logo

జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు

భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

Published : 19 Apr 2024 04:49 IST

మన ఎంపీలు..

ఈనాడు, వరంగల్‌: భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రోగ్రెసీవ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్ (పీడీఎఫ్‌) అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మన తొలి ఎంపీ పెండ్యాల రాఘవరావు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆయనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని అప్పటి ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. జైలులో ఉండగానే వరంగల్‌ ఎంపీగా, హనుమకొండ, వర్ధన్నపేట స్థానాల నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసిన పెండ్యాల బరిలో దిగిన మూడు చోట్ల నుంచి గెలుపొందడం విశేషం. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం చిల్పూరు మండలం చిన్నపెండ్యాల అప్పటి ఉమ్మడి వరంగల్‌ వీరి సొంతూరు. సాయుధ పోరాటంలో చురుగ్గా ఉద్యమం చేసిన రాఘవరావుకు సంఘసంస్కర్తగా పేరుంది. అంటరానితనంతో సమాజం పెడపోకడలు పోతున్న ఆ రోజుల్లో తన ఇంట్లో హరిజనులతో సహపంక్తి భోజనం చేశారు.

కాళోజీని ఓడించారు..: రాఘవరావు తొలిసారి వరంగల్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయగా కాంగ్రెస్‌ నుంచి ప్రజాకవి కాళోజీ నారాయణరావు బరిలో నిలిచారు. పెండ్యాల కాళోజీపై 3,613 ఓట్ల తేడాతో గెలుపొందారు. మూడు చోట్ల నెగ్గినా.. హనుమకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసి వరంగల్‌ ఎంపీగా కొనసాగారు. పార్లమెంటులోనూ తన వాగ్దాటితో అనర్గళంగా ప్రసంగించారు. సంస్థానాలను విలీనం చేసినప్పుడు జమీందార్లు, జాగీర్దార్లకు పారితోషకాలు రూ.లక్షల్లో ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. స్త్రీల హక్కులపై నినదించారు. 1957 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌ఏ ఖాన్‌ చేతిలో ఓడిపోయారు. ‘నా ప్రజాజీవితం’ అనే ఆత్మకథను రాఘవరావు రాశారు. స్వగ్రామం పెండ్యాలలో రాఘవరావుకు విగ్రహం కూడా నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని