logo

తల్లీ.. కరుణించు!

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ నిండు జాతర రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆదివారం తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

Published : 30 Jan 2023 05:18 IST

గంట కొడుతున్న యువతి

మేడారం(మంగపేట), న్యూస్‌టుడే: మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ నిండు జాతర రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆదివారం తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేశారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు ఇష్టమైన బంగారం, ఒడి బియ్యం, చీరె, సారె, పూలు, పండ్లు సమర్పించారు. చిన్నపిల్లలకు తలనీలాలు సమర్పించారు. శివరాంసాగర్‌ చెరువు, ఆర్టీసీ బస్టాండ్‌, జంపన్నవాగు, చిలకలగుట్ట తదితర ప్రదేశాల్లోని చెట్లకింద విడిది చేసి భక్తులు వంటలు చేసుకున్నారు. బంధుమిత్రులను ఆహ్వానించి వింధు భోజనాలు వడ్డించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ గౌష్‌ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం, సీఐ శంకర్‌, ఎస్సైలు వెంకటేశ్వర్‌రావు, కరుణాకర్‌రావు తదితరులతో చిన్నజాతర ఏర్పాట్లపై ఎస్పీ చర్చించారు. దేవతల గద్దెలపైకి భక్తులు వచ్చిపోయే విధానాన్ని పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించాల్సిన పద్ధతులపై చర్చించారు. మేడారం పరిసరాల్లో వాహనాల నియంత్రణ, క్యూలైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు జాగ్రత్తలు చెప్పారు. భక్తజన సంద్రంతో మేడారంలో సందడి నెలకొంది.


వనదేవతల సేవలో ఎస్పీ

వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను ఆదివారం జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం దర్శించుకొన్నారు. ఓఎస్డీ అశోక్‌కుమార్‌, ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ కిర్త్‌తో కలిసి వచ్చిన ఎస్పీకి పూజారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. దేవతలను దర్శించుకొన్న అనంతరం ఎస్పీ, ఓఎస్డీ, ఏఎస్పీలను పూజారుల సంఘం అధ్యక్షుడు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.


ఎత్తు బంగారంతో బాలుడు

ఒడి బియ్యంతో భక్తులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని