logo

కుక్క కాటు.. ఎంజీఎంకు పరుగు!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్‌ కుక్కకాటు టీకాలు అందుబాటులో ఉన్నాయి.

Published : 04 Mar 2023 03:17 IST

ఆరోగ్య కేంద్రాల్లో టీకా ఉన్నా వైద్యులు రాక ఇబ్బందులు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్‌ కుక్కకాటు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయినా బాధితులు దూరభారం లెక్క చేయకుండా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండక ఇంతదూరం రావాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు వైద్యుడు పరీక్షించి సూచించకుండా టీకా ఇవ్వలేమని సిబ్బంది అంటున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. దీంతో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండే ఎంజీఎంకు బాధితులు వస్తున్నారు.

ఎంజీఎం ఆసుపత్రిలోని కుక్కకాటు ఇంజక్షన్‌   ఇచ్చు గది వద్ద బాధితులు

* రెండురోజుల కిందట కాశీబుగ్గ పోచమ్మగుడి వద్ద ఇంటిముందు ఆడుకుంటున్న రోహిత్‌(7) అనే బాలుడిని కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. వారికి దగ్గరలోనే కాశీబుగ్గలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది. అక్కడకు వెళ్లి బాలుడికి టీకా ఇప్పించకుండా ఎంజీఎంకు తీసుకొచ్చారు. కారణాలు అడిగితే టీకా ఉంది కానీ వైద్యుడు లేడు.. అందుకే ఎంజీఎంకు వచ్చామని బాధితులు తెలిపారు.

* జనగామ జిల్లా చాగల్లుకు చెందిన బాలుడిని కుక్కలు గాయపర్చగా ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇంత దూరం ఎందుకు వచ్చారు అక్కడే ఆసుపత్రి ఉందిగా అంటే... వైద్యులు లేరని సమాధానమిచ్చారు.

ఆరోగ్య కేంద్రాల్లో నిల్వలు

ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో యాంటి రాబిస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. వరంగల్‌ కేంద్ర ఔషధ గిడ్డంగి నుంచి అన్ని ప్రాథమిక, పట్టణ, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు గత జనవరి నుంచి ఇప్పటి వరకు 16,286 వ్యాక్సిన్లు సరఫరా చేశారు. అవసరమైన ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్‌ ఇవ్వడానికి 23,600 వ్యాక్సిన్లు నిల్వ ఉన్నట్లు కేంద్ర ఔషధ గిడ్డంగి ఫార్మసీ సూపర్‌వైజర్‌ ఉప్పు భాస్కర్‌రావు తెలిపారు.

మీకు తెలుసా..

*  వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రతిరోజు కుక్కకాటు టీకా తీసుకోవడానికి 65 మందికిపైగా బాధితులు వస్తున్నారు. అంటే నెలకు 2 వేలకు పైగానే ఉంటారు.
* కుక్కకాటుకు గురైన వారిని వైద్యులు పరీక్షించి కరిచిన కుక్కరకం, శరీరానికి అయిన గాట్లు, గాయాన్ని బట్టి రేబిస్‌ వ్యాధి రాకుండా టీకా కోర్సు రాస్తారు. ఇందులో 3-7-14-28-90 రోజుల కోర్సు వాడాల్సి ఉంటుంది.


పల్లెల్లో కోతుల బెడద సైతం..

బోనులో బంధించిన కోతులు

నర్సంపేట, న్యూస్‌టుడే: పట్టణంతో పాటు డివిజన్‌ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోజూ ఏదో ఓ గ్రామంలో వాటి దాడిలో గాయ పడుతున్న సంఘటనలున్నాయి. నిరుడు ద్వారకపేటలో పిచ్చికుక్క జరిపిన దాడిలో  15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. గత ఫిబ్రవరిలో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో కుక్కలు దాడి చేయగా తొమ్మిది గొర్రెలు మృతి చెందగా నాలుగు గొర్రెలకు గాయాలయ్యాయి. నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి నెలలో కుక్కలు చేసిన దాడిలో గాయపడిన 125 మందికి, కోతుల దాడిలో గాయపడిన 10 మందికి ఆంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం సర్కార్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 125 ఆంటీ రేబీస్‌ వాయిల్స్‌ అందుబాటులో ఉన్నట్లు ఫార్మాసిస్టు మాధవి తెలిపారు.


జాగ్రత్తలు తీసుకోవాలి

డాక్టర్‌ ఎ.రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌ ఫిజిషియన్‌

కుక్కకాటు అయిన చోట ఎంతగాయమైన కుట్లు వేయరు. కాబట్టి  గాయమైన చోట నీటితడి తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఇన్ఫెక్షన్‌ అయ్యే ప్రమాదం ఉంది. గాయమైన చోట రోజూ యాంటీ సెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేసుకోవాలి. గాయమైన దగ్గర చీము పట్టకుండా వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్‌ మాత్రలు వాడాలి.  


కొరత లేదు

డాక్టర్‌ సాంబశివరావు, డీఎంహెచ్‌వో, హనుమకొండ

కుక్కకాటు, కోతి కాటు, పాము, తేలు కాటుకు సంబంధించిన టీకాను జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. ఎక్కడా కొరత సమస్యలేదు. పెద్దగాయాలైన వారిని మాత్రమే ఎంజీఎంకు పంపిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని