logo

నిబంధనలు మరిచారు.. అంధకారం నింపారు

‘పట్టణ ప్రగతి నిధులతో అత్యవసరమైనవి, దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులుగా ఎంపిక చేసి చేపట్టాలి. పాత విద్యుత్తు స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం, నివాస గృహాలు, కాలనీల్లో వేలాడే కరెంటు వైర్ల తొలగింపు పనులు అత్యవసరంగా చేపట్టాలి.

Published : 21 Mar 2023 04:15 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

వరంగల్‌ పాపయ్యపేట పెద్ద మోరి  వద్ద పాత విద్యుత్తు స్తంభాలు

‘పట్టణ ప్రగతి నిధులతో అత్యవసరమైనవి, దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులుగా ఎంపిక చేసి చేపట్టాలి. పాత విద్యుత్తు స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం, నివాస గృహాలు, కాలనీల్లో వేలాడే కరెంటు వైర్ల తొలగింపు పనులు అత్యవసరంగా చేపట్టాలి. ఈ నిబంధనలు పాటించని బల్దియా అధికారులు, పాలకవర్గం నగరాన్ని చీకటిలో మగ్గేలా చేశారు. చిన్నపాటి గాలులకే విద్యుత్తు సరఫరా నిలిచిపోయి దాదాపు 12 గంటలకు పైగా పౌరులు ఇబ్బందిపడ్డారు.

నగర పాలక సంస్థ పట్టణ ప్రగతి నిధులను అత్యవసర పనులకు కేటాయించడం లేదు. కార్పొరేటర్లు, గుత్తేదారులు అడిగిన పనులకే నిధులు కేటాయిస్తున్నారు. తొలి ప్రాధాన్యంగా పాత విద్యుత్తు స్తంభాల తొలగించి కొత్తవి బిగించడం, కొత్త వైర్లు ఏర్పాటుచేయడం చేయాలి. టీఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలి. నగరంలో వీటిని విస్మరించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి ఇతర పనులే ప్రతిపాదిస్తున్నారు.  గ్రేటర్‌ పరిధిలో 25- 30 ఏళ్ల క్రితం నాటి ఇనుప విద్యుత్తు స్తంభాలు తుప్పుపట్టాయి. వాటిని తొలగించక పోవడంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసినప్పుడు కూలుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వడగళ్లవానకు విద్యుత్తు వ్యవస్థ అంతా దెబ్బతింది. ఇందుకు కారణం తీగలు సక్రమంగా లేకపోవడం, విద్యుత్తు స్తంభాలు నేల వాలడమే. ఫలితంగా శనివారం రాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్తు సరఫరాను ఆదివారం మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరించారు.

మూడు వేల స్తంభాలు అవసరం

* ‘నగరంలోని 66 డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అత్యవసరంగా చేయాల్సిన 2550 పనులు గుర్తించారు.
* పాతవి తొలగించడం, కొత్త కాలనీల్లో ఏర్పాటు చేసేందుకు సుమారు 3 వేల విద్యుత్‌ స్తంభాలు అవసరముంటాయని తేల్చారు. ఏడెనిమిది నెలలవుతున్నా ఒక్క స్తంభం కొనుగోలు చేయలేదు.
* విలీన గ్రామాలు, కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో 34 కాలనీల్లో వేలాడే విద్యుత్‌ వైర్లు తొలగించాలని గుర్తించారు. వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని స్థానికులు భయపడుతున్నారు.

శాఖల మధ్య సమన్వయం లేకనే

* నగరంలోని 66 డివిజన్లలో కొత్తగా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసేందుకు గ్రేటర్‌ వరంగల్‌, టీఎన్పీడీసీˆఎల్‌ శాఖల మధ్య సమన్వయం లేదనే విమర్శలున్నాయి. పాతవి తరలింపు, కొత్తవి ఏర్పాటు చేసే స్తంభాలకు టీఎన్పీడీసీˆఎల్‌ ఇంజినీర్లు ప్రతిపాదనలు ఇవ్వాలి. గ్రేటర్‌ వరంగల్‌ ఇంజినీర్లు వాటిని పరిశీలించి తగిన నిధులు విడుదల చేయాలి. రెండు శాఖల నిర్లక్ష్యంతో రెండు రోజుల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. రామన్నపేట గంగపుత్ర వీధి, రఘునాథ్‌ కాలనీల్లో వేలాడే కరెంటు తీగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


పునరుద్ధరణ కాని విద్యుత్తు సరఫరా

శివనగర్‌ శ్రీశివవిఘ్నేశ్వర ఆలయం ముందు మరమ్మతులు చేపట్టని విద్యుత్తు స్తంభం

శివనగర్‌, న్యూస్‌టుడే: 35వ డివిజన్‌ శ్రీశివ విఘ్నేశ్వరాలయం ముందు రెండు రోజుల క్రితం వడగండ్ల వాన, గాలులకు పడిపోయిన విద్యుత్తు స్తంభాన్ని సోమవారం రాత్రివరకు కూడా విద్యుత్తు అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో మూడురోజులగా ఆ ప్రాంత వాసులు విద్యుత్తు లేక తల్లడిల్లుతున్నారు. ఈనెల 19న తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ ఆలయం ముందు విరిగిపోయిన స్తంభాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తిచేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించినా అధికారులు కన్నెత్తి చూడలేదు. అధికారులు తక్షణమే విద్యుత్తు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని