logo

విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు

ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు.

Published : 28 Mar 2024 04:20 IST

న్యూస్‌టుడే, రంగశాయిపేట, మడికొండ: ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామ చెరువులో ఆస్ట్రేలియా నుంచి వలసొచ్చిన స్పెర్‌ విగ్డ్‌, ల్యాప్‌ వింగ్‌ పక్షులు సందడి చేస్తున్నాయి. రాతి కొండల మధ్యలో ఉన్న చెరువు.. సేదతీరేందుకు చెట్లు.. ప్రశాంతంగా అడవిని తలపించే విధంగా ఉండటంతో దీనిని ఆవాసంగా మార్చుకున్నాయి. ఇక్కడ జనసంచారం తక్కువగా ఉండటంతో స్వదేశీ పక్షులతో పాటు విదేశీ విహంగాలు తరలివస్తున్నాయి. తెలుపు, నలుపు రంగుల్లో ఉండే ఈ పక్షులను చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వస్తున్నారు.

స్వదేశీ, విదేశీ పక్షులు కలిసి నీళ్లలో ఆడుకుంటూ, ఆకాశంలో కలిసి విహరించే దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సందర్శకులు తమ కెమెరాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆనందిస్తున్నారు. ఉదయం వేళల్లో పెద్దఎత్తున చెరువు గట్టు పరిసరాల్లో సేదతీరుతున్న ఈ పక్షులు.. ఎండ పెరుగుతున్న కొద్దీ చెట్ల కొమ్మలపై చేరి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఏటా జనవరి  చివరలో విదేశీ పక్షులు వచ్చి అమ్మవారిపేట తటాకంతో పాటు చుట్టూ ఉన్న నీటి వనరుల్లో విహరిస్తాయని పర్యావరణ ప్రేమికుడు గాదె స్వరూప్‌రెడ్డి తెలిపారు. మూడునెలల పాటు ఇక్కడే ఉండి.. సంతానోత్పత్తి చేసుకొని చెరువులో నీరు తగ్గుముఖం పట్టగానే తమ పిల్లలను వెంట తీసుకొని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని