logo

చివరి శ్వాస వరకూ ప్రజా సంక్షేమమే ఊపిరిగా..

‘నూకల రామచంద్రారెడ్డి గొప్ప మేధావి. తెలంగాణ కోసం తపించారు. ఆయన చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన కాంస్య విగ్రహాన్ని మహబూబాబాద్‌లో నెలకొల్పుతాం.. పెద్ద ఇనిస్టిట్యూట్‌కు త్వరలోనే ఆయన పేరు పెడతాం’..

Updated : 18 Nov 2023 05:40 IST

‘నూకల రామచంద్రారెడ్డి గొప్ప మేధావి. తెలంగాణ కోసం తపించారు. ఆయన చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన కాంస్య విగ్రహాన్ని మహబూబాబాద్‌లో నెలకొల్పుతాం.. పెద్ద ఇనిస్టిట్యూట్‌కు త్వరలోనే ఆయన పేరు పెడతాం’.. అంటూ జూన్‌లో మహబూబాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో రామచంద్రారెడ్డి విగ్రహం నెలకొల్పేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇటీవల ఆయన పేరు పెట్టారు.

మానుకోట, న్యూస్‌టుడే : శాసనసభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించడం, అందులో ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత నూకల రామచంద్రారెడ్డికే దక్కింది. 1957, 1962, 1967లో డోర్నకల్‌ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజాసమస్యలను శాసనసభలో ప్రస్తావించిన నేతగా, రైతుల పక్షపాతిగా, తెలంగాణ ఉద్యమ నేతగా ఆయనకు పేరుంది. రాజకీయ దురంధరుడిగా, గాంధేయవాదిగా పేరు తెచ్చుకున్నారు. రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితులు.

గాంధీజీ పిలుపుతో జాతీయోద్యమంలోకి..

రామచంద్రారెడ్డి మహబూబాబాద్‌ జిల్లాలోని జమాండ్లపల్లి గ్రామంలో జనవరి 11, 1919లో జన్మించారు. 1974లో మరణించారు. వీరికి ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. భూస్వామ్య కుటుంబానికి చెందిన వారైనా ఆయన నాటి దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పనిచేశారు. తెలంగాణ ప్రాంతంలో వినోబాభావే స్థాపించిన భూదాన్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చదువుతుండగా హైదరాబాద్‌లో జరిగిన స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడానికి వందేమాతరం ఉద్యమం ఆయనను పురిగొల్పింది. ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనను కళాశాల నుంచి బహిష్కరిస్తే నాగపూర్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఆయన ఉన్నత విద్యను వదిలేసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1956లో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. పలుసార్లు జైలుకు కూడా వెళ్లారు. 1969-71 మధ్యకాలంలో శాసనసభలో తెలంగాణ ప్రజాసమితి నాయకుడిగా తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.

వివిధ శాఖలకు మంత్రిగా..

1960లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో వ్యవసాయం, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1962లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, భూసంస్కరణలు, పునరావాస శాఖ మంత్రిగా పనిచేశారు. 1964లోనూ అవే శాఖల్లో మంత్రిగా పనిచేశారు. 1973లో వెంగళరావు మంత్రివర్గంలో ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ  మంత్రిగా పనిచేశారు. పదవీ కాలం ముగియక ముందే మరణించారు.

భూ సంస్కరణలకు మద్దతునిస్తూ ప్రసంగం..

భూస్వామ్య కుటుంబానికి చెందినప్పటికీ.. రాంచంద్రారెడ్డి ఆనాడు అమలు చేసిన భూసంస్కరణలకు తన మద్దతునిచ్చారు. 1958లో శాసనసభలో రెవెన్యూ పద్దులపై ప్రసంగిస్తూ హైదరాబాద్‌ కౌలుదారీ చట్టం 47వ సెక్షన్‌లో లోపాలున్నాయని దానిని పూర్తిగా తీసివేయాలన్నారు. ఆయన భూసంస్కరణల మంత్రిగా పనిచేసినప్పుడు కౌలుదారులకు రక్షణ కల్పించే రెవెన్యూ చట్టాలల్లో సమూలమైన నిబంధనలు పొందుపరిచారు. నాడు లంబాడీలు తెలంగాణ ప్రాంతంలో బీసీలుగా ఆంధ్రప్రాంతంలో ఎస్టీలుగా ఉన్నారు. ఒకేజాతి వారు వేర్వేరు ప్రాంతాల్లో ఇలా ఉండడం సరికాదని తెలంగాణలోనూ వారిని ఎస్టీల్లో చేర్చాలని ఆయన కేబినెట్‌లో నోట్‌ పెట్టి ఆమోదింపజేశారు. రైతు సంక్షేమ చట్టాలను తీసుకురావడంలో కృషి చేశారు.. భూస్వాములు తెల్ల కాగితాలపై రైతుల భూములను రాయించుకుని  ఆక్రమణలకు పాల్పడితే 50బీ చట్టం కింద రైతులకు రక్షణ కల్పించి రెవెన్యూ శాఖ ద్వారా పట్టాలు వచ్చేలా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు