logo

త్వరలో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు

ప్రభుత్వ ప్రాధాన్య, ప్రతిష్ఠాత్మక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పంచాయతీ విభాగం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సమాయత్తమవుతోందని జనగామ డీపీవో కండ్లకుంట రంగాచారి పేర్కొన్నారు. పల్లెలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు

Published : 24 May 2022 04:01 IST

జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి

జనగామ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రాధాన్య, ప్రతిష్ఠాత్మక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పంచాయతీ విభాగం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సమాయత్తమవుతోందని జనగామ డీపీవో కండ్లకుంట రంగాచారి పేర్కొన్నారు. పల్లెలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమంలో వివిధ అంశాలపై ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన ఏమంటున్నారంటే..
గత పల్లె ప్రగతిలో సాధించిన ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి.
పారిశుద్ధ్యం, మొక్కల పెంపకంలో చెప్పదగిన అభివృద్ధి కనిపిస్తోంది. ఈ రెండు అంశాలలో ప్రగతి సాధించేందుకు ట్రాక్టర్లు, ట్యాంకర్ల పాత్ర ప్రముఖంగా ఉంది. ఉపాధి హామీ నిధులతో మొక్కలు, వృక్షాల సంరక్షణకు అవకాశం ఏర్పడింది.
పన్నుల వసూళ్లు ఎలా ఉన్నాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం జిల్లాలో వంద శాతం పన్నుల వసూలు జరిగింది. సుమారు రూ.6.5 కోట్లు వసూలయ్యాయి. అసెస్‌మెంటు కాని ఇళ్లను గుర్తించి పన్ను మదింపు చేయాలని ఆదేశించాం.
జనాభా తక్కువ ఉన్న చిన్న పంచాయతీలకు నిధుల కొరత అంశం వేధిస్తోంది. కదా.
ఉపాధి హామీ పథకం నిధులను వివిధ పనులకు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. పంచాయతీ పరిధిలోని వనరులను ఆదాయ మార్గంగా మార్చుకుంటే కొంత భారం తప్పుతుంది.
అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల సంగతేంటి? టీఎస్‌ బీపాస్‌ అమలుకు చర్యలు చేపట్టారా.
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించవద్దని ఆదేశాలున్నాయి. క్రమబద్ధీకరణ అంశం పరిధిలో లేని అక్రమ లే ఔట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. టీఎస్‌బీపాస్‌ అమలుకు మార్గదర్శకాలు రాలేదు.
జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు ఏం ఏర్పాట్లు జరిగాయి.
ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటమే తరువాయి. నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఎన్నికలు జరగాల్సిన చోట వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రకటించాం. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. రాజకీయ పార్టీలతో మండల, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించడం పూర్తయ్యింది.
ఉప ఎన్నికలు జరిగే చోట ఓటర్ల నమోదుకు అవకాశాలున్నాయా.
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ. ఎన్నికలు జరిగే జీపీల పరిధిలోనూ ఎన్నికల ప్రకటన వెలువడే వరకు జరుగుతుంది. ఇది సంబంధిత ఈఆర్వో పరిధిలో చేసుకోవాల్సి ఉంటుంది.
న్యూస్‌టుడే : పల్లెప్రగతి కార్యక్రమంలో ఈ దఫా ప్రధాన అంశం ఏమిటి?
డీపీవో: గ్రామాలను తీర్చిదిద్దేందుకు జూన్‌ 3న పల్లె ప్రగతి కార్యక్రమం జరపాలని ప్రభుత్వం నిర్దేశించింది. హరితహారం, సమగ్ర పారిశుధ్య విధానం అమలు తదితర అంశాలతోపాటు, ఈ దఫా క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ముఖ్య అంశంగా ఉండనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
గ్రామాల్లో నిధుల కొరత ఉందని, గతంలో చేసిన పనులకే బిల్లులు రాలేదనే విమర్శలున్నాయి. కదా ఎలా ముందుకెళ్తారు.
పంచాయతీలకు నెల వారీగా అందాల్సిన నిధులు మంజూరవుతున్నాయి. ట్రెజరీలో ఆయా జీపీలకు సంబంధించి నిధులున్నా, మంజూరు కావడంలేదనే విషయం గురించి ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే పెండింగు బిల్లులు క్లియర్‌ అవుతాయి. ఈ కార్యక్రమానికి నిధుల అంశం ఆటంకం కాబోదు.
జిల్లాలో కార్యదర్శులు తక్కువ మంది ఉన్నారని ఆరోపణలున్నాయి. ఏమంటారు.
అదేం లేదు. అవసరమైన చోట ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు జరిగాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో కొందరు సెలవుపై వెళ్లారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.
ఎల్‌ఈడీల అంశం ఎందాకా వచ్చింది.
50 జీపీలకు పైన ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి. ఈఈఎస్‌ఎల్‌ ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణపై సర్పంచులకు అనుమానాలు, సందేహాలున్నాయి. నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏర్పడిన ఖాళీలను పూరిస్తారా.
ఇటీవల జనగామ మండలం శామీర్‌పేట సర్పంచి మృతి చెందారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించాం. కానీ ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటి ప్రక్రియ అంతా నిబంధనలు, గడువు మేరకు జరపాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని