logo

ఉద్యమాల గడ్డ.. నర్సంపేట

అడవులు.. ఆదివాసీ గూడేలు.. గిరిజన తండాలు.. మైదాన ప్రాంతాల కలబోతగా అవతరించిన నర్సంపేట నియోజకవర్గం సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

Updated : 31 Oct 2023 06:04 IST

నియోజకవర్గం ముచ్చట

నర్సంపేట, న్యూస్‌టుడే : అడవులు.. ఆదివాసీ గూడేలు.. గిరిజన తండాలు.. మైదాన ప్రాంతాల కలబోతగా అవతరించిన నర్సంపేట నియోజకవర్గం సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. హైదరాబాద్‌ స్టేట్‌లో పాకాల నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1956లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నర్సంపేట నియోజకవర్గంగా ఏర్పడింది. 70 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రాంతం ఆది నుంచి కమ్యూనిస్టుల పోరాటాల ఖిల్లాగా ఖ్యాతి పొందింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇక్కడ 735 రోజులు నిరాటంకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకత సంతరించుకుంది. పునర్విభజనకు ముందు చెన్నారావుపేట మండలంలోని అత్యధిక గ్రామాలు, గూడూరు మండలంలోని సగం గ్రామాలు, పూర్వపు కొత్తగూడ, నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలంలో నాలుగు గ్రామాలు మినహా, ఆత్మకూరు మండలంలోని కామారం, పెంచికలపేట, ములుగు మండలంలోని పత్తిపల్లి ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. పునర్విభజన తర్వాత నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాలు ఉన్నాయి. ఒకప్పుడు హత్యా రాజకీయాలకు ఆలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గం 1994 ఎన్నికల తర్వాత రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పులు చోటుచేసుకొని అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది.

పాకాల అభయారణ్యం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పాకాల అభయారణ్యానికి ప్రత్యేకత ఉంది. 1972లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ అభయారణ్యం నెలకొల్పారు. వరంగల్‌ జిల్లాలోని ఖానాపురం మండలం చిలకమ్మనగర్‌ నుంచి ఇటు మహబూబాబాద్‌, అటూ ములుగు జిల్లాల వరకు 86020 హెక్టార్లలో(861 చదరపు కి.మీ.)విస్తరించి ఉన్నట్లు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జింకల పార్కు ఉండేది. నక్సల్స్‌ ప్రభావం పెరగడంతో 1995లో ఇక్కడి జింకల పార్కును హనుమకొండలోని వనవిహార్‌కు తరలించారు. అభయారణ్యంలో 145 రకాల పక్షులుండగా అడవి దున్నలు, దుప్పులు, జింకలు, లేళ్లు, కొండగొర్రెలు, ఎలుగుబంట్లు, హైనా వంటి వన్యప్రాణులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. పాకాల సరస్సులో మంచినీటి మొసళ్లు ఉన్నాయి. నిరుడు ఇక్కడి అడవుల్లో చిరుత, పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు.

సాయుధ పోరాటం నుంచి..

పాకాల, కొత్తగూడ, నల్లబెల్లి మండలాల్లోని అటవీ ప్రాంతం కేంద్రంగా నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్‌బరి ఉద్యమాలు జరిగాయి. భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్దఎత్తున భూ పోరాటాలు జరిపి పేదలకు వేలాది ఎకరాల భూములు పంచారు. గ్రామాల్లో వెట్టిచాకిరి, పాలేర్ల సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి పేదల బతుకుల్లో మార్పునకు నాంది పలికిన ఘన చరిత్ర ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాకతీయుల నాటి పాకాల చెరువు(సరస్సు)కింద ఏటా 25 వేలకు పైగా ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. వరంగల్‌ చపాట మిర్చి సాగుకు నర్సంపేట పేరుగాంచింది. నెక్కొండలోని రైల్వేస్టేషన్‌ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. విద్యా, వ్యాపారం, స్థిరాస్తి రంగాల్లో ప్రగతి సాధించింది. రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ కలిపి మొత్తం 65 మిల్లులున్నాయి.


ఇప్పటివరకు ఎన్నికైన ఎమ్మెల్యేలు


సంవత్సరం         విజేత     సమీప ప్రత్యర్థి
1952(పాకాల) ఆరుట్ల గోపాల్‌రావు  (పీడీఎఫ్‌) జమలాపురం కేశవరావు (కాంగ్రెస్‌)
1957 కె.కనకరత్నమ్మ (కాంగ్రెస్‌) అర్శనపల్లి వెంకటేశ్వర్‌రావు (పీడీఎఫ్‌)
1962 అర్శనపల్లి వెంకటేశ్వర్‌రావు(సీపీఐ) కాసర్ల సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్‌)
1967 కాసర్ల సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్‌) అర్శనపల్లి వెంకటేశ్వర్‌రావు(సీపీఎం)
1972 మద్దికాయల ఓంకార్‌ (సీపీఎం) పెండెం కట్టయ్య (కాంగ్రెస్‌)
1978 మద్దికాయల ఓంకార్‌(సీపీఎం) గంట ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్‌)
1983 మద్దికాయల ఓంకార్‌ (స్వతంత్ర) పెండెం కట్టయ్య (కాంగ్రెస్‌)
1985 మద్దికాయల ఓంకార్‌ (స్వతంత్ర) ఎం.ఉపేందర్‌రావు (కాంగ్రెస్‌)
1989   మద్దికాలయ ఓంకార్‌ (స్వతంత్ర) ఏపూరి జనార్దన్‌రెడ్డి (కాంగ్రెస్‌)  
1994 రేవూరి ప్రకాశ్‌రెడ్డి (తెదేపా) మద్దికాయల ఓంకార్‌ (ఎంసీపీఐ)
1999 రేవూరి ప్రకాశ్‌రెడ్డి (తెదేపా) దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్‌)
2004 కంభంపాటి లక్ష్మారెడ్డి (తెరాస) రేవూరి ప్రకాశ్‌రెడ్డి (తెదేపా)
2009 రేవూరి ప్రకాశ్‌రెడ్డి (తెదేపా) దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్‌)
2014 దొంతి మాధవరెడ్డి (స్వతంత్ర) పెద్ది సుదర్శన్‌రెడ్డి (తెరాస)
2018 పెద్ది సుదర్శన్‌రెడ్డి (తెరాస) దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్‌)


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని