logo

ఆరోగ్యమస్తు..!

జిల్లా వాసులకు ఇక నుంచి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందనున్నాయి. జిల్లా (100 పడకల) ఆసుపత్రిలో దసరా నుంచి సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకు సాధారణ ఓపీ, ఇన్‌పేషెంట్లకు మాత్రమే వైద్య సదుపాయాలు ఉండేవి. పండగ రోజున ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ పడకలను ప్రారంభించనున్నారు.

Published : 03 Oct 2022 01:54 IST

జిల్లా ఆసుపత్రిలో దసరా నుంచి మరిన్ని సేవలు

జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లా వాసులకు ఇక నుంచి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందనున్నాయి. జిల్లా (100 పడకల) ఆసుపత్రిలో దసరా నుంచి సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకు సాధారణ ఓపీ, ఇన్‌పేషెంట్లకు మాత్రమే వైద్య సదుపాయాలు ఉండేవి. పండగ రోజున ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ పడకలను ప్రారంభించనున్నారు. దీంతో పలు చికిత్సల కోసం వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌, తదితర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పనుంది.

ఆరోగ్యశ్రీ...
ఆసుపత్రిలో నెల రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎముకలు విరిగితే పీఓపీ, ఇతర వైద్య సేవలు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా అందేవి. ఇక నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా పెరగనున్నాయి. ఎన్‌సీడీ క్లినిక్‌ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. అలాగే వైద్య కళాశాల నిమిత్తం ఆసుపత్రి పైన మరో అంతస్తు నిర్మించనున్నారు.

నూతన ఐసీయూ

3 ఆపరేషన్‌ థియేటర్లు, 10 ఐసీయూ పడకలు..
జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం మాతాశిశు కేంద్రంతో పాటు సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. సౌకర్యాలున్నా వైద్యులు లేక శస్త్రచికిత్సలు, ఇతర సేవలు అందేవి కావు. ఇటీవల నూతనంగా ప్రత్యేక వైద్యనిపుణులను నియమించడంతో ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లను సిద్ధం చేస్తున్నారు. సాధారణ, ఆర్థో, ఇన్‌ఫెక్టెడ్‌ శస్త్రచికిత్సల వైద్యసేవల నిమిత్తం వీటిని వినియోగించనున్నారు. వీటితో పాటు ఇతర చికిత్సల కోసం కూడా ఇవి సిద్ధంగా ఉంటాయి..

10 ఐసీయూ పడకలను దసరా రోజు ప్రారంభించనున్నారు. అత్యవసర, మెరుగైన వైద్యం అందాలంటే తప్పకుండా ఆక్సిజన్‌, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ అవసరం. కొవిడ్‌ సమయంలో ఓ ఎన్‌ఆర్‌ఐ ఐసీయూ కేంద్రానికి అవసరయమ్యే పరికరాలను అందించారు. దీంతో వాటిని సిద్ధం చేసి వినియోగించనున్నారు.

పెరిగిన ఓపీ
నూతన వైద్యులు రావడంతో ఓపీ పెరిగింది. ఇది వరకు 20 మంది లోపే వచ్చేవారు. ప్రస్తుతం రోజూ 150 మందికి పైగా రోగులు వస్తున్నారు. అలాగే 50 మంది వరకు ఆసుపత్రిలో చేరుతున్నారు. జులై నెలలో 6 శాతం ఉన్న ఓపీ ఇప్పుడు 40 శాతానికి పెరిగింది. వచ్చే రెండు నెలల్లో మరింత పెంచుతామని వైద్యులు చెబుతున్నారు.

23 మంది స్పెషలిస్టు వైద్యులు..
ఇప్పటికే నలుగురు వైద్య నిపుణులున్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో పీజీ వైద్యవిద్య పూర్తి చేసుకున్న 23 మంది ఎస్‌ఆర్‌ (సీనియర్‌ రెడిసెంట్) వైద్యులను నియమించారు. నలుగురు జనరల్‌ మెడిసిన్‌, ఇద్దరు చొప్పున జనరల్‌ సర్జన్లు, ఆర్థోపెడిక్‌,  పిల్లల వైద్య నిపుణులు, ఒకరు పల్మనాలజిస్టు, ఒకరు చర్మవ్యాధి నిపుణులు, మిగతా ఇతర వైద్యనిపుణులున్నారు. వీరు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ చూస్తున్నారు. తర్వాత ఆసుపత్రిలో చేరిన రోగులకు చికిత్సలు, అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటున్నారు.


జిల్లా వాసులకు మెరుగైన వైద్యం..
డాక్టర్‌ సంజీవయ్య, డీసీహెచ్‌ఎస్‌, భూపాలపల్లి

కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలు జిల్లా ఆసుపత్రికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఓపీ పెరిగింది. వివిధ రకాల శస్త్ర చికిత్సలు ఈ ఆసుపత్రిలోనే చేస్తారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.


మరింత కృషి చేస్తా..œండ్ర వెంకట
వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్యే భూపాలపల్లి

వంద పడకల ఆసుపత్రిలో కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందనున్నాయి. శస్త్రచికిత్సల విభాగం అందుబాటులోకి రానుండటం సంతోషం. సీఎం కేసీఆర్‌ అడగగానే జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశారు. త్వరలోనే అందుబాటులోకి రానుంది. మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తా.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts