logo

యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ

వరంగల్‌, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు.

Published : 29 Mar 2024 06:05 IST

రామన్నపేట, న్యూస్‌టుడే : వరంగల్‌, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. ఆలయాల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు రెవెన్యూ, భూమి, కొలతలు, దేవాదాయ, గ్రేటర్‌ వరంగల్‌ శాఖల అధికారులు నిర్ధారించారు. సుమారు 20.81 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు లోకాయుక్త న్యాయస్థానానికి నివేదించింది.  ఆక్రమణల తొలగింపునకు వచ్చేసరికి అడ్డంకులు మొదలయ్యాయి. గత ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలంటే అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి కదలాలి.  హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు చొరవ చూపితే ఆక్రమణల తొలగింపు సాధ్యమవుతుందని దేవాదాయశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇతర ప్రభుత్వ శాఖలు సహకరించడం లేదని అన్నారు.

అక్రమాల చిట్టా ఇలా..

  • హనుమకొండ పద్మాక్షి ఆలయం, హనుమకొండగుట్టల భూములు మొత్తం 72.23 ఎకరాలు ఉండాలి. వీటిలో 6.22 ఎకరాల భూమిని ఆక్రమించారు. 6 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వీటిలో ఇద్దరు, ముగ్గురు పెద్దలున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ అనధికారికంగా శ్మశానవాటిక  నిర్మించింది.
  • హనుమకొండలో శ్రీరంగనాయక స్వామి(పెద్ద కోవెల) దేవస్థానం పేరిట 14.19 ఎకరాల భూమి ఉండగా 4.06 ఎకరాలు ఆక్రమణకు గురైంది. 28 అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పెద్దమ్మగడ్డ వద్ద వాణిజ్య వ్యాపారాలు నడుస్తున్నాయి.
  • హనుమకొండలోని సిద్ధేశ్వరస్వామి ఆలయానికి 24.03 ఎకరాల భూములు ఉండగా 2.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు, ఇతర పెద్ద భవనాలున్నాయి. భవనాల నిర్మాణానికి గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ అనుమతులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వడం లేదు.
  • హనుమకొండ వీరపిచ్చమాంబ దేవాలయం పేరిట 1.14 ఎకరాల భూమి ఉంది. లీజుల పేరుతో పెద్ద భవంతులు కట్టారు. అపార్టుమెంటు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు.
  • వరంగల్‌లో వేణుగోపాలస్వామి ఆలయం పేరిట కొత్తవాడ కూడలిలో స్థలాలున్నాయి. సుమారు 1.10 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు  దేవాదాయ శాఖాధికారులు చెబుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

రాష్ట్ర కమిషనర్‌ ఆగ్రహం

దేవాలయాల భూముల ఆక్రమణపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు, న్యాయస్థానాల్లో కేసుల తాజా పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వరంగల్‌ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. చిన్నా చితక అక్రమ నిర్మాణాలను  తొలగించి ఆలయాల పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని