logo

మరాడించలే.. లెక్కచూపలే

జిల్లాలో సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది.

Published : 20 Apr 2024 01:51 IST

మిల్లుల్లోనే పేరుకుపోయిన ధాన్యం
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

రైసు మిల్లులో ధాన్యం బస్తాలు

జిల్లాలో సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. మర ఆడించేందుకు రైస్‌మిల్లులకు ఇస్తోంది. జిల్లాలోనూ అదే మాదిరిగా పలు రైస్‌ మిల్లులకు సీఎంఆర్‌ నిమిత్తం ధాన్యాన్ని కేటాయించింది. కానీ, ఆశించిన మేర మరాడించడం లేదు. మరోవైపు యాసంగి పంటలు కోతకు వచ్చాయి. ఈ ధాన్యాన్ని కూడా మిల్లులకు కేటాయిస్తారు. దీంతో రెండు సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్‌ ప్రక్రియ కష్టమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

16.18 శాతమే పూర్తి..

ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు ఇస్తారు. ధాన్యంలో 67 నుంచి 68 శాతం బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. గత వానాకాలం సీజన్‌లో 24 మిల్లులకు 51,620 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సీˆఎంఆర్‌కు ఇచ్చారు. ఇప్పటికే కనీసం 30 శాతమైనా బియ్యం ఇవ్వాల్సి ఉన్నా.. మరాడించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కేటాయించిన లక్ష్యంలో ఇప్పటివరకు వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్‌ ఈ నెల 11వ తేదీ వరకు కేవలం 16.18 శాతం మాత్రమే పూర్తికావడం గమనార్హం. కేటాయించిన మిల్లులు కూడా జిల్లాకు చెందినవే.. కానీ, అనుకున్న స్థాయిలో సీఎంఆర్‌ జరగడం లేదు.

మిల్లులపై నిఘా అవసరం

మిల్లులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సీఎంఆర్‌ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది. గతేడాది కాటారం, మొగుళ్లపల్లికి చెందిన రెండు మిల్లులు సకాలంలో బియ్యం ఇవ్వకపోగా.. ధాన్యాన్ని కూడా చూపించలేదు. ఇప్పటికీ దాదాపు 700 టన్నుల ధాన్యం లెక్కలు తేలలేదు. ఆ రెండు మిల్లులపై చర్యలు తీసుకున్నారు. అలాగే గతంలో చిట్యాల మండలంలోని ఓ రైసు మిల్లు నుంచి మరో రైసు మిల్లుకు బియ్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇలాంటి అవకతవకలు జరగకుండా నిఘా పెట్టాలి. అలాగే లక్ష్యానికి తగినట్లుగా సీఎంఆర్‌ను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

యాసంగి ధాన్యం సేకరణకు సిద్ధం

యాసంగి సీˆజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 200 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఆరంభించారు. అటు వానాకాలం, యాసంగి ధాన్యంతో మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో నిల్వకు, మరాడించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. సీˆఎంఆర్‌ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.


మే నెలలో పూర్తిచేస్తాం

రాఘవేంద్ర, డీఎం, పౌరసరఫరాల శాఖ

సీఎంఆర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వేగవంతం చేసి సకాలంలో బియ్యం ఇవ్వాలని మిల్లుల యజమానులకు ఆదేశాలిచ్చాం. జూన్‌ వరకు గడువున్నా మేలో పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నాం. యాసంగి ధాన్యంతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.


గత వానాకాలం సీˆఎంఆర్‌ వివరాలు..

మిల్లుల సంఖ్య: 24
కేటాయించిన ధాన్యం: 51620.320 మె.ట
ఇవ్వాల్సిన బియ్యం: 34585.614 మె.ట
అందించిన బియ్యం: 5597 మె.ట
పెండింగ్‌: 28988.614 మె.ట
పూర్తయిన శాతం: 16.18
పెండింగ్‌ శాతం: 83.82

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని