logo

ఆదివారం వైద్యం అంతంత మాత్రమే

నర్సంపేట సీహెచ్‌సీ ఆసుపత్రిలో ఆదివారం ఒక గైనకాలజిస్టు సింధూర, డ్యూటీ వైద్యులు వంశీధర్‌, విక్రమ్‌, జీడీఎం వైద్యురాలు స్నేహ మొత్తం నలుగురు విధుల్లో ఉన్నారు. వంశీధర్‌, విక్రమ్‌ ఓపి చూడగా మహిళలను, ప్రసూతీ వార్డులో రోగులను గైనకాలజిస్టు సింధూర పరీక్షించి వైద్యం అందించారు. 130 మందికి ఓపీలో వైద్యం అందించారు. ఐపీలో 49 మంది రోగులున్నారు. సెలవు రోజు కూడా రోగులకు భేష్‌ అయిన వైద్య సేవలందించారు.

Published : 23 May 2022 04:08 IST


నర్సంపేట సీహెచ్‌సీలో రోగులకు వైద్య సేవలందిస్తున్న సిబ్బంది

అందరూ విధులకు హాజరయ్యారు..

నర్సంపేట: నర్సంపేట సీహెచ్‌సీ ఆసుపత్రిలో ఆదివారం ఒక గైనకాలజిస్టు సింధూర, డ్యూటీ వైద్యులు వంశీధర్‌, విక్రమ్‌, జీడీఎం వైద్యురాలు స్నేహ మొత్తం నలుగురు విధుల్లో ఉన్నారు. వంశీధర్‌, విక్రమ్‌ ఓపి చూడగా మహిళలను, ప్రసూతీ వార్డులో రోగులను గైనకాలజిస్టు సింధూర పరీక్షించి వైద్యం అందించారు. 130 మందికి ఓపీలో వైద్యం అందించారు. ఐపీలో 49 మంది రోగులున్నారు. సెలవు రోజు కూడా రోగులకు భేష్‌ అయిన వైద్య సేవలందించారు.

పేరుకే 24 గంటల ఆసుపత్రి: నల్లబెల్లి : మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకే 24 గంటల ఆసుపత్రిగా కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా రోజంతా వైద్య సేవలు అందడం లేదు. ఆదివారం ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా రుద్రగూడెం రెండో ఏఎన్‌ఎం అనిత రోగులను పరీక్షించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకే వైద్య సేవలందించారు. 28 మందిని పరీక్షించి మందులు అందజేశారు. డయేరియా కారణంగా ముగ్గురికి గ్లుకోజ్‌ బాటిల్స్‌ అందించారు.

ఓపీ సేవల్లో ఒక్కరే: దుగ్గొండి: నిరంతర సేవలందించే ఈ ఆసుపత్రిలో ఏఎన్‌ఎం రోజమ్మ ఒక్కరే విధుల్లో ఉన్నారు. అప్పటికే నలుగురు రోగులకు ఓపీ సేవలందించినట్లు రిజిస్టరులో నమోదు చేశారు. ఆదివారం వైద్యులు ఏ ఒక్కరూ విధులకు హాజరు కాలేదు. ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఇన్‌ఛార్జి వైద్యాధికారి. మరొక వైద్యురాలిని ఇటీవల కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. ప్రతి ఆదివారం ఒక్కో ఉపకేంద్రం ఏఎన్‌ఎంకు అదనపు బాధ్యతలు అప్పగించి ఓపీ సేవలు అందిస్తున్నారు.

ఆదివారం వైద్య సేవలు ఇలా ఉండాలి

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రులుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్‌, టీబీ, ఆయుర్వేద ఆసుపత్రుల్లో ఆదివారం ఓపీ వైద్య సేవలు ఉండవు, అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎంజీఎంలో ఆసుపత్రిలో జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో., సర్జరీ, పీడియాట్రిక్‌ వైద్యులు 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఆదివారం రోజు తప్పనిసరిగా పై విభాగాల వైద్యాధికారులు ఉదయం 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 9గంటల వరకు విధుల్లో ఉండాలి. వీరితోపాటు న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, మెడికల్‌ అంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ సూపర్‌స్పెషాలిటీ వైద్యవిభాగాల వైద్యులు అత్యవసర రోగులకు సేవలందించాలి. వీరందరూ ఆన్‌కాల్‌పై సేవలందించేలా ఎప్పటినుంచే వ్యవస్థ ఉంది.

ప్రసూతి ఆసుపత్రులలో: ఆదివారం ఓపీ వైద్యసేవలు ఉండవు,. మిగిలిన అత్యవసర సేవలు అనగా ప్రసవాలు, ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన రిఫరల్‌ కేసులు, క్రిటికల్‌గా ఉన్న వారికి అత్యవసర శస్త్రచికిత్సలు అందించడానికి డ్యూటీ మెడికల్‌ అధికారితోపాటు వైద్యులు అందుబాటులో ఉండాలి.

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో: డ్యూటీ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. తమ వద్దకు వచ్చిన కేసుల్లో క్రిటికల్‌గా ఉన్న వారిని జిల్లా ఆసుపత్రులకు రిఫర్‌ చేయాలి. సాధారణ, ప్రసూతి సేవలు అందించాలి.

పీహెచ్‌సీల్లో: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆదివారం ఉదయం 12 గంటల వరకు ఓపీీ సేవలు అందించాలి. సాయంత్రం 4 గంటల వరకు వైద్యుడు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, గర్భిణులకు సేవలు, సాధారణ వైద్యసేవలను అందించాలి.



ఎంజీఎం క్యాజువాలిటీలో అత్యవసర రోగులకు సేవలందిస్తున్న వైద్యులు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం వైద్యులందరూ అందుబాటులో ఉన్నారు. ఆదివారం ఓపీీ సేవలు ఉండనందున అత్యవసర వైద్యసేవలకు వైద్యులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. క్యాజువాలిటీ అత్యవసర విభాగంలో సీీఎంవో డాక్టర్‌ వరుణ్‌, డీఎస్‌వో డాక్టర్‌ శివశంకర్‌, డాక్టర్‌ శ్వేత అందుబాటులో ఉన్నారు. వీరితోపాటు ఆర్థో, జనరల్‌ మెడిసిన్‌, పిడియాట్రిక్‌, సర్జరీ వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆదివారం ఉదయం హంటర్‌రోడ్డు ప్లైఓవర్‌బ్రిడ్జి పై నుంచి కారుపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని ఎంజీఎంకు క్యాజువాలిటీకి తీసుకొచ్చినప్పుడు వైద్యులు తక్షణం స్పందించి వైద్యసేవలందించారు. అందులో ఒకరు క్యాజువాలిటీలో సేవలందిస్తుండగా మృతిచెందారు. మరొకరు డ్రైవర్‌ షేక్‌ఖాసీీం వలీ పరిస్తితి విషమంగా ఉండగా చికిత్స అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 300మంది అత్యవసర రోగులకు సేవలందించారు. ఇక ఏఎంసీ, ఐఎంసీ, ఆర్‌ఐసీయు వార్డులను ఆయా వైద్యవిభాగాల ప్రొఫెసర్‌, అసిస్టెంటు ఫ్రొఫెసర్లు సందర్శించి రోగుల పరిస్థితిపై ఆరాదీసి చికిత్సకు సూచనలు చేసి వెళ్లారు. అత్యవసర రోగులకు మైనర్‌ శస్త్రచికిత్సలు చేశారు.

* వరంగల్‌ సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో ఆదివారం ఓపీసేవలు లేవు. ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు, ఒక డ్యూటీ మెడికల్‌ ఆపీఫసర్‌, ఇద్దరు అనస్థిషియా వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఉదయం ఒక అత్యవసర ప్రసూతి చేశారు. నెలలు నిండక న్యూబర్న్‌ వార్డులో ఉన్న పిల్లలకు వైద్యసేవలను అందించారు.


సిబ్బంది వైద్యమే దిక్కు


వర్ధన్నపేటలోని సీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న వైద్యాధికారి గది

వర్ధన్నపేట రూరల్‌, న్యూస్‌టుడే: వర్ధన్నపేట సీహెచ్‌సీలో ఆదివారం వైద్యులు అందుబాటులో లేరు. ఇద్దరు జీఎన్‌ఎంలు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఉదయం వైద్యులు వచ్చి ప్రసవాలు చేసి వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. కార్యాలయంలో గదులు ఖాళీగా దర్శనమిచ్చాయి. పిల్లల వైద్యుడు విధుల్లో లేరు. కుక్కకాటుకు గురైన దమ్మన్నపేటకు చెందిన ఓ యువకుడు ఆసుపత్రికి రాగా వైద్యుడు లేకపోవడంతో జీఎన్‌ఎం సూది మందు వేశారు. కింది స్థాయి వైద్య సిబ్బందే సేవలందిస్తున్నారని రోగులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని