల ద్వారా లైసెన్సు సర్వేయర్లతో చేయిస్తున్నారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలించాలి. అనుమతి లేని వాటిని గుర్తించి యజమానులకు నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత ఛార్జిషీటు దాఖలు చేసి కోర్టు ద్వారా అపరాధ రుసుము వసూలు చేయాలి. ఎక్కడా వీటి ఊసే లేదు. గతేడాది జనవరి నాటికి 1,100 నిర్మాణాల్లో ఉల్లంఘనలు గుర్తించినా ఒక్క ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంపై అప్పటి మున్సిపల్‌ ఆర్జేడీ మీనాకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు.

చూసీచూడనట్లు..

నగరంలో నిబంధనలు పాటించకుండా వాణిజ్య కేటగిరి భవనాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ, పురపాలక స్థలాలు, గెడ్డలు ఆక్రమించుకుంటున్నారు. ఈ ఆక్రమణల వెనుక పెద్దల అండ ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా వారు జేబులు నింపుకొంటున్నారు. ఇద్దరు సహాయక సిటీ ప్లానర్లు ఉద్యోగోన్నతి ప్రయత్నాల్లో తరచూ సెలవులు పెట్టడంతో కింది స్థాయి ఉద్యోగి ఒకరు అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. మరో ఇద్దరు అధికారుల్లో ఒకరిని భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు పరిశీలనకు దూరం పెట్టారు.

భవన నిర్మాణాల్లో అన్నీ సక్రమంగా ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయాలి. వాణిజ్య భవనాల విషయంలో అలా జరగడం లేదు. నివాస గృహాలకు కనీసం 30 అడుగులు, వాణిజ్య భవనాలకు 40 అడుగుల రహదారి తప్పనిసరి. వెయ్యి చదరపు మీటర్ల వరకు నగర పాలక సంస్థ అనుమతిస్తోంది. ఆ తర్వాత వీఎంఆర్‌డీఏ అనుమతి తప్పనిసరి.

నిబంధనలు పాటించని వాటి వివరాలు

  • 2020 అక్టోబరు తర్వాత ఉల్లంఘన నిర్మాణాలు    : 554
  • ఛార్జిషీట్‌కు ఎంఎస్‌సీ వద్ద పెండింగ్‌లో ఉన్నవి     : 120
  • గతేడాది మంజూరైన ప్లాన్లు                 : 650
  • ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మంజూరు : 121

నిరంతర పర్యవేక్షణ

నగరంలో జరుగుతున్న నిర్మాణాలపై ప్లానింగ్‌ కార్యదర్శులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఆదేశించాం. వివిధ నిర్మాణాలకు సంబంధించి ప్లాన్‌ మంజూరైనదీ, లేనిదీ మూడో పార్టీ తెలుసుకునే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. నగర పరిధిలో ఆక్రమణలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

ఎం.మల్లయ్యనాయుడు, కమిషనరు, నగర పాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని